Monday, March 31, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-4594️⃣5️⃣9️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                   
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*42. వ శ్లోకము:*

*”శమో దమ స్తపశ్శౌచం క్షాన్తి రార్జవమేవ చl*
 *జ్ఞానం విజ్ఞానమా స్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ll”*

“ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, తపస్సు చేయడం అంటే అనుకున్న పనిని ఒక తపస్సు లాగా శ్రద్ధాభక్తులతో చేయగలగాలి. శరీరాన్ని మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, తన జీవనానికి కావలసిన వరకే సంపాదించుకోవాలి కాని ఎక్కువ సంపదలు, సుఖాల జోలికి పోకూడదు. శరీరమును, మనస్సును శుచిగా ఉంచుకోవడం, ఓర్పువహించడం, కపటం లేకుండా, సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండటం, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులో అనుకున్నది, మాటలతో చెప్పేది, చేతలతో చేసేది ఒకే విధంగా ఉండాలి. నిరంతరం వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానం సంపాదించడం, సంపాదించిన జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకొని, ఇతరులకు మార్గదర్శకం చేయడం, దేవుడిని నమ్మడం, వేదముల మీద, శాస్త్రముల మీద నమ్మకం కలిగి వాటిని నిరంతరం అధ్యయనం చేయడం, గురువు గారి యందు భక్తి కలిగి ఉండటం, ఇవి అన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావ సిద్ధంగా పుట్టినవి. ఈ కర్మలు ఆచరిస్తేనే అతడిని బ్రాహ్మణుడు అని అంటారు.”
```
‘స్థూలంగా చెప్పాలంటే వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం, వాటిని శిష్యులకు బోధించడం, ఆ విధంగా వేదవిజ్ఞానాన్ని గురుశిష్య పరంపరగా, తల్లితండ్రులు తమ కుమారులకు ఇచ్చే వారసత్వసంపదగా తరతరాలుగా వ్యాప్తిచెందించడం, మానవులను ధర్మమార్గంలో నడిపించడం. దీనినే బ్రాహ్మణ కర్మలు అని అంటారు. ఇవి చేయని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా, కర్మరీత్యా, స్వభావ రీత్యా బ్రాహ్మణుడు కాడు అనే విషయం చెప్పనక్కరలేదు.```


*43. వ శ్లోకము:*

*”శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్l*
 *దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ll”*

“ధైర్య శౌర్యపరాక్రమాలు కలిగి ఉండటం, తేజస్సు కలిగి ఉండటం, ఎదుడి వాడితో పోరాడే సామర్థ్యం కలిగి ఉండటం, అందరినీ పాలించే సామర్థ్యం, అందరినీ అదుపులో పెట్టగలిగే నేర్పు శాసించగల స్థైర్యం కలిగి ఉండటం, అమితమైన పట్టుదల కలిగిఉండటం, పిరికితనం, యుద్ధంలో పారిపోయే బుద్ధి లేకుండా ఉండటం, పేదలకు, అర్హులకు దానధర్మాలు చేయడం, పరిపాలనా దక్షత, న్యాయశాస్త్ర నైపుణ్యము కలిగి ఉండటం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా క్షత్రియుడే. బ్రాహ్మణుడు తన బుద్ధిని ఉపయోగిస్తే, క్షత్రియుడు తన శరీరాన్ని, బుద్ధిని రెండింటినీ ఉపయోగిస్తాడు. బ్రాహ్మణుడు మంత్రిగా మంత్రాంగం చేస్తే, క్షత్రియుడు తన క్షాత్రంతో దానిని సమర్థవంతంగా ఆచరిస్తాడు. అందుకే ముందు నుండి బ్రాహ్మణ, క్షత్రియులకు అవినాభావ సంబంధం ఉంది.”
```
దేశాల మధ్య జరిగే యుద్ధాలలో సైనికులుపాల్గొంటారు. ధైర్యంతో పోరాడతారు. కాని, మనలో కూడా ప్రతిరోజూ మంచి చెడులకు మధ్య ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అవునా కాదా.... అనే సమస్యలు... 
ఈ విరుద్ధభావాల మధ్య నిరంరతం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొంత మంది భయపడి పిరికి వాళ్ల లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి కొందరు ఎటువంటి సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి కొందరు సమస్యలకు భయపడి పారి పోతారు. దైనందిన సమస్యలను ఎదుర్కోడంలో ప్రతివాడూ క్షత్రియ గుణమును ప్రదర్శించాలి. వాడే క్షత్రియ స్వభావము కలవాడు. పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడితే వాడికి క్షత్రియ స్వభావము లేనట్టే. అంతే కాకుండా క్షత్రియ స్వభావాలలో పరిపాలన, న్యాయ నిర్ణయం ముఖ్యమైనవి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ పరిపాలన, న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి వేళ్లూనుకు పోయింది. అధికారంలో ఉన్న రాజకీయనాయకులు, కార్యదర్శి స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు ఈ అవినీతి ఊబిలో చిక్కుకుపోతూ ఉంది. ఇటువంటి వారిని క్షత్రియ స్వభావం కలవారు అని అనలేము. క్షత్రియుడి మూలస్వభావము అవినీతి రహిత జీవనము, నిస్వార్ధపరత్వము, నిష్పక్షపాతము. ఇవి లేకపోతే అతడు క్షత్రియుడు కాలేడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కాబట్టే యమధర్మరాజును సమవర్తి అని అన్నారు. కాని మన సినిమాలు ఆయనను ఎలా చిత్రీకరిస్తున్నారో చూస్తే మనం సిగ్గుపడాలి.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment