*కర్మఫలానుభవం తప్పనిసరి*
*పూర్వజన్మలో మనం చేసిన పనులు, ఈ జన్మలో మనం చేసిన, చేస్తున్న పనులే కర్మలంటే! కర్మల వలనే జన్మలు, జన్మించేక మళ్లీ కర్మలు, ఫలితంగా మళ్ళీ మళ్ళీ జన్మలు, జన్మించాక గత జన్మల వాసనలు, వాటి కారణంగా ప్రవృత్తులు, ప్రాప్తాలు, అప్రాప్తాలు, పూర్వజన్మల సుకృతాలు, దుష్కృతాలు అంతా అయోమయంగా గందగోళంగా ఉంటుంది. అందుకే 'కర్మల జన్మల గందరగోళపు నిత్య సత్య చరిత్రలో' అన్నాడొక మహనీయుడు. 'ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా', 'చేసుకున్నోళ్లకు చేసుకున్నంత'. ఇవి కర్మ తత్త్వాన్ని, కర్మ ఫలాన్ని తెలియజెప్పే తత్త్వాలు ఎంతో గాఢత కలిగిన లోతైన కర్మ సిద్దాంతాన్ని మామూలు మాటల్లో వివరించే మహోన్నత వాక్యాలివి. కర్మలనేవి చాలా బలమైనవి. కర్మలు, కర్మ ఫలం చాలా చిత్రంగా ఉంటాయి. నమ్మశక్యంగాని రీతిలో మన వెంటపడతాయి.*
*కర్మలు మూడు రకాలన్న విషయం తెలిసిందే. అవి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. మామూలుగా చెప్పాలంటే పూర్వజన్మలో మనం చేసిన పనులు, ఈ జన్మలో మనం చేసిన, చేస్తున్న పనులే కర్మలంటే! కర్మల వలనే జన్మలు, జన్మించేక మళ్లీ కర్మలు, ఫలితంగా మళ్ళీ మళ్ళీ జన్మలు, జన్మించాక గత జన్మల వాసనలు, వాటి కారణంగా ప్రవృత్తులు, ప్రాప్తాలు, అప్రాప్తాలు, పూర్వ జన్మల సుకృతాలు, దుష్కృతాలు అంతా అయోమయంగా గందగోళంగా ఉంటుంది. అందుకే 'కర్మల జన్మల గందరగోళపు నిత్య సత్య చరిత్రలో అన్నాడొక మహనీయుడు. ముళ్ళ చెట్టు విత్తనాలు నాటి, పండ్లిచ్చే చెట్టుని ఆశించలేము కదా! మన కర్మలు, వాటి ఫలితాలు ఏ విధంగా వెంట పడతాయో కొంచెం పరిశీలన చేద్దాం.*
*కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది యోధులతో పాటు ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు మరణించారు. నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి, ధృతరాష్ట్రుల విషాదానికి అంతు లేదు. కంటికీ మంటికీ ఏకధాటిగా విలపిస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్న గాంధారి, ధృతరాష్ట్రులను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలియగానే గాంధారి ఆయనపై విరుచుకుపడింది. నూరుగురిలో ఒక్క బిడ్డనైనా కాపాడలేదని కృష్ణుని నిష్ఠూరాలాడింది. ఈ ఘోరానికంతకూ నీవే కారణమని పుత్రవియోగ దుఃఖంతో కృష్ణుణ్ణి నిందించింది.*
*ధృతరాష్ట్రుడు కూడా విషాదానికి మారు రూపంలా ఉన్నాడు. దానిని తమాయించుకుని కృష్ణుడితో ఇలా అన్నాడు. 'కృష్ణా! వంశోద్ధరణ కోసం ఒక్క కుమారుడు కలగడమే గొప్ప అదృష్టంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నాకు వందమంది కుమారులు కలిగారు. అదెంత గొప్ప అదృష్టమో, ఎన్ని జన్మల సుకృతమో ఆలోచించు. అయినా వృద్ధ దంపతులమని తలచైనా, మమ్మల్ని కనికరించైనా కనీసం మా ఉత్తర క్రియలు జరిపేందుకైనా ఒక్కడినైనా నువ్వు కాపాడలేదు. పాండవులంత దగ్గర కాకపోయినా మేమూ బంధువులమే కదా? ఏమాత్రం కనికరం లేకుండా అందరినీ మట్టుబెట్టి మమ్మల్నిద్దరినీ అనాథలను చేశావు. ఇదేమి న్యాయం' అని ఆవేశంతో ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడిలా చెప్పేడు. 'నూరుగురు పుత్రులను కోల్పోయిన దుఃఖంలో ఉచితానుచితాలు మరచిపోయి నువ్వు నన్ను నిందిస్తున్నావు. కానీ ఏ విధంగా నేను జరిగిన దానికి బాధ్యుణ్ణి? అంతటి విపత్తుని ఆపడానికి, నూరుగురు కొడుకులలో ఒక్కరినైనా కాపాడడానికి నేనెవరిని? నిన్ను వెంటాడిన నీ పూర్వ జన్మల కర్మ ఫలం ఇది' అని అసలు విషయాన్ని బైటపెట్టాడు శ్రీకృష్ణుడు. 'ఇదంతా నా పూర్వజన్మ కర్మ వలనా? ఎలా?' అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు కృషుడు చెప్పాడు. 'ఏభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతుడివి. పక్షులను వేటాడి జీవితం గడిపేవాడివి. ఒక రోజు తనకున్న వంద మంది సంతానంతో చెట్టు మీద కూచుని ఆనందిస్తున్న ఒక పక్షుల జంటని నువ్వు అగ్ని బాణంతో కొట్టేవు. బాణం నుంచి వచ్చిన వేడికి తల్లి పక్షి, తండ్రి పక్షి కళ్లు కాలిపోయాయి. చెట్టుకున్న ఎండుటాకులు కాలి పిల్ల పక్షులన్నీ ప్రాణాలు కోల్పోయాయి. ఏభైజన్మల క్రితం నువ్వు చేసిన దృష్కృత్యం ఫలితమే ఇది' అని వివరించాడు శ్రీకృష్ణుడు.*
*అంతా విన్న ధృతరాష్ట్రునికి ఓ సందేహమొచ్చింది. “ఏభై జన్మల కిందటి కర్మఫలం ఈ జన్మలో అనుభవించటమా? ఇదేం చోద్యం. ఆ కర్మఫలం ఆ మరుజన్మలోనే అనుభవం అవవచ్చు కదా?' అని ప్రశ్నించేడు.*
*అదీ చెబుతాను అన్నాడు కృష్ణుడు. 'వంద పిల్ల పక్షుల్ని చంపిన ఆ దుష్కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాలంటే నీకు వంద మంది కుమారులు కలగాలి. అంతమంది కుమారులు కలగాలంటే నీకు యోగం, అదృష్టం ఉండాలి. ఒక్కగానొక్క కుమారుడు కలగడానికే ఎంతో యోగం, అదృష్టం కావాల్సి ఉండగా వంద మంది పుత్రులు కలిగేందుకు అవసరమైన మహోన్నత స్థితి పొందటానికి నీకు ఏభైజన్మలు పట్టింది'. అసలు రహస్యాన్ని ధృతరాష్ట్రునికి అర్ధమయ్యేలా వివరించాడు శ్రీకృష్ణుడు.*
*కర్మలు, కర్మ బంధం, కర్మ ఫలం, జన్మల పర్యవసానం, తత్ఫలితం వివరించే, విశదీకరించే మహత్తర సన్నివేశం ఇది. ఇది ఎక్కడ, ఏ విధంగా ఎందులో ఉంది అని. అసలు ఉందా లేదా అనే వాదాలు, ప్రతివాదాలు, వివాదాలు అప్రస్తుతం. అనవసరం కూడా. విషయాన్ని, విషయ జ్ఞానాన్ని అంతర్లీనమైన రహస్యాల్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం ముఖ్యం, అందువల్ల కర్మలు జన్మలు, వాసనలు మనలను బంధించకుండా కర్మలు, జన్మలు అనే చక్రబంధంలో మనం బందీలం కాకుండా నామస్మరణతో, దైవ ప్రేమతో, సేవలతో భగవచ్చింతనతో మన జీవితాలను భగవన్మయం కావించుకోవాలి. సత్కర్మలు, సచ్చింతనలు, సద్బుద్ధితో, సదాలోచనలతో సదాలోచనలతో జీవితాన్ని పండించుకోవాలి. పావనం చేసుకోవాలి. జీవితాలను పండించుకోవాలి. భగవంతుని అనుగ్రహం పొందటానికి అనుక్షణం కృషి చేయాలి. మరుజన్మ లేకుండా చూసుకోవాలి. అందుకు పరమాత్మ కృపకు పాత్రులం కావాలి.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🌷🦚 🙏🕉️🙏 🦚🌷🦚
No comments:
Post a Comment