Sunday, March 23, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

144. రక్షతి తపసా బ్రహ్మచారీ

బ్రహ్మచారి తపస్సుతో రక్షిస్తున్నాడు (అథర్వవేదం)

ఈ మంత్రం అథర్వవేదంలో 'బ్రహ్మచారి'కి సంబంధించిన సూక్తంలోనిది.

ఇది వేద సంప్రదాయ ప్రకారంగా వేదాధ్యయనం చేసేవానికి, బ్రహ్మవిద్యా సాధకునకు సంబంధించి అర్థాలతో వ్యాఖ్యానిస్తారు.

అయితే - దీనిలో ఉన్న భావాన్ని నేటి విద్యార్థికి కూడా అన్వయించడం అశాస్త్రీయం కాదు కనుక, ఆ కోణంలో పరిశీలిద్దాం.

'బ్రహ్మము' అనే మాటకు వేదం, జ్ఞానం, తపస్సు, విద్య, పరమాత్మ - అనే అర్థాలున్నాయి. వీటినే పరమార్థంగా భావించి కృషి చేసేవాడు 'బ్రహ్మచారి'.

విద్య కోసం తపించడమే బ్రహ్మచారి తపస్సు.

విద్య నేర్చుకొనే దశలో పవిత్రత, నియమపాలన చాలా అవసరం.

కేవలం విషయాలనుతెలుసుకోవడమే విద్య - అని భావించడం పొరపాటు.

‘విద్య’ ఒక దేవత - ఒక శక్తి. అంతే కానీ, జడం కాదు. ఆ చైతన్య స్వరూపమైన విద్య మనకు ఒంటబట్టాలంటే - ఆ శక్తి స్వయంగా మనల్ని అనుగ్రహించాలి.

అందుకే దానికి తగిన జీవిత విధానం ఉండాలి. అదే 'తపస్సు'. విద్యార్థికి ఒక నియమబద్ధమైన జీవనసరళిని మన శాస్త్రాలు నిర్దేశించాయి.

(అ) గురువుపట్ల వినయ సంపద, విధేయత, భక్తి కలిగి ఉండాలి.

(ఆ) నేర్చుకున్న విషయాలను వల్లె వేస్తూ, సాటి విద్యార్థులతో చర్చించాలి.

(ఇ) సూర్యోదయానికి మునుపే నిద్రలేచి అధ్యయనం చేయాలి.

(ఈ) సంధ్యాసమయాలలో సూర్యమండలాంతర్గతమైన భగవత్స్వరూపాన్ని ధ్యానించి,
ప్రార్థించాలి.

(ఉ) విద్యపై ఆసక్తి, ఏకాగ్రత, దానిని ఆలోచించడం నిరంతరం ఉండాలి. 'తప ఆలోచనే' అనే ధాతువు ననుసరించి, విద్యార్థి బుద్ధికి పదును పెట్టాలి. విన్న విద్యని విచారణతో పుష్టి చేసుకోవాలి.

(ఊ) భోగలాలస కూడదు. లౌకిక విషయాలు చర్చలు కూడదు. వినోదాల పేరుతో విద్యనీ, నియమాలనీ అతిక్రమించరాదు. ఇంద్రియనిగ్రహంతో కూడిన ప్రవర్తన
విద్య యొక్క తేజస్సును మనలో నింపుతుంది. అలా సంపాదించిన విద్య రాణిస్తుంది. అటువంటి విద్యావేత్త సంఘానికి హితకరుడౌతాడు. ఆ విధమైన శిక్షణ విద్యార్థికి ఇవ్వాలి.
-
బ్రహ్మచర్యం వలన పటిష్టమైన వ్యక్తిత్వం అలవడుతుంది. అమోఘ శక్తి ప్రాప్తిస్తుంది అని స్వామీ వివేకానంద స్వానుభవంతో చాటి చెప్పారు.

పై చెప్పిన నియమబద్ధమైన విద్యార్థి జీవనశైలికి విరుద్ధంగా ఉన్న వ్యవస్థలు నేడు కనిపిస్తున్నాయి. అందుకే విద్యార్థిదశలో రాజకీయాలు, వినోదాలు, ఇంద్రియ చాపల్యాలు, రాగద్వేషాలు, కామక్రోధోద్వేగాలు పనికిరానివి. ఇవి తపస్సును
దెబ్బతీస్తాయి.

ఈ మంత్రాన్ని చెబుతున్న సందర్భంలో ఒక అద్భుత భావాన్ని ఋషి దర్శించాడు.

'బ్రహ్మచారి తపస్సు గురువును రక్షిస్తుంది'..

నియమబద్ధంగా విద్యనార్జించే విద్యార్థి వలన గురువుగారి విద్య రక్షింపబడుతుంది.

ఆ విద్యార్థి ద్వారా గురువు శాశ్వతుడౌతాడు. సచ్ఛిష్యుల ద్వారా వన్నెకెక్కిన గురుచరిత్రలు పురాణాల్లో చాలా ఉన్నాయి.       

No comments:

Post a Comment