మా తాత గారు పొరుగూర్లో పనిబడితే, వెళ్ళి రావడానికి, ఒక పాతిక - ముప్ఫయ్ మైళ్ళు అవలీలగా నడిచేసి, ఇంటికొచ్చాక, పెద్ద గోని బస్తా నెత్తిమీదనుంచి దింపుకుని, 'నాలుగు మెతుకులు'...అంటే, ఒక శేరు దంపుడు బియ్యం అన్నం తినేసి, మళ్ళీ పొలం కాపలాకి వెళ్ళి, అక్కడ నేరేడు, వేప చెట్ల కింద, నులకమంచమ్మీద సేదదీరేవారు.... ట !
కాళ్ళ నెప్పులు, అవీ జాన్తా నై...😱😱
అప్పటికి యింకా భూమ్మీద కరెంటు పుట్టలేదుట,
సైకిలు లాంటి విలాస వస్తువులు కొనేవారు కాదు...ట!
పొలం గట్టుకి దగ్గిర్లోనే లంకంత పేద్ధ పెంకుటిల్లు మాత్రం కట్టించుకుని, "ఇద్దరు - లేక ముగ్గురు" పాలేర్లని పెట్టుకుని, వ్యవసాయం "చూసుకుంటూ", స్వచ్ఛమైన పైర గాలి పీల్చుకుంటూ, ఏటేటా పిల్లల్ని కంటూ, వాళ్ళని పెంచుకుంటూ చాలా ఆనందంగా, ఆరోగ్యంగా బతికేసేవారుట.
💐💐💐💐💐💐
మా నాన్నగారు పుట్టిన కొత్తలో, అమెరికాలో ఎవరో కరెంటుని కనిపెట్టారుట. ఆయన కూడా గాంధీగారి ఉద్యమాలకు ప్రభావితులై, 'విదేశీ' హైస్కూలు చదువుకి మధ్యలోనే డుమ్మా కొట్టేసి, హాయిగా
'ల్యాండ్ లార్డు' బ్రతుకునే ఎంచుకున్నారు.
ఆయనకి సైకిల్ కొనుక్కునే స్థోమతు వున్నా,
కరెంటు పెట్టించుకునే వెసులుబాటు వున్నా,
'అనవసర భేషజాలు, దండగమారి ఖర్చులు ఎందుకులే' అనుకున్నారో... ఏమో...అవి రెండూ లేకుండానే సగం జీవితం గడిపేశారు. పిల్లల చదువులు కోసం కాబోలు, నేను పుట్టిన సంవత్సరంలో కరెంటు పెట్టించారు.
ఇంట్లో మొదటిసారిగా కరెంటు బల్బు వెలిగిన రోజు,
మా ఇంటిల్లిపాదీ విడివిడి గానూ, సామూహకంగానూ గంతులేశార్ట !
(ఆ మధ్య మొదటిసారి ప్రైవేటు రాకెట్టు లో అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళలాగ !)
💐💐💐💐💐💐
మా తరం వాళ్ళం, లో వోల్టేజి, కరెంటు కట్టులతో సహజీవనం చేసి, చేసి, "పవర్ లెస్" గాను,
"పవర్ ఫుల్" గాను కూడా బతికేసి, రాటుదేలి,
యింత వాళ్ళం అయ్యాం.
అయ్యామా?...అయ్యాక, మన ఆధ్వర్యం వచ్చాక,
ఆనందంగా - ఆరోగ్యంగా సగం జీవితాన్ని లాగేసి,
గొప్పకోసం ఒక ల్యాండ్ లైను ఫోను పెట్టించాం.
కానీ ఫోను ఎవరికి చెయ్యాలో తెలిసేది కాదు.
ఎందుకంటే...మనవాళ్ళలో చాలామందికి ఫోను ఉంటేగా !
ఎప్పుడైనా ఒకసారి ఫోను మోగితే, నలుగురం పరిగెత్తేవాళ్ళం !
మనం పుట్టాక, మూడు పుష్కరాలు వెళ్ళాక అనుకుంటా...ఒక డబ్బా స్కూటర్ కి బడ్జెట్టు కేటాయించుకుని, మళ్ళీ పొదుపు చర్యల్లో భాగంగా వారాంతంలోనే దాన్ని ఒక సారి వాడుకుంటూ,
డౌన్ లో ఇంజన్ ఆపేస్తూ, స్కూటర్ ని ఎంజాయ్ చేశాం.
అన్నట్టు... నా కష్టార్జితమైన స్కూటర్ ని మా పిల్లలు,
"పిండిమర" అని ముద్దు పేరుతో పిలిచేవారు !
మిగిలిన రోజుల్లో సైకిల్ తో వున్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం.
ఆఫీసు వాళ్ళు, 'అమ్మకాల శాఖ' కి బదిలీ చేసి,
"కాదు - కూడదు" అని చెప్పి, ఒక కారు కేటాయించి, పెట్రోలు డబ్బులు కూడా వాళ్ళే యిచ్చారు కాబట్టి,
రైతు బజారు దగ్గిర్నుంచీ, చుట్టాల్ని ఊరేగించడం దాకా దానితోనే కాలక్షేపం కానిచ్చాం.
