Wednesday, February 5, 2025

 *Smt* Chengalvala *Kameswari* 

రేయంతా చల్లో వణికి
రెప్పెయ్యకుండా గడిపి
ఒళ్లంతా బరువయినాది
కళ్లేమో ఎరుపయనాయి

తెల్లారేదాకా నువ్వు 
తలుపు మూసి తొంగుంటే 
తగువెట్టా తీరేదే 
తలుపు తీయవే భామా!(సూర్యా)

 *శుభోదయం*  *మిత్రాస్* ! ఈ మధ్య నిన్నటిదాకా సూర్యనారాయణగారు ప్రకటించిన మెరుపు సమ్మెకి మనమంతా ఇలాగే పాడుకోవాల్సివచ్చింది.

"ఎప్పటిదమ్మా ఈ పాట! ఒళ్లు వేడెక్కించే చలిపాటలు ఐటమ్ సాంగ్స్ బోలెడు ఉండగా"  ఈ పాత పాట అనుకోకండి. జేసుదాస్ గారిపాటల్లో నాకిష్టమయినపాట మా చిన్నప్పుడు రేడియోలో శ్రోతలు కోరిన సినిమాపాటల లో అనేకసార్లు విన్న గుర్తు.

మీరు చెప్పే ఇప్పటి "జిల్ జిల్ జిగేలురాణే" "రింగ రింగా ! లాంటి ఐటమ్ పాటలు కూడా వింటాము, పాడుకొంటాము కూడా కాని, మాకే వినపడేట్టుగా, మరీ బామ్మలుగా, అమ్మమ్మలుగా అవతారాలు మారాక పబ్లిక్కులో ఇలాంటి పాటలు పాడుకోలేంగా! అంతేగా! అంతేగా! 

అన్నట్లు పెళ్లయి కొత్తకాపురానికి మొదటిసారి  ఆగ్రా వెళ్లినప్పుడు అక్కడి చలికి హడిలిపోయాను. ఎవరు మాట్లాడుతున్నా నోట్లోంచి పొగలు వచ్చేవి.నేను మాట్లాడుతున్నా పొగలు వస్తుంటే, వింతగా ఉండేది. నవ్వొచ్చేది.

మొత్తానికి ఎన్నో మొక్కులు మళ్లీ మొక్కి కబుర్లమీద కబుర్లు చెప్పి నిన్నంతా అదే పనిమీద ఉండి ఆరోగ్య ప్రధాత సూర్యనారాయణ మూర్తి గారిని నాతో తీసుకొచ్చాను కదా! ఆయనకీ నాకు మీరు సకల మర్యాదలు చేసుకోవాలి. 

అయినా ఈ జంటనగరాల చలికే ఇలా అయితే మరి ఉత్తరాది చలికి ఏమవుతారో మన భామలు బామ్మలు. 
మన దేశంలో బోర్డర్ కావల  ఇలాంటి చలి పులితో సావాసం చేస్తూ మనందరికీ ప్రహరా కాసే భారతీయ సైనికుల నిరంతర త్యాగాలకు కఠోర నియమాలకు
మనందరం శిరసు వంచి వందనాలు చేయాలి.

విదేశాలలో అయితే తెల్లని మంచువర్షంలో స్నానం చేసిన మంచుకొండలు, మంచు నిండిన రోడ్లు నీరంతా గడ్డ కట్టిన నదులు.
ఇక్కడలా పనిమనుషులు వగైరాలు ఉండవు. ఆడామగా తేడా లేక అన్ని పనులు చక్కబెట్టుకుని కార్లమీద పేరుకున్న మంచు రోడ్లమీద ఉన్న మంచుని సైతం స్కేపర్లతో తొలగించుకోడం ఒక ఎక్స్ట్రా పని. అలా చేయడం వలన  నడుం నొప్పితో బాధపడే వారెందరో! 

పాపం దేశంకాని దేశాలు విదేశాలలో చదువుకని వెళ్లినా, ఉద్యోగాలకని వెళ్లినా అక్కడి వాతావరణానికి ఎడ్జస్ట్ కావటం  మేధావులుగా  విద్యా సంపత్తితో వెలుగొందే మన యువతను చూస్తే ఆనందంగా ఉంటుంది.

అలాగే గల్ఫ్ దేశాలలో పనిచేసే కార్మికుల ఘర్మజలాలకు ఖరీదు కట్టే షరాబులున్నారు కాని, అక్కడి  అత్యధిక ఉష్ణోగ్రత, తట్టుకోవడం మాటలు కావు. 

మాయల పకీరు ప్రాణం ఏడు సముద్రాలకావల మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్లు మన పంచప్రాణాలు ఇలా భారత దేశానికి దూరంగా సప్తసముద్రాలావల ఉండే మన బంగారు తండ్రులు, బంగారు తల్లులు మీద ఉంటాయి. అవునా!

 సైంటిస్టులుగా డాక్టర్స్ గా, సాఫ్ట్ వేర్ సాంకేతిక నిపుణులుగా, డబ్బు పేరు గణిస్తూ కుటుంబాలతో స్థిరపడినా అప్పుడప్పుడు ఇలా ఆటవిడుపుగా ఎగిరొచ్చే వసంత కోయిలలే మనకి. ఇంటికొకరయినా ప్రవాస భారతీయులుగా విదేశాలలో ఉంటున్నారు.

వచ్చేప్పుడు తమ ఆప్తులకందరికీ  పేరు పేరునా ఏవో ఒకటి తెచ్చేవాళ్లకి మనందరం చిన్నవాళ్లమయిపోతాము. సంబరపడి పోతాము. వాళ్ల దగ్గరకి మనమెప్పుడయినా ఎగురుకుని వెళ్లినా, వాళ్ల కనుసన్నల్లో మనం తప్పిపోకుండా ఉండేందుకు, చేయందుకు నడిచే చిన్నారులయిపోతాము. 

అలా వెళ్లి చూసినప్పుడే వాళ్లు ఎంత శ్రమైక జీవులో! తెలుస్తుంది. మనం గగ్గోలు పెట్టే చిన్న చిన్న  విషయాలకే మాత్రం చలించని పరిణతి, నిదానం, నిరాడంబరత. చూస్తాము. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే  వాళ్లని చూస్తే మనం గర్వంతో ఉప్పొంగుతాము. ఒక్కసారి ఈ క్షణంలో మన పిల్లలని తల్చుకోండి. హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది కదా

వాళ్లు ఇండియాకొచ్చినప్పుడు  పెళ్లిళ్లుఫంక్షన్స్ కి, మన సంప్రదాయ పండుగలకీ తప్ప వారిలో ఆడంబరత కనిపించదు.

ఏది ఏమయినా చలికాలమయినా, వర్షాకాలమయినా, మండు వేసవికాలమయినా, దైనందిక జీవన విధానం మారదు. 
ఎక్కడున్నా ఎలా ఉన్నా మన *బాలయ్య*  బాబు చెప్పినట్లు
"తినే తిండి మారుతుంది కట్టే బట్ట మారుతుంది
ఒంట్లో బ్లడ్ ఎలా మారుతుంది ? 
మనం త్రాగే కాఫీ ఎలా మారుతుంది ? అన్నది నా ఉవాచ!
అది మన మూలాలనే వేతుకుతుంది.
ఇలా చలిగా ఉందని రగ్గులో దూరామా! ఇంక బైటకే రాలేము.

పోవే చలీ!  ఇటు రాకే చలీ
నిన్ను తరిమికొడ్తాము. మా చెలియతో
వేడి కాఫీలతో, పొగర్బత్తీలతో, ఝండూ పంచారిష్టలతో, 
కాంప్ ఫైర్ లతో, స్వెట్టర్స్ వేసి
మఫ్లర్స్ చుట్టి హేండ్స్ కి గ్లౌస్ వేసి కాళ్లకు  సాక్సులు వేసి బూట్ తొడిగి
చలిపులిని ఎదుర్కుంటాము.
వచ్చే ఏడు వరకు తరిమికొడ్తాము.
ఎలా ఉందండీ నాతవిక అదే కవిత!
హాయిగా ఇదే చదువుకుంటూ చలిని తరమండి. ఇవండీ ఇవాళ్టి మన
వేడి కాఫీ కబుర్లు.

No comments:

Post a Comment