Wednesday, February 5, 2025

 *మన* *ఆరోగ్యం* 

రచన : లక్ష్మి మదన్

🪷🪷🪷🪷🪷🪷🪷

ఈ మధ్య కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైంది .అందుకు తోడుగా మనకు ఆరోగ్యం గురించి యూట్యూబ్లో ప్రవచనాలు చెప్పే డాక్టర్లు బోలెడు మంది.

"ఓన్లీ గింజలే తినాలి" అని ఒకరు చెప్తారు.

 "ప్రోటీన్ మాత్రమే తినండి "అని మరొకరు చెప్తారు.

"పండ్లు మాత్రమే తినండి" అని ఒకరు చెప్తారు.

" నూనె, నెయ్యిని అసలు దరిదాపులకు రానీయ వద్దు" అంటారు.

ఇక తినే తిండిలో ఏముందంటారు? ఏదైనా పరిమితిగా తింటే పరవాలేదు. అతిగా తింటే ఏదైనా అనర్థమే.

రుచి వస్తుందా నూనె లేకుండా ? నూనె లేకుండా కూడా వంటలు చేయొచ్చు అంటారు. నూనె లేకుండా రుచి ఎలా వస్తుంది.

చక్కగా పప్పు చేశామనుకోండి. ఏ పప్పు అయినా పర్వాలేదు. పాలకూర, చుక్కకూర, దోసకాయ, టమాటో ఇలా ఏ పప్పు చేసినా, ఉప్పు, కారం సమపాళ్లలో వేసిన తర్వాత చక్కగా పోపు బాండ్లీ పెట్టి అందులో ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఘుమఘమలాడే ఇంగువ కాస్త కరివేపాకు తగిలించి పోపు పెడితే ఉంటుందీ! ఆహా ! రుచి అంటే అది.

పోపుకు మన వంటల్లో ప్రశస్తమైన స్థానం ఉంది. ఎప్పుడైనా పోపు మాడిపోయింది అనుకోండి,
"ఏంటి ఇవాళ్ళ వాడ పోపు పెట్టావా" ? అని అడుగుతారు.

చక్కని పోపు గుమాయించేలా పెడితే, "ఆహా వంట అదిరింది ఈరోజు" అంటారు.

అలా నూనె లేకుండా పోపు పెట్టగలమా?

గుత్తి వంకాయ వండాము అనుకోండి. అందులో ఒకే చుక్క నూనె వేసి చేయగలమా! కాస్త నూనె బాండ్లీలో ఎక్కువగానే జార విడిచి, మసాలా కూరిన వంకాయలను నూనెలో వేసి, మూత పెట్టి మగ్గించి చేస్తే ఎంత బాగుంటుందో!

మరి కాకరకాయ వండితే చుక్క నూనెలో వండగలమా? కాస్త నూనె పడితేనే ఆ చేదు పోయి మొక్కలకి ఉప్పు కారము, పులుపు, బెల్లము అంటించుకుని మనకి కంచంలోకి వచ్చి నోరూరిస్తుంది.

సరే ఇలా రుచిగా ఉన్నాయి కదా అని మనము రోజు అంతంత నూనెలు వేసుకొని వండుకోము. కానీ, పప్పులో పోపు పడాల్సిందే. కూరల్లో ఓ మోస్తారుగా వేస్తాము.

ఎప్పుడో ఓసారి మిర్చి బజ్జి తింటామా! మరి నూనె లేకుండా మిర్చి బజ్జి వస్తుందా ? మిరపకాయలను చీల్చి అందులో మసాలా కూర్చి సెనగపిండిలో ముంచి, నూనెలో వేసి, సయ్యున గోలిస్తే ఎంత బాగుంటుంది. ఈ వీధిలో చేస్తే పక్క వీధిలోకి వాసన వస్తుంది.

