Wednesday, February 5, 2025

 _
           #యాండీ_అందరూ_బోన్నారాండీ.. 
           #నేను_గోదావరి_ఎక్స్ప్రెస్సునండీ.. !

**ప్రతీ డివిజన్కి స్పెషల్ అనదగ్గవి కొన్ని బళ్ళుంటాయి కదండీ..
 మా సౌత్ సెంట్రల్ రైల్వేలో నా పొజిషన్ అదేనన్నమాటండీ..!! 

యాభైఏళ్ళ నుంచి విశాఖనగరం-భాగ్యనగరంల మధ్య నాన్ స్టాప్గా తిరుగుతున్న నేనంటే వల్లమాలిన అభిమానం మా కోస్తావాళ్ళకి.. 
ఎంత గారాబం చేస్తారో అసలు..!! గోదావరి ఎక్స్ప్రెస్ ఔటర్లోకొచ్చేసిందంటే ఎంత తోపు బండైనా ప్లాట్ఫార్మ్ ఖాళీ చెయ్యాల్సిందే.. లైన్ మీద ఎంత పెద్ద బండున్నా మనకి సైడివ్వాల్సిందే.. అందుకే నన్ను సౌత్ సెంట్రల్ రాణీ అని పిలుచుకుంటారు..♥️♥️

సీజన్లతో సంబంధం లేకుండా మనకి ఎంత డిమాండ్ అంటేనండీ.. కంకణం లేకుండా తిరుపతెళ్తే ఎంకన్నబాబు దర్శనమన్నా అవ్వుద్దేమోగానీ రిజర్వేషన్ లేకుండా నా బోగీల్లో సీటు మాత్రం దొరకదండీ.. అంత ఇరగబడి ఉంటారు జనాలు మరి..!!
విలేజీల్నుంచి సిటీకెళ్లేవోళ్ళు గోదావరెక్స్ప్రెస్సని ప్రేమగా పిలుచుకుంటే సిటీలో స్థిరపడ్డామని చెప్పాలనుకున్నోళ్లు 'గొడావెరి' ట్రైనని స్టైలుగా హొయలు పోతారు.. ఎవరెలా పిలుచుకున్నా అందర్నీ ఒకేలా లాక్కెళ్తాను.. 
ఇప్పుడంటే బుల్లి రెక్కలున్న డొమెస్టిక్ విమానాలొచ్చి వీఐపీల్ని అటూ అటూ తిప్పుతున్నాయ్ గానండీ.. ఓ పది పదిహేనుయేళ్ళ క్రితం దాకా నా పేరు చెప్తే మా సర్కిల్లో నన్ను వీఐపీ బండి అనేవారు గదేంటండీ..!!
కానీ నాకు మాత్రం అందరూ ఒకటేనండీ.. ♥️♥️♥️

అన్నట్టు అందర్నీ ఎక్కించుకుని వైజాగ్ నుంచి ఇప్పుడే బయదేల్లేను.. ఈ పెయాణంలో మనకి తగిలే కొంతమందిని చూసొద్దాం రండి..!!
స్టీల్ ప్లాంట్లో చేస్తన్న ఈశ్వర్రావు గారి పిల్లలు వరంగల్ ఎళ్తన్నారంట వాళ్ళ మేనత్తగారింటికి.. దువ్వాడలో ఎక్కబోయే ఆ పిల్లల అల్లర్ని రాత్రి తెల్లవార్లూ భరించాల్సిందే.. తప్పదు..!!
ఖమ్మం అవతల కూసుమంచి నుంచొచ్చి యలమంచిలిలో కొత్తగా కాపురం పెట్టిన మోహన్, స్వప్నల్ని పదిలంగా స్లీపర్లో కూర్చోబెట్టుకున్నాకా ఏటికొప్పాక బొమ్మల కోసమైనా నర్సీపట్నం రోడ్డులో ఆగాలి..

తునిలో తమలపాకు లోడు ఏయించుకోవాలి.. అది లోడయ్యేలోపులో ఈ మధ్యనే బీటెక్కయ్యి జాబు కోసం ఎతుక్కుంటున్న రాజ్ కుమార్ని జార్తగా ఎక్కించుకోవాలి.. సంచుల్నిండా ప్రసాదం పొట్లాలతో అన్నవరం ప్లాట్ఫార్మ్ మీద ఎదురుచూస్తన్న మూర్తిగారి ఫేమిలీ కోసం ఆగాలి..

హైద్రాబాద్ bhel లో ఈ మజ్జినే రిటైరయ్యేరండీ శర్మగారని..!! పిఠాపురంలో దత్తపాదుకలు ఉన్నాయంటే దర్శనం చేసుకోవడానికి పాదగయ వొచ్చేరు పొద్దున్నే సతీసమేతంగా.. అల్సర్ పేషంటయిన వాళ్ళావిడగారికి మధ్యాహ్నం తిన్న భోజనం తేడా జేసిందని ఒకటే గాభరాగా ఉన్నారు ఆ పెద్దావిడ.. రేపొద్దున్న టిఫిన్ వేళకల్లా ఇంటికి జేరుకుని వాళ్ళ కోడలి చేత్తో వేడివేడి ఇడ్లీ తినకపోతే తప్ప ప్రాణం కుదుటపడేలా లేదని ఇప్పటికే మూడుసార్లు విసుక్కున్నారు.. నా ఎనౌన్స్మెంట్ వింటే తప్ప మామూలు మనిషవ్వరేమో..!!
సామర్లకోటలో నల్లూరి రాముగారి పెద్దమ్మాయ్ ఉమాదేవి.. చక్కనిచుక్కండీ నిజంగా... అందానికే ముద్దొచ్చేలా ఉండే ఆ అమ్మాయికి పాపం కాలు ఏదో తేడా వచ్చి నడవలేకపోయేసరికి ఎక్కడ చూపించినా పనవ్వక ఆఖరికి హైదరాబాద్ తీసుకెళ్తన్నారు.. వీల్ చైర్లో కూర్చోబెట్టిన ఆ పాపని జాగ్రత్తగా సెకండ్ ఏసీలోకి ఎక్కించేదాకా ఒక్క నిముషం ఎక్కువ ఆగితే సరిపోద్ది.. ఆల్రెడీ టేషన్ మేష్టారితో మాట్లాడుకున్నారని కబురందింది.. పోన్లెండి మనుషుల కంటేనేంటండీ..!!!

ఎక్కువసేపు ఆగితే కడకి చేరేసరికి లేటైపోద్దేమోనని మీరు కంగారడకండి.. మధ్యలో ఎంత లేటయినా 
హైదరాబాద్ ప్లేట్ఫారం మీద టయ్యానికి నిలబెట్టే పూచీ నాది..!! అన్నట్టు ఈ కాకినాడోళ్ళకి మా చెల్లెలు గౌతమిని, తణుకు భీమవరం జనాలకి ఇంకో చెల్లిని ఇచ్చినాగానీ నా డిమాండ్ మాత్రం తగ్గట్లేదు బాబా.. ఈళ్ళ అభిమానం సల్లగుండా అని.. 
అనపర్తిలో ఆగినప్పుడు హైద్రాబాదు ఖరీదుకెళ్లే రెడ్లకుర్రోళ్ళు ఎక్కుతారు.. 
అదిగో చూస్తా ఉండగానే రాయిమండ్రి వచ్చేసింది.. రాజమండ్రిలో ఒక నాలుగు నిముషాలు ఆగుతాలెండి.. మామిడితాండ్ర ముక్కలాంటిదో లేక పాలకోవాబిళ్ళలో పుచ్చుకోండి బోంటాయి..
అన్నట్టు రాయిమండ్రి టేషన్లో జనాల హడావుడి చూశారా..!! ఈళ్ల ప్రేమలు పాడుగానూ.. ఇంటి దగ్గర చెప్పుకుంది చాలక రన్నింగ్ ట్రైన్ కిటికీల్లోకి చేతులు పెట్టి ఊపాలా "బై" అని.. రేయ్ కుర్రోళ్లారా.. మిమ్మల్నేరా..!!!"

హలో మేషారూ.. ప్లాట్ఫార్మ్ సాక్షిగా మీ ఆవిడ మీద ఒలకబోసిన ప్రేమ చాలుగానీ ఇంటికెళ్లి నువ్ పెట్టాలనుకున్న దుకాణం పెట్టరా నాయనా ఇంకో పదిరోజులు నిన్ను ఆపేవాళ్ళెవ్వరూ లేరుగానీ..!!
యాండీ రామారావుగారూ.. మన పిల్ల ఆ సిటీలో బెమ్మాండంగా ఉంటాది గానీ మీరేం కంగారడకండి.. ముందు మీ ఆవిడ గారిని ఓదార్చండి.. మీరు పాపది ఆ చెయ్యి వదలండి చెప్తాను..
రేయ్ బులుగు చొక్కా.. ఆ పచ్చ చుడీదార్ పిల్లని చూస్తా సెల్లుని ఓ తెగ పిసికెయ్యకు.. టికెట్ మెసేజ్ డిలీట్ ఐపోయిందంటే టీటీ మాయ్యొచ్చి గోదాట్లోకి గెంటెయ్యగలడు..!!"
హమ్మయ్య.. 
టేషన్ దాటేసి బ్రిడ్జెక్కేసామ్.. 
నాలుగు నిముషాలుపాటు అన్నీ మర్శిపోయి  భయమెక్కువున్నోళ్లు గుండెని చిక్కబట్టుకోండి, ధైర్యం ఎక్కువున్నోళ్లు కడుపునిండా చల్లటి గాలి పీల్చుకోండి.. ఈ రెండూ గాక డబ్బులెక్కువున్నోళ్లు నదిలోకి డబ్బులు ఇసరండి.. 

ఇక బ్రిడ్జి దాటేసింది కాబట్టి ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోరో, పెరుగన్నమో ఉంటాది గదా.. తినేసి బెర్తులు వాల్చెయ్యండి ఇంకెందుకూ..!! పక్కలేసేస్తే ఓ గొడవ వొదిలిపోద్ది..!!
అంతా బాగానే ఉందిగానీ శనక్కాయలు, సమోసాలు, టీ కాఫీలు అమ్మేవాళ్ళ హడావుడి, జనరల్ బోగీలో సీట్ల కష్టాలు, నన్ను అందుకోవాలని పరిగెత్తే కనెక్టింగ్ బస్సులు, షేరాటో సర్వీసుల గురించి చెప్పలేదేం అని కేకలేస్తారేమో.. ఇప్పటికే బాగా పొడుగెక్కువైపోయింది కదండీ.. అందుకే  ఒదిలేహేను.. 
కాబట్టి విజయవాడెళ్లాకా ఇంకోసారెప్పుడైనా కలుద్దాం..!! చుక్ చుక్ చుక్.. ❤️

No comments:

Post a Comment