*హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు -1*
🤟
రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.
*గ్రంథ పరిచయము*
మా ఏడవ ఏట నుండి ధ్యానం చేస్తుండగా మాకెన్నో సందేహాలుండెను. కాని పల్లెటూరులో అవి తెలిపేవారు లేరు. నా చిన్నప్పుడు హైదరాబాద్ లో కూడా కొంతకాలం ఉన్నాము. ఎందరో స్వాముల్ని నేను కలిశాను. కాని మన తెలుగు జిల్లాలలో నా సందేహాలు తీర్చేవారు నాకు దొరకలేదు. 28 రాష్ట్రాలు తిరిగి చివరికి హిమాలయాలలో కుంభమేళలలో ఎందరో యోగులు, ఋషుల, నిరాహారుల, మౌనుల, మహానీయులను కలిసి ఎన్నో రకాల సాధనలు, బోధనలు విని కేవలం పుస్తకాలు చదివి తృప్తిపడక స్వానుభవ జ్ఞానం గ్రహించాను. తుమ్మెద అన్ని పూల నుండి మకరందం తీసుకునే విధంగా సాధకుడు సత్యాన్వేషి, అందరు గురువుల తో జ్ఞానం తీసుకోవలెను. తన అనారోగ్యం పోవుటకు వైద్యుడిచ్చిన ఒక మాత్రయే చాలు, ఇతరుల రోగం పోగొట్టాలంటే మనం వైద్యుడవ్వాలి. శిశ్యుడు గురువు చెప్పింది చేస్తే చాలు కాని గురుస్థానం కఠినమైనది గురువు అన్నీ సాధనలు మార్గాలు అధ్యయనం చేసి సాధన అనుభవం, భోదనా సామర్థ్యం కలిగి ఉండాలి.
ఈ లోకంలో దేనికి కరువులేదు. తిండి, గూడు, బట్ట, కాని లోకం మొత్తం అశాంతిగా ఉంది. ఎందుకు ఈ శరీరం నేను దీనికి సంబంధించిన పరివారం, ఆస్తులు నావే అని అజ్ఞానం చేత మోహితు లవడం వలన దుఃఖితులవుతున్నారు. అన్నం, పెట్టిన మళ్లీ ఆకలి అవును. వస్త్ర మిచ్చిన మళ్లీ చిరుగును. రోగం నయం చేసిన మళ్లీ రోగమొచ్చును. ఈ అన్నీ దు:ఖాలకు అజ్ఞానమే కారణం, జ్ఞానం యోగం ధ్యానమనే ఔషదంతో అజ్ఞానమనే రోగం పోతే అంతా ఆనందమే. లోకంలో తాత్కాలిక పరిష్కారాలు ఇప్పటి వారు చూపిస్తున్నారు. పూజారులతో దు:ఖాలు పోవాలని లక్షల ఖర్చుతో పూజలు, శాంతులు చేయిస్తున్నారు. స్వాములతో కోట్ల రూపాయల యజ్ఞాలు, యాగాలు చేయిస్తున్నారు. దాన ధర్మాలు, నోములు వ్రతాలు, తీర్థయాత్రలు, ఎన్నో శాంతికై ఆచరిస్తున్నారు. ఇవేవి నిజమైన శాంతిని ఇవ్వవు. మన ఋషులు యోగులు, ఉపనిషత్తులు చూపే శాశ్వత పరిష్కారం ధ్యానమార్గం అనుభవగురువులు, యోగులతో నేర్చి ఆత్మజ్ఞానం పొందినచో అనంత శాంతిపొందగలరు.
పూర్వం గురుకులాలలో ఋషులు, భక్తి మార్గం ముక్తి మార్గం రెండు నేర్పేవారు. కాని ఈ కాలం కేవలం భుక్తి మార్గంమే చూపిస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలైనాయి. అది సరే కాని ముక్తి విద్యతో యోగం, ధ్యానం విద్యతో దుఃఖ రాహిత్యం ఆనందం ప్రాప్తి కలుగును. ఆత్మశాంతి, జన్మరాహిత్యం లభించును. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోదగినది వేరొకటి లేదో అట్టి ఆత్మ జ్ఞానం తెలుసు కోవడంతో మానవ జన్మ సాఫల్యం జన్మరాహిత్యం జీవన్ముక్తి జీవులకు లభించును. దీనికై అనుభవ గురువులకై బాబాజి.
ప్రేరణతో పూర్వజన్మ సుకృంతం చేత చిన్న నాటి నుండి ఎంతో సాధన చేసిగూడ తృప్తి లేక గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక అనుభవ గురువులకై అనుభవముకై నా అంతరంగ గురువు. బాబాజి ప్రేరణతో నా అన్వేషణ ప్రారంభమయ్యెను. బాబాజిపై భారం మోపి ఒంటిపై ఒక జత వస్త్రాలు భుజంపై ఒక జోలె ఇదే నా ఆస్తి అని సత్యాన్వేషనకై బయలుదేరి నేను చేసిన సాహసం. ప్రతి యువసాధకులకు మరియు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా సాధన ప్రారంభించాలి. వాటి విజ్ఞాలెలా ఉంటాయి. కఠోర నిష్ట ఎలా చేయాలి. మనసు నిలిపే మార్గమేమి. ఎంత సాధన చేసిన ఫలితం కనిపించకపోవుట, ధ్యానం లో సందేహాలు, సమస్యలు, ప్రతి సాధకుడికి ఉపయోగార్థం. క్రియా బాబాజీ నన్ను పరికరంగా చేసుకొని సాధకులకు అందించినదే ఈ గ్రంథము.
నాకు మేలొనర్చిన హిమాలయ యోగులకు, అవధూతలకు, ఋషులు, మునులకు పరమ గురువులకే ఈ గ్రంథం అంకితం, ఇది ప్రతి సాధకుడు చదువ దగిన గ్రంథం. ఇందులో ఎన్నో సమస్యలకి, సందేహాలకు, ఎన్నో రకాల సాధనలు, సాధనా నియమాలు ఇందులోని అనుభవం పరమ గురువులది. ఇవి మీకు మేలొనగూర్చితే ఆ గురువులకి మీరు ధన్యవాదం తెలుపండి. లోపాలుంటే అవి నావిగా భావిస్తాను, చెరకు వంకరైనా గాని ఇందులో తీపినే గ్రహించండి.
ఇందులో ఎందరో యోగులు యోగి వైద్యులు, తెలిపినవి ఆరోగ్య రహస్యాలు ఆహార నియమాలు, మూలికావైద్యం, ఆరోగ్యంకై యోగం, ఆత్మజ్ఞాన సాధనలు, వేదాంత విచారణ, ధ్యాన యోగులకు, సందేహాలు తీర్చే ఎందరో యోగులు తెలిపిన ఆయా విషయాలే కాక మేము స్వయంగా వాటిని అనుభవంలోకి తెచ్చుకోని చెప్పిన విషయాలు శాస్త్రం చెప్పినది. గురువు చెప్పినది, సాధనతో దానిని అనుభవంలోకి తెచ్చుకొని, సాధకులకై ఎన్నో విషయాలు చర్చించి పొందుపరిచాము. క్రియా యోగంలో కలిగే సందేహాలు, ధ్యానంలో సందేహాలు సమస్యల గురించి ధ్యానయోగులెలా ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీత స్థితి పొందవచ్చును. ఎలామెలిగితే ఏది సేవిస్తే, జీవితంలో ఏ మార్పులు చేసుకుంటే ఏ సాధనలు చేస్తే, ముక్తి త్వరగా లభించును అనే విషయాలు ఎన్నో అనుభవపూర్వకం గా తెలిపాము. గురువులు చెప్పిన సాధనాలన్ని అనుభవంలోకి తెచ్చుకొని మీకు వివరిస్తున్నాము.
ఈ గ్రంథంలో ఇచ్చిన సాధనలన్ని కేవలం గురుముఖంగా నేర్చి సాధన చేస్తేనే ఫలితమిచ్చును. ఏ కర్మకాండలతో పని లేదు. సాధకులకందరికి, క్రియా యోగవిద్య ఉచితంగా అందిస్తున్నాము. ప్రతినిత్యం క్రియా, ధ్యానయోగం సాధన చేసి జీవన్ముక్తులవ్వండి, బాబాజి అనుగ్రహంతో ఈ గ్రంథం మీ ముందుంచుచున్నాను.
