Sunday, March 23, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-454.
4️⃣5️⃣4️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*36. వ శ్లోకము:*

*”సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభl*
 *అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతిll”*

“ఓ అర్జునా! ఈ లోకంలో ఎల్లప్పుడూ దుఃఖము విషాదము కష్టములే కాదు సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువయి, ఒక వేళ   ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా మూడు విధాలుగా విభజింప బడ్డాయి. వాటి గురించి వివరిస్తాను జాగ్రత్తగా విను...”
```
‘సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటికే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇదీ మానవుని కర్తవ్యము. కాని మానవులు తమ అజ్ఞానం వలనా, తాము చేసే రాజస, తామస కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజస గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి, నిద్రలో, నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖము ఎలా వస్తుంది అంటే వాళ్లు చేసే పనుల వలన వస్తుంది. అందుకే మానవులు అందరూ “నేను సుఖంగా ఉన్నాను” అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది అధ్యాత్మ విద్య. దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలో ఉంది. అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది కానీ మాటల వలన రాదు.

తినడం కొంత మందికి సుఖం ఇస్తుంది. కాని ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం, ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది. కాని తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది. మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు. తరువాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివి అయితే ఫరవాలేదు. కాని చెడ్డవి అయితే దుఃఖం తెచ్చిపెడతాయి.

ఒకే వస్తువు, ఒకే పరిస్థితి, ఒకడికి సుఖం కలిగిస్తే మరొకడికి దుఃఖం కలిగిస్తుంది. ఆంధ్రాలో పుట్టిన వాడికి ఆవకాయ రుచిగా ఉంటే, నార్త్ లో పుట్టిన వాడికి నోరు మండుతుంది. ఇక్కడ అన్నం, సాంబార్, రసం, ఇత్యాది రుచిగా ఉంటే, నార్త్ వాడికి రొట్టె, కూర రుచిగా ఉంటుంది. కాబట్టి దేనికైనా నాలుక అలవాటు పడాలి. ఇంకొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే కొంత మంది మగాళ్లకు, కట్టుకున్న భార్య తప్ప, ఇతర స్త్రీలంతా అందంగానే ఉంటారు. ఒకడు ఒక కారు అమ్ముతుంటే ఆనందం. అదే కారును కొనుక్కున్న వాడికి ఆనందం. అమ్మిన వాడికి ఆ కారు రేటు పెరిగితే దుఃఖం. కొన్న వాడికి అదే కారు ఇంకా తక్కువగా వస్తుందంటే దుఃఖం. ఇలా సుఖదుఃఖాలు ఒకటి వెంబడి వస్తుంటాయి పోతుంటాయి. వీటికి అంతులేదు. వీటిని సహించడమే సాత్విక లక్షణం.

పరమాత్మ ఇక్కడ ఒక పదం వాడాడు. ‘దుఃఖాన్తం చ నిగచ్ఛతి’. ఎవడు ఏ పని చేసినా, సుఖపడటానికే చేస్తాడు కానీ దుఃఖపడటానికి చెయ్యడు. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయాస పడతాడు. అంటే దుఃఖం అంతం అయితే సుఖం దానంతట అదే వస్తుంది. అది మానవ సహజం. కాని తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా, కొత్త దుఃఖాలు వచ్చిపడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.

దుఃఖమునకు అంతం ఎప్పుడు.

దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది.

దుఃఖములు ఎక్కడ అంతం అవుతాయి.

శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది.

శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది. ఎవరి వలన లభిస్తుంది.

ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయ వాంఛలతో సుఖం దొరుకుతుందా!

ఈ ప్రశ్నలకు అన్నిటనికీ ఒకటే జవాబు. సుఖము,దుఃఖము ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మన భావనలో ఉంది. మనం చేసే కర్మలలో ఉంది. మనలను మనం సంస్కరించుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెదక వలసిన పని లేదు. అందుకే సుఖం కావాలంటే అభ్యాసం చేయాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు పరమాత్మ. 

మానవులు సహజంగా అనుభవించే సుఖములలో కూడా మూడు రకాలు ఉన్నాయని పరమాత్మ చెబుతున్నాడు.’✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment