మంచితనం ఒక ముసుగు
రచన లక్ష్మి మదన్
_____________________
మన జీవితాలను మనం ఎలా మలుచుకుంటామని ఒక ప్రణాళిక వేసుకోము. ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కూడా ఉండదు.
ఉదాహరణకి మనం ఒక సమయంలో ఎంత బిజీగా ఉంటామో మనకే తెలియదు. ఆ సమయంలో మన ఇంటికి చెప్పా చేయకుండా వచ్చే అతిధులు ఉంటారు. ఒకప్పుడు అంటే ఫోన్ సౌకర్యాలు లేవు. కానీ ఈ రోజుల్లో కూడా అలా చేసే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో మనం ఏం చేస్తాము?" అయ్యో ఎక్కడినుండో మన కోసం వచ్చారు కదా" అని మన పనులను పక్కనపెట్టి కొంత మొహమాటంతో, కొంత ఏమనుకుంటారో అనే భావనతో మన సమయాన్ని అది కూడా విలువైన సమయాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము. పోనీ వచ్చినవాళ్లు అంత క్వాలిటీ పనితో వచ్చారా అంటే అదీ లేదు. ఉత్త మాటలు మాత్రమే మాట్లాడటానికి వస్తారు. ఇలా చాలామందికి జరుగుతుంది.
కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు ఆడవాళ్లకు చెప్పకుండానే అతిథులను ఆహ్వానిస్తారు. భోజనాలకు రమ్మని పిలుస్తారు.
కొంతమంది అట్లీష్ట్ పిలిచిన తర్వాత ఇన్ఫర్మేషన్ భార్యకి ఇస్తారు. అది కొంతవరకు బెటర్ .మరి కొంత మంది వాళ్లు వచ్చేంత వరకు ఎవరు వస్తున్నారో తెలియదు. భోజనానికి వస్తున్నారని అసలే తెలియదు. అప్పుడు ఇంట్లో ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుంది? సమయానికి ఇంట్లో సరుకులు ఉంటాయా ?ఎన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇలాంటివి ఆలోచించని మగవాళ్లు చాలామంది ఉంటారు.
మగవాళ్ళనే తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది ఆడవాళ్లు కూడా ఇలాగే ఉంటారు. అవసరమున్న, లేకున్నా బోలెడు మందిని ఇంటికి ఆహ్వానించి రకరకాల వంటలు చేసి, ఎవరినో మెప్పించడానికి తాపత్రయపడుతుంటారు. ఇంట్లో ఉన్న వారి ఇబ్బందిని అసలే గమనించుకోరు.
నేను కొన్ని *యండమూరి వీరేంద్రనాథ్* గారి మాటలు విన్న తర్వాత దీనికి నిజమైన అర్థం తెలుసుకున్నాను. అది ఏంటంటే *మంచితనం అనేది ఒక ముసుగు* మాత్రమే. మనని మంచి అనుకోవాలి అని చెప్పి మనము మన పనులను వాయిదా వేసుకుంటాము. మన సమయాన్ని వృధా చేసుకుంటాము. పోనీ వచ్చిన వారితో గడచిన సమయం అద్భుతంగా ఉందా? అంటే అది ఉండదు. కొంతమంది మనల్ని నొప్పించడానికి వస్తారు. కొంతమంది ఏదో ఆశించి వస్తారు. హృదయపూర్వకంగా వచ్చేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్ల కోసం మనం మన సమయాన్ని వృధా వేసుకున్నా పర్వాలేదు. మన పనిని వాయిదా వేసుకున్న పర్వాలేదు. కానీ కొన్నిసార్లు ఆ పని వాయిదా వేసుకుంటే, మళ్ళీ మనకి సమయం దొరకదు. ఆ పనిని పూర్తి చేసుకోవడానికి.
ఇన్ఫర్మేషన్ ఇయడానికి ఈ మధ్య ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పుడు, చెప్పా చేయకుండా వెళ్లి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు?
అందుకే ఎవరికి వాళ్లు ఒక నియమితమైన పరిధిని గీసుకోవాలి అనేది తెలుసుకున్నాను.
ఎప్పుడూ జీవితంలో ఎవరో ఏదో అనుకుంటారని బ్రతకడమేనా? అలా అనుకుంటే మనకోసం మనం బ్రతకకుంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లే కదా?
అలాగని స్వార్థపూరితంగా మన కుటుంబం, మనమే ఉండాలని నేను అనుకోవడం లేదు. కానీ మనకి కూడా మనం సమయం ఇచ్చుకోవాలి. ఇవ్వకుంటే మన జీవితానికి అర్థం ఏముంది? ఇంత మంచి జన్మ మనకు దొరికినందుకు దానికి సార్ధకత ఇంకేముంది?
మనం ఎవరింటికైనా వెళ్ళినా, మన దగ్గరికి ఎవరైనా వచ్చినా మెసేజ్ పంపడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి కదా! వారికి ఆ సమయంలో ఇబ్బందిగా ఉందా? ఇంకా ఏవైనా పనులు ఉన్నాయా? అనేది ఆలోచించుకుంటే, వాళ్లు సుఖంగా ఉంటారు. టైంపాస్ కబుర్ల కోసము మరొకరి విలువైన సమయాన్ని వృధా చేయడం కూడా తప్పే కదా!
ఇలాంటివి ఇప్పటికీ చాలామంది కుటుంబాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ అనుకోని అథితుల వల్ల, మన ఇంట్లో మనమే పరాయిగా ఉండాల్సి కూడా రావచ్చు.
ఒక్కొక్కసారి మనసు కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు. అవతలి వ్యక్తులు వచ్చినప్పుడు మాట్లాడటానికి. మనుషులం కదా! భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సమతుల్యం చేసుకోవడానికి మనకి టైం పడుతుంది.
ఇది నాకు జరిగిన సమస్య అని నేను చెప్పడం లేదు. జనరల్ గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది గమనించి నేను రాస్తున్నాను.
నిజంగానే మంచితనం అనే పరదాలు తీసేస్తే, మనల్ని మనం గుర్తించుకుంటాము. మనకోసం సమయం కేటాయించుకుంటాము.
ఒంటరితనం అనేది శాపం కాదు. నిన్ను నీవు గుర్తించుకోవడానికి ఒక వరం. ఆ సమయంలో భగవంతుడి సేవ చేసుకుంటావో! ఇష్టమైన పనులే చేసుకుంటావో! ఏం చేసుకుంటాం అనేది అది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. బ తికిన కొన్ని రోజులు ఇంకా ఎవరి గురించో ఆలోచిస్తూ బ్రతకడం కన్నా, తనని తాను గుర్తించుకొని ,తనకు ఇష్టమైన వారి గురించి, వారి ఆశయాల గురించి సంకల్పం చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం.
ఈ సాధనలో, లేదా ఈ అన్వేషణలో భగవంతుడు సాక్షాత్కరిస్తాడా? లేదా? నీవు అనుకున్నది నెరవేర్చుకుంటావా? అనేది నీ ఇష్టమే. అనుకున్నది నెరవేరింది అంటే కూడా అది భగవంతుడి దర్శనమే కదా! పనిలోనే దేవుడు ఉన్నాడు అని నమ్మే వారు ఎందరో ఉంటారు అది నేను దగ్గరుండి నా భర్తలో చూశాను.
ఒక వయసు దాటాక నీకు ఇష్టమైన పనినే చేసుకో. కష్టమైన పనిని చేయడానికి ఆత్రుత పడకు. నిజంగానే యండమూరి గారి సూక్తులు ఒక మంత్రంలాగే పని చేస్తున్నాయి. *మంచితనం ముసుగు తీసేయ్* అదే నేను పాటించాలని అనుకొని, ఒక వ్యాసం రాస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment