Wednesday, March 26, 2025

 💘❤️""#సహధర్మచారిణి_తో_సాయంత్రం_నడక""❤️💘
♦️♦️
బూట్లు వేసుకొని సాయంకాలం నడకకు సిద్ధం అవుతుంటే
మా ఆవిడ "ఈ రోజు నుంచి నేనూ వస్తా మీతో వాకింగ్ కి....డాక్టర్ గారు నడవమంటున్నారు.
పైగా ఈ రోజు దశమి...మంచిరోజు" అంది.
"శుభం...రా మరి" అన్నాను
♦️♦️
సరే ఇద్దరం బయలుదేరగానే, రోడ్ మీద ఆడుకుంటున్న మా మనవడు నేను కూడా వస్తాను అని వెంటబడ్డాడు. వీడిని తీసుకువెళితే బాగానే ఉంటుంది కానీ, నాలుగడుగులు వేయగానే ఎత్తుకోమంటాడు.. మనం వాడిని మోస్తూ ఎక్కడ నడవగలం అని ఆలోచించి, "నీకు చాకలెట్ తెస్తా ఇక్కడే అడుకో" అని సర్ది చెప్పి బయటపడ్డాము.
♦️♦️
సరే ఎదో పిచ్చాపాటి మాట్లాడుతూ నడుస్తూ పక్క కాలనీ లోని శివాలయం దగ్గిరకి వచ్చాము.
"శుభమా అని మొదటి రోజు నడక మొదలెట్టా కదా...గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని వెళదాం" అంది.
"వెళ్లొచ్చు గానీ, ఈ బూట్లు అన్నీ విప్పాలి, మళ్లీ వేయాలి...నడక అయ్యాక ఇంటికెళ్లి స్నానం చేసి ఫ్రెష్ గా వద్దాము" అన్నాను.
"అపచారం..అపచారం...దర్శనం అనుకున్నాక వెళ్లకపోతే ఎట్లా? ఏమి పర్లేదు రండి" అంది.
సరే బూట్లు విప్పి కాళ్ళు కడుక్కుని గుడిలోకి వెళ్ళాము. దర్శనం అయ్యాక మా ఆవిడ్ ఫ్రెండ్ కనపడితే ఇద్దరూ పిచ్చాపాటి మొదలెట్టారు.
♦️♦️
పది నిముషాలు అయింది. చిన్నగా దగ్గి ఇంక బయలుదేరదాము అని మా ఆవిడ కి హింట్ ఇచ్చాను.
రెస్పాన్స్ లేకపోతే ఇంకో రెండుసార్లు దగ్గితే మా ఆవిడ వినిపించుకోలేదు గానీ ఆ ఇంకో ఆవిడ నాకేసి అనుమానంగా చూసి "ఏమిటి...అన్నయ్య గారు దగ్గుతున్నారు...వంట్లో బాలేదా" అంది !
మా ఆవిడ "అదేమీ కాదు లెండి...నేను ఎవరితో అయినా నాలుగు కబుర్లు మొదలెట్టగానే అలా ఆటోమాటిక్ గా దగ్గు వచ్చేసేలా ప్రోగ్రాం ఫీడ్ చేసుకున్నారు బుర్రలో" అని నవ్వుతూ లేచి బయలుదేరింది..
♦️♦️
దారిలో,
"ఆవిడకి మనవరాలు పుట్టిందట..ఆ పిల్లకి మెడలో కి గొలుసు చేయించిందట, అలాగే తను కూడా పాత గాజులు చెరిపించుకుని కొత్తవి చేయించుకుందిట.. మా ఇంటికి రండి మనవరాల్ని చూద్దురుగానీ...
అంటూ ఆ కబుర్లు చెబుతోంది...
మీరు ఒకటే ఖంగారు పెట్టేస్తారు సాంతం విననీకుండా" అని చిరాకు పడింది.
♦️♦️
"వాకింగ్ - కబుర్లు బద్ధ శత్రువులు. నీకేది కావాలో డిసైడ్ చేసుకో.." అన్నాను.
"రేపొకసారి వెళ్ళిరావాలి వాళ్ళింటికి"
"దానికేం... నిక్షేపంగా వెళ్లిరా..
ముందు పాపని, తరవాత ఆవిడ గాజుల్ని చూసిరా..అంతే గానీ ఇంటికి వచ్చాక 'బంగారుగాజులు' సినిమా చూపెట్టకు నాకు" అన్నా ముందు జాగ్రత్తగా..
"సినిమా వద్దంటే పోనీ
'చేతికి గాజులందమూ'
........అనే పాట పాడుతా లెండి" అంది నవ్వుతూ..
♦️♦️
ఇలా నడుస్తుంటే మా కూరగాయల దుకాణం కనపడింది. షాప్ ని చూడగానే" అయ్యో రామా! రేపు పొద్దుటికి కూరలు లేవు. ఓ రెండు తీసుకుపోదాము" అంటూ ఆవిడ షాప్ లోకి దూరింది.
"ఏం సార్...అమ్మగారిని కూడా తీసుకువచ్చారు ఈ రోజు" అంటూ పలకరించాడు ఆ కూరల కుర్రాడు.
ఫోన్ చేసి చెబితే పాపం కూరలు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాడు కానీ నాలుగు చెబితే ఎనిమిది తెస్తాడు ఇలాగ......
"సార్ ఈ వంకాయలు చూడండి...నవనవ లాడుతూ ఎంత బాగున్నాయో...అలాగే బెండకాయలు చూడండి...నూగు కూడా పోలేదు, సొరకాయ చూడండి గోరు గిచ్చితే వేలు వెళ్లిపోతుందా కాయ లోకి అన్నంత లేత గా ఉంది.... చిక్కుడు కాయ వంకాయ కాంబినేషన్ బాగుంటుంది అని తెచ్చాను...
కాకరకాయలు మంచివిట వంటికి......"
ఇలా సాగుతుంది వాడి మాటల ప్రవాహం. మనం ఏమి తినాలో కూడా వాడే డిసైడ్ చేసేస్తాడు!
సరే ఏవో రెండు కూరలు కొని ఆ కూరలబ్బాయి ఇచ్చిన గుడ్డ సంచీలో వేసుకుని బయలుదేరబోతుండగా, మా ఆవిడ ఇంకో లిస్ట్ చెబుతోంది ఆ కుర్రాడికి.
♦️♦️
"పండు మిరపకాయలు, ఉసిరికాయలు రావడం లేదా మార్కెట్ లోకి?.....కనపడితే ఈ సారి తెచ్చిపెట్టు. నోరు చచ్చిపోయింది, పచ్చళ్ళు పెట్టు అని ఈయన ఒకటే నస" అని నా మీద ఒక అభాండం వేసేసింది.
♦️♦️
"ఎందుకు రావడం లేదమ్మా...
చింతకాయలు, గోంగూర కూడా తెచ్చేస్తాను రేపు వాటితో బాటు. అలాగే బజ్జీ మిర్చి కూడా ....చల్ల మిరపకాయలు వేసుకోండి...
పప్పులోకి బాగుంటాయి" అన్నాడు ఆ అతి వాగుడుకాయ.
"భలే జ్ఞాపకం చేసావు...తెచ్చేయి...
ఆ చేత్తోటే మావిడి అల్లం కూడా దొరుకుతుందేమో చూడు..
ఈయనకు మహా ఇష్టం" అంటోంది మళ్ళీ ఈవిడ..
♦️♦️
ఎవరన్నా ఈవిడ మాటలు వింటే 'వీడెవుడురా బాబూ.... బకాసురుడికి తమ్ముడా లేక ఘటోత్కచుడి అన్నయ్యా...వీడికి వండి పెట్టలేకే పాపం అలా బక్కగా అయిపోయిందేమో ఆవిడ' అని అపార్ధం చేసుకుంటారేమో అని నా భయం.
కడుపు మండి "బూడిద గుమ్మిడికాయ వడియాలు మరిచిపోయావు" అన్నాను వ్యంగ్యంగా...
"అయ్యో రామా...నిజమేనండి...
భలే జ్ఞాపకం చేశారు... ఇదిగో బాబూ విన్నావా"
ఆ పాము చెవుల కుర్రాడు ఎందుకు వినడు? వినేశాడు...
విని, "అలాగే అమ్మా..." అనేశాడు.
"నీకేమిరా బాబూ అన్నీ తెచ్చేస్తావు...నూనె, ఉప్పు, కారాలు కొనవలసింది నేను గదా" ఆని మనసులో అనుకుని,
"ఏమిటి....పెళ్లి, పేరంటం ఏదన్నా ఉందా ఇంట్లో.....అన్ని పచ్చళ్ళు పెడతానంటున్నావు...." అన్నాను.
"అయ్యో రామా...మనకేనండి.... రోజూ పచ్చడి లేనిదే ముద్ద ఎత్తరుగా మీరు" అని నా బలహీనత మీద దెబ్బ కొట్టింది.
♦️♦️
కూరల షాప్ నుంచి పది అడుగులు వేశామో లేదో మా ఆవిడకి పూజా సామగ్రి షాప్ కనపడింది.
"అయ్యో రామా....దీపారాధన నూనె నిండుకుంది...వత్తులు కూడా కావాలి" అంటూ అందులోకి చొరబడింది. ఆ రెంటితో బాటు దేముడికి ఒక కొబ్బరికాయ కొని రోడ్ మీదకి వచ్చేటప్పటికి పది నిముషాలు పట్టింది.
♦️♦️
ఇంకో నాలుగడుగుల వేసేటప్పటికి నా వాకింగ్ ఫ్రెండ్ రావు గారు కనపడి "ఏమిటి దంపతులు ఇద్దరూ నడుస్తున్నారు...కారు ఏమైంది?" అని అడిగితే..
"ఏమీ లేదండి..ఈవిడ కూడా వాకింగ్ చేస్తానంటే....." అని నసిగాను.
"అయితే దంపత తాంబూలాలు లాగ "దంపత వాకింగ్" అనే కొత్త కాన్సెప్ట్ అన్నమాట" అని నవ్వితే మేము కూడా జత కలిపాము.
♦️♦️
ఇంకో 20 అడుగులు వేయగానే కంగన్ హాల్ కనపడితే దాన్ని పావనం చేసింది. తల పిన్నులు, సేఫ్టీ పిన్నులు, జడ కి బ్యాండ్లు, నాడాలు, బొట్టు బిళ్ళలు షాప్ లోని బీరువా లోంచి మా బాగ్ లోకి, నా జేబులో డబ్బు షాప్ గల్లాపెట్టిలోకి, చేరుకున్నాయి.
♦️♦️
ఇలాగే స్టీల్ సామాను షాప్, స్వగృహ ఫుడ్స్ కూడా దర్శించాము. ఈ లోపల మా కోడలు నుంచి ఫోన్..
"వాకింగ్ కి వెళ్లి చాలా సేపయింది, మొదటి రోజే అత్తయ్యగారిని ఊరంతా నడిపించేస్తారా ఏమిటి?.... మీ మనవడికి ఎదో తెస్తానన్నారుట..ఇక్కడ రాగం.. తానం...పల్లవి అందుకున్నాడు " అని. మా వాడి రాగాలాపన ఆరున్నొక్క రాగంలో డాల్బీ డిజిటల్ DTS సౌండ్ లో వినపడింది ఫోన్లో.
♦️♦️
ఇప్పటిదాకా చేసిన వాకింగ్ అనబడే షాపింగ్ చాల్లే అనుకుని, ఓ చాకలేట్ కొని జేబులో వేసుకొని, రోడ్ మీదకి వచ్చి కనపడిన ఆటో పిలిచి ఆవిడని కూచోమన్నా...
"ఆయ్యో రామా...ఆటో ఎందుకండీ..ఇంకా నడవగలను...
ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆ రామాలయం లో కూడా దర్శనం చేసుకుంటే శివ కెేశవులనిద్దరినీ ఒకటే రోజు చూసిన పుణ్యం దక్కుతుంది..తరవాత అలా నడుచుకుంటు ఇంటికెళిపోవచ్చు కదా!" అంటోంది.
♦️♦️
కానీ అలాగే వాకింగ్ చేసుకుంటూ కొంచెం ముందరకి వెళితే.. రెండు పెను ప్రమాదాలు... వర మహాలక్ష్మి సిల్క్స్, దాని పక్కనే 'డబ్బులు ఊరికే రావు' అనే ఆ గుండాయన లలితమ్మ వారి బంగారం కొట్టు రూపంలో ఉన్నాయని, ఇప్పటిదాకా షాపింగ్ కి నెల పెన్షన్ అయితే, అటు వైపు వెళితే ఏడాది పెన్షన్ కి కాళ్ళు వచ్చినట్లే అని చెప్పలేక, "శివ కేశవుల గుళ్ళు చూడాలంటే చెప్పు..యాత్రా స్పెషల్ బస్ ఎక్కుదాము... ఇంట్లో మనవడు తీస్తున్న రాగం వినలేదా!" అన్నాను.
ఎక్కడికి సార్ అని ఆటో ఆయన అడిగితే, మా ఇంటి అడ్రస్ చెప్పి
"బాబూ, మెయిన్ రోడ్ మీదనుంచి కాకుండా చీకటిగా ఉండి, రోడ్ మీద ఉన్న షాప్ లు ఏమి కనపడకుండా ఉండే సందు గొందుల్లోంచి పోనీ" అని చెప్పి, ఆటో బయలుదేరగానే అమ్మయ్య అనుకుని వెనక్కి వాలేను
.
                     😂😂😂😂😂😂

No comments:

Post a Comment