అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-458.
4️⃣5️⃣8️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*40. వ శ్లోకము:*
*”న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునఃl*
*సత్త్వం ప్రకృతిజైర్యుక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైఃll”*
“సత్వరజస్తమోగుణములు ప్రకృతి అంతా నిండి ఉన్నాయి. ఈ మూడు గుణములతో కూడి ఉండని పదార్థము, విషయము భూలోకములో కానీ, దేవలోకములో కానీ, మానవులలో గానీ, దేవతలో కానీ లేదు. (మానవులు దేవతలు అందరూ సత్వరజస్తమోగుణములకు వశవర్తులై ఉన్నారు.)”
“అర్జునా! ఈ ప్రకృతి సత్వరజస్తమోగుణముల కలయిక. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులలో వస్తువులలో, చరాచర ప్రాణులలో
ఈ మూడు గుణములు ఉన్నాయి.
ఈ మూడు గుణములు లేని వారు దేవతలలో గానీ, మానవులలో గానీ, భూలోకములో గానీ, స్వర్గలోకములో గానీ, ఎక్కడా లేరు. అందరిలోనూ
ఈ మూడు గుణాలు నిండి ఉన్నాయి. ఒక్క పరమాత్మ మాత్రమే త్రిగుణాతీతుడు. మనం కూడా గుణాతీత స్థితికి చేరుకుంటే, పరమాత్మలో లీనం అవుతాము.”
```
‘మనకు వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు, లక్షణాలు వస్తుంటాయి. తండ్రి నుండి కానీ, తల్లి నుండి కానీ షుగర్, బిపి సంతానానికి సంక్రమించడం సర్వసాధారణం. అలాగే ప్రకృతిజైః అని వాడారు అంటే ఈ మూడు గుణాలు ప్రకృతిలో నుండి పుట్టాయి. మనందరికీ ప్రకృతి తల్లి, తండ్రి. కాబట్టి ప్రకృతిలో నుండి పుట్టిన అందరిలోనూ ఈ మూడు గుణాలు అంతర్గతంగా తమ ప్రభావాన్ని చూపుతుంటాయి అని తెలుసుకోవాలి. కాబట్టి అందరిలోనూ అంటే మంచి వారిలోనూ, చెడ్డ వారిలోనూ, మధ్యేమార్గంగా ఉండేవారిలోనూ ఈ మూడుగుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాలు లేని వాడు, లేని జీవి, జంతుజాలము, పశుపక్ష్యాదులు, వృక్షజాలము, మూడు లోకాలలో ఎవరూ లేరు, ఏదీ లేదు. కాబట్టి ఆ మూడు గుణాలను వివేకంతో, విజ్ఞతలో, బుద్ధిని, విచక్షణను ఉపయోగించి వాడుకోవాలి కాని వాటి ప్రభావానికి లోనుకాకూడదు. సత్త్వగుణము ఎక్కువగానూ, రాజస, తమోగుణములను వాటి వాటి మోతాదులోనూ ఉంచుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.```
*41. వ శ్లోకము:*
*”బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరన్తపl*
*కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్లుణైఃll”*
“అర్జునా! మానవులు అందరూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారు. వారి వారి స్వభావములను అనుసరించి, గుణములను అనుసరించి వారికి కర్తవ్య కర్మలు విధింపబడ్డాయి. “
“ఇదే విషయాన్ని 4వ అధ్యాయము 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. "చాతుర్వర్ణ్యం మహాసృష్టం గుణ కర్మ విభాగశః" ఇక్కడ కూడా అదే భావాన్ని చెబుతున్నాడు…”
```
ఇక్కడు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి స్వభావము. అంటే పూర్వజన్మ వాసనలతో స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావమే ఈ జన్మలో అతని గుణమును నిర్ణయిస్తుంది. ఆ గుణములను బట్టి అతని వర్ణం నిర్ణయింపబడుతుంది. అంతేకానీ ఎవరికీ పుట్టుకతోనే వారి వర్ణము అంటే కులము నిర్ణయించబడదు. మనం అజ్ఞానంతో మూర్ఖంగా మానవుల మధ్య అంతరాలు అడ్డుగోడలు ఏర్పరచుకున్నాము. బలీయమైన కులవ్యవస్థను నిర్మించుకున్నాము. పుట్టుకతో వచ్చేది కులం అనే మూఢనమ్మకంతో ఉన్నాము. అది భగవంతుడు సమ్మతించడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. అందరికీ మోక్షము పొందే హక్కు ఉంది.
ఇప్పుడు నాటి వర్ణవ్యవస్థ గురించి వివరంగా తెలుసుకుందాము. ఎవరిని బ్రాహ్మణులు అంటారో, ఎవరిని క్షత్రియులు అంటారో, ఎవరిని వైశ్యులు అంటారో, ఎవరిని శూద్రులు అంటారో ఇక్కడ వివరంగా చెప్పాడు పరమాత్మ. ఈ గుణములు కలవారు, ఆయా కర్మలు చేసేవారు మాత్రమే. ఆయా వర్ణములకు చెందినవారు అని తెలుసుకోవాలి కానీ పుట్టుకతో కాదు. పుట్టుకతో వర్ణము, కులము నిర్ణయింపబడటం తరువాత కాలంలో కలిగిన పరిణామము. ఆ పరిణామము ప్రస్తుత కాలంలో వికృతరూపం దాల్చింది.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment