Sunday, March 23, 2025

 

*నాటి జ్ఞాపకాలు...*

*నీటిలో తేలియాడే పెద్ద ఆకు...ఆ ఆకుపై పడుకున్న అమ్మాయి*

*నాటి ఈనాడు "పత్రశాయి" గుర్తుందా..!*
           
         దేశవ్యాప్త ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ నర్సరీ రైతులు దేశ విదేశాలలోని ప్రత్యేకమైన మొక్కలను ఇక్కడకు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడినుంచి అనేక ప్రత్యేక మొక్కలు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే సుమారు ఇరవై ఏళ్ల క్రితం అంటే 2005లో ఈనాడు మెయిన్ ఎడిషన్ మొదట పేజీలో ఒక వార్త ప్రచురించారు. దేశంలోని అన్ని ఎడిషన్ లోనూ ఆ వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే నీటిలో తేలియాడే ఆకుపై పసిపాప పాలు తాగుతూ పడుకుంది.అదీ ఆ మొక్క ప్రత్యేకత. మన దేశానికి ఈ మొక్క అప్పుడే పరిచయమైంది. దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

         రాజమహేంద్రవరం కేంద్రంగా సుదీర్ఘ కాలం పాటు ఈనాడు ఫోటో జర్నలిస్టుగా పనిచేసిన మిత్రులు శ్రీనివాస్ పట్నాయక్ ఈ నర్సరీలలో ఎన్నో ప్రత్యేకమైన ఫోటో వార్తలు ఇచ్చారు. నిత్యం ఇక్కడ మొక్కల్లోని ప్రత్యేకతను గుర్తించడానికి కళ్లల్లో లెన్స్ లు వేసుకుని తిరిగేవారు. ఒకరోజు ఆయనకు వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న సుందరరామ రాజు గారి నర్సరీలో పెద్దపెద్ద ఆకులతో ఉన్న విక్టోరియా అమెజోనికా(ప్రపంచంలోనే పెద్ద ఆకులు కలిగిన నీటి మొక్క) ఈ మొక్క కనిపించింది. మనం నీటిలో తేలియాడే తామరాకులను చూస్తుంటాము కదా అదే లక్షణాలతో  ఈ పెద్ద పెద్ద ఆకులున్న మొక్క ఆయన్ని విశేషంగా ఆకట్టుకుంది. దీని ప్రత్యేకత ఏంటని రైతు ను అడగగా ఈ ఆకు మీద నాగుగైదు నెలలు పైబడిన పిల్లలు పడుకున్నా నీటిలో ములగరని, అంత బలమైన ఆకులని వివరించారు.దక్షిణ అమెరికా నుంచి రైతు సుందర రామరాజు రెండు సార్లు తీసుకొచ్చినా ఇక్కడ అవి జీవించలేదు.మూడవసారి తెప్పించి చాలా జాగ్రత్తలతో పోషించగా ఆ మొక్క ఇటువంటి ఆకులను ఇచ్చింది.

         అంతే ఎలాగైనా ఆకుపై పాప లేదా బాబును పడుకోబెట్టి ఫోటో తీయాలి అనుకున్నారు పట్నాయక్. కానీ అలా పిల్లలను పడుకోబెట్టడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడలేదు. చివరకు ఆ నర్సరీలో పనిచేసే కూలీలు కూడా ధైర్యం చేయలేదు. దీంతో అప్పటి కడియం ఈనాడు విలేఖరిగా ఉన్న మిత్రుడు తోకల శ్రీనివాసుకు ఈ బాధ్యత అప్పగించారు.ఆయన తన పలుకుబడి ఉపయోగించి చుట్టుప్రక్కల వారిని ఎంత బ్రతిమలాడినా అంగీకరించలేదు. చివరికి తోకల శ్రీనివాసరావుకు రాజమండ్రిలో ఉండే దగ్గర బంధువైన కామిరెడ్డి సూర్య ప్రకాష్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.శ్రీనివాసరావు మాట తీయలేక ఇష్టం లేకపోయినా తన ఆరునెలల పాపను తీసుకొచ్చి ఈ ఆకుపై పడుకోపెట్టారు.అంతే పట్నాయక్ కెమెరా క్లిక్ మంది.అద్భుతమైన ఫొటో ఆవిష్కరించింది.వారు పడ్డ కష్టం ఫలించింది.ఇటువంటి ఫొటోలను హైలైట్ చేయడంలో ఈనాడు దినపత్రిక ఎప్పుడూ ముందుంటుంది.పెద్ద ఫొటో తో ప్రముఖంగా "పత్రసాయి"(ఆకుపై పడుకున్న శ్రీమహావిష్ణువు) హెడ్డింగ్‌తో ప్రముఖంగా ప్రచురించడంతో నాటి పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.జర్నలిస్టు, ఫోటో జర్నలిస్టు ఇద్దరు శ్రీనివాసరావు లకు ఈనాడు యాజమాన్యం అభినందిస్తూ బహుమతులు అందించారు.

                మరి ఈ ఫోటో పక్కన ఉన్న ఆ డాక్టరమ్మ ఎవరు అనేకదా మీ అనుమానం. పాల డబ్బాతో ఆకుపై పడుకున్నా ఆ పసిపాపే ఈ డాక్టరమ్మ. పసి ప్రాయంలోనే ఎందరో దీవెనలు అందుకున్న ఈ అమ్మాయి జనరల్ కేటగిరిలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ సీటు సంపాదించింది. ప్రస్తుతం ఆ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. పేరు కామిరెడ్డి సాయి సత్య రత్న శ్వేత. సెలబ్రిటీల పిల్లల కంటే ఎక్కువగా ఆరు నెలల వయసులోనే ఈ అమ్మాయి అందర్నీ ఆకట్టుకుంది ప్రస్తుతం చదువుల తల్లిగా పేరు తెచ్చుకుంది.ఆనాడు ఇష్టం లేకపోయినా ఈ ఫోటోకు ఒప్పుకున్నా ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు అదృష్టంగా భావిస్తున్నారు.

               మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పక్కన బక్కబలసగా ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవాలి కదా... ఆయనే ఫోటో జర్నలిస్టు శ్రీనివాస్ పట్నాయక్. మరి ముఖ్యమంత్రితో కలిసి ఉన్నది ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా..? ఆ ఫోటోకు ప్రతిఫలమే ఈ ఫోటో. పట్నాయక్ తీసిన ఈ అమ్మాయి ఫొటోకు మెచ్చి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2005 సంవత్సరానికి ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డును ఇచ్చింది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటారు పట్నాయక్ గారు.


*కొండ్రెడ్డి లక్ష్మి శ్రీనివాస్*
*సీనియర్ జర్నలిస్టు*

No comments:

Post a Comment