పులిహోర చేస్తే వేసి వేయకుండా నూనె వేస్తే అసలు రుచిగా ఉంటుందా ? చింతపండు పులుసు అన్నానికి పట్టించి, బాణలిలో కాస్త నూనె దట్టించి, అందులో ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా వేగనిచ్చి అన్నంలో కలిపితే కానీ పులిహోర తయారయ్యి కంటికి నోటికి ఇంపూ అవుతుంది.

అలాగని రోజు ధారాళంగా నూనెలో గోలించినవి తింటే ప్రమాదమే. ఎప్పుడో ఒకసారి తినకుంటే మరి మన ఆత్మ రాముడు ఎలా సంతోషిస్తాడు ? కోటి విద్యలు కూటికొరకే అన్నట్టుగా, ఎప్పుడూ నోరు కట్టేసుకుంటే, తినాలని కోరికను చంపేసుకుంటే, ఇంత బ్రతుకు బ్రతుకు ఏం లాభం. కాస్త రసవంతంగా ఉండాలి కదా జీవితం.

నూనె, నెయ్యి తినకుండా కంట్రోల్ చేసిన వాళ్ళ మొహం చూస్తే ఎలా ఉంటుందో ? ఎప్పుడైనా గమనించారా ? పాలిపోయినట్లుగా ఉంటుంది. చర్మంలో  మెరుపు ఉండదు. పొడిబారినట్లుగా కనిపిస్తారు. అదే నూనె తగుపాలలో తిన్నవాళ్ళ ముఖం మెరుస్తూ ఉంటుంది.

ఎప్పుడో ఒక ఆదివారం స్టవ్ మీద బాండ్లీ పెట్టి కొన్ని అప్పడాలు, కొన్ని వడియాలు వేయించుకుని తింటామా ? లేదా ? ఇందులో అంత నూనె ఉందా ? ఇంత నూనె ఉందా ? అని ఆలోచిస్తే మనం తినే తిండి కూడా ఒంటికి పట్టకుండా పోతుంది.

ఇవేవీ ఆలోచించకుండా తిన్నప్పుడు తృప్తిగా తినేసి, ఆ తర్వాత మనం ఒంటికి శ్రమను కలిగిస్తే ఆటోమెటిగ్గా బ్యాలెన్స్ అవుతుంది.

డైటింగ్ పేరుతో మొత్తం నోరు కట్టేసుకుని ఉంటే శరీరంలో బలం లేకుండాపోయి, సైజు జీరో మాత్రం ఉంటుంది. చివరికి చిన్న పిల్లలు ఎడం చేత్తో నెట్టితే కూడా పడిపోయేంత బలహీనంగా ఉంటారు కూడా.

ఇంటెక్ మరియు అవుట్ ఫుట్ సరిగా ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సన్నగా ఉన్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళంతా అనారోగ్యాల పాలైన వాళ్ళని అనుకోవడానికి వీల్లేదు.

శరీరాల తత్వాల ప్రకారం మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి శరీర నిర్మాణం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు అలా కావాలని అనుకోవడం అవివేకం అనే నేను అంటాను.

కాకపోతే ఇంట్లో చేసినవి ఏవైనా కూడా ఆరోగ్యానికి మంచివే. ఈ మధ్యకాలంలో తినేలాంటివైతే శరీరానికి అనర్ధాన్ని తెచ్చి పెడతాయి.. బటర్ చీజ్ బర్గర్లు పిజ్జాలు ఇలా తయారైన వాటిల్లో ఎక్కువ ఫాట్స్ ఉంటాయి. సాల్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటివల్ల అనర్థాలు జరుగుతాయేమో, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుని తగిన మోతాదులో తింటే ఏ హాని ఉండదు. మన ఆత్మ కూడా సంతృప్తిగానే ఉంటుంది . నాలుక కోరుకున్న ఆహారం అప్పుడప్పుడు ఇవ్వాల్సిందే

 *ఆరోగ్యమే* **మహాభాగ్యం*

No comments:

Post a Comment