💐💐💐💐💐💐
మా అబ్బాయి పుట్టిన సంవత్సరంలోనే, ఇంటర్నెట్ కూడా పుట్టిందట. ఇంకో మూడేళ్ళకి ఇండియా చేరినా, 1995 లోనే మన దాకా వచ్చింది. ఇంకో దశాబ్దానికి అనుకుంటా, మన చేతుల్లోకి పావు కేజీ బరువుతో నోకియా ఫోను వచ్చింది. అందులో వున్న సౌకర్యాలన్నీ తెలుసుకుందుకు, నేర్చుకుందుకు కొంత సమయం పట్టింది. "అబ్బో...మనం కూడా, మోడర్న్ అయిపోతున్నాం" అనుకుంటుండగా...మన పిల్లలు,
స్మార్టుఫోన్లు వాడ్డం మొదలెట్టేశారు.
"ఈ దిక్కుమాలిన ఫోన్లకి అంతంత డబ్బులు తగలెయ్యకండిరా..." అని అరుస్తుంటే,
మన చేతికి కూడా ఒక స్మార్టు ఫోను పార్సెల్ లో తెప్పించేశారు !
ఫోను మాట్టాడుకుందుకు, 'ఎస్సెమ్మెఎస్' లు చూసుకుందుకు, "నా పాత, బరువైన నోకియా వుండగా... బక్కచిక్కిన శాంసంగ్ ఎందుకు దండగ ?" అనుకుంటూనే, రుబ్బురోలు యుగం లోంచి,
వెట్ గ్రైండర్ తరంలోకి మారడానికి, దాని రుచి మరగడానికి, ఎక్కువకాలం పట్టలేదు ! 😌😌
"ఇంటర్నెట్ అంటే ఏమిటి నాయనా ?" అని అడిగి తెలుసుకున్న మనలాంటివాళ్ళందరం,
"ఇంటర్నెట్ లేకపోతే బ్రతకడం ఎలా బాబూ ?"
అని వాపోయే దాకా వచ్చాం !
కరెంటు పోతే, ఇన్వర్టర్లు పెట్టుకుని, కరెంటు నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి, ఎలాగైనా బతికెయ్యచ్చు.
ఇంటర్నెట్ ఆగిపోతే, మొబైల్ డేటా అయిపోతే...
హతోస్మి ! ఆ పరిస్థితిని ఊహించగలమా ?
"ఈ లాక్ డౌన్ లో ఎలా బతకాలి, ఎందుకు బతకాలి ?"
అని కొట్టుకుపోయాం !
(ఆ మధ్య ఆక్సిజన్ దొరక్క దేశ జనాభా కొంత తగ్గినట్టే...... 😢)
ప్రస్తుతం మనకి..కరెంటు, టీవీ, డైలీ సీరియల్స్, ఏసీ, ఇంటర్నెట్టు, స్మార్టు ఫోను, బైకు, కారు నిత్యావసర వస్తువులు. అవి కనక లేకపోతే...
"ఈ దేశం నాకేమిచ్చింది ?" అని ఒఖ్ఖ అరుపు అరిచి,
"గాంధి పుట్టిన దేశమా యిది, నెహ్రు కోరిన సంఘమా యిది ?" అని ఆరుద్ర భాషలో, అక్కినేని పోజులో ఆవేశపడిపోతాం.
💐💐💐💐💐💐
ఇప్పడుకనక, ఇంటర్నెట్టు, కరెంటు ఆగిపోతే, ప్రపంచం పరిస్థితి, జనాల మానసిక స్థితి, దేశాల ఆర్ధిక స్థితి,
ఈ "ఇంటి దగ్గిరనుంచే పని" వాళ్ళ జీవనభృతి....
ఎలా....ఎలా....ఎలా...? 😱😱😱
💐💐💐💐💐💐
మా ఎనిమిదేళ్ళ మనవడు గుక్కపట్టి ఏడుస్తూ,
వాడి 'ఛాంబర్' లోంచి బయటికొచ్చాడు.
"ఏమైంది కన్నా ? కడుపు నెప్పిగా వుందా ? దెబ్బ తగిలిందా ? భయమేసిందా ? ఆకలేసిందా ?" అని అక్కున చేర్చుకుని, ప్రశ్నల వర్షం కురిపించాను.
"నీకెప్పుడూ అదే గోల, నా బాధ నీకు తెలీదు, ఏడవడానికి ఆ కారణాలే వుంటాయా ? యింకేమీ వుండవా ? అప్డేట్ అవండయ్యా...డబ్బాకి బయట ఆలోచించండం (Think out of the box) నేర్చుకోండి !" అన్నంత ఫీలింగ్ యిచ్చాడు.
"నా టాబ్ లో యూ ట్యూబ్ గేమ్స్ రావట్లేదు, వైఫై ఆగిపోయిందా, కావాలని కట్ చేశారా ?" అన్నాడు !
"మాకు అలాంటి సౌలభ్యం కూడా వుందా, నాయనా ?" అనుకుని, సమస్యని పరిష్కారం కోసం మా అబ్బాయికి బదిలీ చేసి, నేను వాకింగ్ కి బయలు దేరాను.
మా తాత తరానికీ - మనవడి తరానికీ వారధిని నేను !
😂😂😂
No comments:
Post a Comment