📖
*1. శాఖాహారిగ మారిన అగోరిబాబా*
నేనొకసారి బద్రినాథ్ యాత్రకి వెళ్ళాను. అక్కడి విశేషాలన్ని చూసిన తర్వాత యోగుల దర్శించాలనే కోరికతో అరణ్యం లోని పర్వతశ్రేణులన్నీ గాలించాను. బద్రినాథ్ మందిరం నుండి పాండవులు స్వర్గావరోహణం చేసిన ప్రాంతం సటోపంత్ అంటారు. కఠోర పర్వత లోయలలో అతి కఠిన ఇరుకులోయల మధ్య గుండ ప్రయాణిస్తున్నాము.
ఒక సాధువు చెప్పారు. ఇక్కడి నుండి 20కి.లో మీటర్ల దూరంలో సొరంగంతో కూడిన సహజగుహలో మృత్యుంజయ అగోరిబాబా ఉన్నాడు. ఆయన ఉన్నది రహస్యంగా ఎవ్వరికి తెలియదు అని సాధువు బదులిచ్చెను. నీవెలా చూసావు అని అడుగగా నేనొకసారి సటోపంతుకై వెళుతూ దారి తప్పి బాబా గుహ వద్దకి వెళ్ళాను నన్నెంతో ఆదరించారు. మళ్ళి రావద్దు అని ఆజ్ఞాపించారు. కనుక నేను రాను నీవెళ్ళొచ్చని ఆ సాధువు చెప్పి తప్పుకున్నాడు.
అగోరిజీని ఎలాగైనా దర్శించాలనే తపనతో ఎంతో శ్రమకోర్చి ఆ సాధువు చూపిన మార్గం గుండ మంచి సంకల్పంతో బయలుదేరాను. రెండు రోజులకు వారు చెప్పిన గుర్తులు కలిగిన గుహ దగ్గర 3గం||లు వేచి ఉన్నాను. సాయంత్రము 6గం॥లవుతుంది. అగోరిబాబ బయటికి వచ్చారు. బోను లోంచి పులి బయటికి వచ్చిన విధంగా బాబా కనిపించారు. బక్కపలుచని తెల్లనిరంగు శరీరం కాంతియుతంగా తేజస్సుతో ఉంది. బంగారు వన్నెజడలు నిలబడితే నేలపై కుప్పగా పడి ఉన్నాయి. శరీరం కొంత ముడతలుపడి ఉన్నది. ఎవ్వరు నీవు అని గద్దించాడు. మా సాంప్రదాయం ప్రకారం ఓం నమో నారాయణ్ గురూజీ అన్నాను. ఎవ్వరి శిశ్యుడివి అని అడిగారు చెప్పాను. మీ పరాత్పర గురువు పేరు చెప్పు గుర్తిస్తాను అన్నారు. గణేష్ గిరి మహరాజ్ అని సన్యాసపరంపర గురువు పేరు చెప్పాను.
"అరే పంజాబ్ వాలా గణేషగిరి తేరాహ్ మడి మీర్జాపూర్ పరివార్ వాలా, ముజే సబ్ మాలుం బేటా, బైటో ఆసన్ పే" అని అన్నారు. అప్పుడు నాకు గుండెదడ తగ్గింది. లేదంటే అగోరీల మూడ్ ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. గణేష్ గిరి చాలా మంచి తపస్వి నాకు మిత్రుడు కాని 80 సం||రాలే జీవించాడు అనిరి. బాబా నా మనవి మన్నించి మీ గురించి తెలుసుకోవా లని ఉంది. అలాగే అగోరులంటే నర మాంసం తినేవారనే చెడు పేరు సమాజం లో ఉంది. నాపై దయ వుంచి మీ గురించి, అగోరి సంప్రదాయం గురించి వివరించండి అని ప్రార్ధించాను. కొంత చెప్పుతాను విను బేట అని చెప్పసాగారు.
ఉత్తర ప్రదేశ్లో జమిందార్ కుటుంబంలో జన్మించిన నేను అది దేవభూమి పుట్టుక తోనే భక్తి శ్రద్ధ అబ్బుతాయి, నేను డాక్టర్ చదివాను. నాకు చిన్ననాటి నుండి యోగులంటే ఇష్టం. బాగా ధ్యానం చేసేవాడిని.
మశూచితో అమ్మనాన్న చనిపోవడంతో ఎంతో వైరాగ్యం కలిగెను. మా అక్కకు బావకు అంతా అప్పజెప్పి యాత్ర కని బయలుదేరాను. పూర్వం కాలినడకనే కదా 150 సం॥ల క్రింద మాటలివి. నా వయస్సు 180 సం॥లు ఇప్పుడు. కాలి నడక తోనే కాశీ వెళ్ళాను నది ఆవలనున్న గోర ఋషి అనే మహానీయునిదర్శించాను. ఆయన గంగనీటిపై రాత్రంతా ధ్యానం చేసేవాడు. వారికి ఆకర్షితున్నై శిశ్యుడిగా మారాను. వారు నన్నెన్నో పరీక్షలు పెట్టాడు. పూర్వం గురువులు శిష్యుని ఎంతో పరీక్షలకు గురిచేసేవారు. కాశిలో రోజుకు నలుదిక్కుల నుండి వచ్చే శవాలు కాలుస్తారు. నదిలో సగం కాలిన శవాలు కొట్టుకొస్తే అవి తిను అనేవాడు.
అహంకారం విడువాలి, అన్నిట్లోనూ పరమాత్మని చూడాలి. గౌరవ అవమానా లను సమానంగా చూడాలి. సమాజానికి కౄరంగా కనిపించిన లోపల శాంతముగా బ్రహ్మానందంతో ఉండాలి. లోకానికి పిచ్చి వాడివలె నరరూప రాక్షసుడిగ కనిపించిన లోపల నరరూప నారాయణుడిగా ఉండాలి. దేనిపై ఆశ, మమకారం లేక ఉండాలి. దేహాభిమానం, అహంకారం విడచి ఆత్మధ్యానంలో ఎల్లవేళల ఉండాలి. జనాలు దగ్గరికి రాకుండా ఆకలికి చనిపోయిన శవమే తినాలి. జనం మనని మెచ్చరు. దేవుడు మనని మెచ్చును. జనం మెచ్చితే దేవుడు మెచ్చడు గుర్తుంచుకో జనంని మెప్పించుటకు ఏదేదో చేయాలి. దేవుడిని మెప్పించుటకు బేధ భావం వదిలి, అన్నింటిని దైవంగా చూడాలి. ఏ జీవికి బాధ కలుగకుండా జీవించాలి. అందుకే చనిపోయిన శవాలే ఆహారంగా తినాలి, ఎవ్వరిని ఆశించరాదు. దేహాభిమానం, అహంకారం నశించుటకు ఎవ్వరిని యాచించకుండా దిగంబరంగానే ఉండాలి. త్యాగము లేనిదే యోగము దక్కదు. పూర్వం మన గురువులు ఇంతకన్న ఘోర దుఃఖములు అనుభవించి కఠోర శ్రమచేసి తీవ్ర సాధనజేసి ముక్తి పొందిరని మా గురువు అగోరఋషి చెప్పిరని మృత్యుంజయ అగోరి నాతో చెబుతున్నారు.
వినుటకు నాకు కష్టంగా తోచిన ఆయన సిద్ధపురుషుడు ఆయన చేతుల్లో నా జీవితం ధన్యమవునని వారు చెప్పిందల్లా నెమ్మదినెమ్మదిగా సాధన చేస్తూ కొంత కాలానికి, దిగంబరంగానే ఉంటూ చనిపోయిన శవాలనే కొంచెం ఆహారంగా తీసుకుంటూ రాత్రులంతా గంగానది ఒడ్డున తీవ్ర తపస్సు ఆచరిస్తూ గురుసేవ జేస్తు గడిపానని అగోరిజి చెప్పిరి.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
No comments:
Post a Comment