*Rama* *Suri*
టీ, కాఫీలు తాగిన మేము ఇద్దరమూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము.
ఇంతలో అక్క దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. తను ఒక గంటలో బయలుదేరి వస్తోందట.
ఇంక ఇద్దరమూ గబగబా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయాము.
నా స్నానము, పూజ అయ్యేసరికి అక్క వచ్చింది.
మేము ముగ్గురము కలసి నేను చేసిన ఆటుకుల పులిహోర తిన్నాము. ఏమండీకి, అక్కకి వేడివేడి కాఫీ ఇచ్చాను.
అన్నంలోకి టమోటా పప్పు, కారం పెట్టిన వంకాయ కూర చేసి, మొన్న వేసిన ఉసిరికాయ ఊరగాయ తీసాను.
కంచాలు, మంచినీళ్ళు అన్ని టేబుల్ మీద ఏమండీగారే సర్దారు. భోజనంకి అందరమూ కూర్చున్నాము.
పప్పూ కలుపుకుంటూ అప్పడాలు ఏవీ అన్నారు. మర్చిపోయాను అని చెప్పాను (మొహంలో వేయించను అన్నట్టుగా పెట్టాను)
వెంటనే ఏమండీ లేచి నేను వేయించుకుంటాను అన్నారు. అంతలో అక్క వెంటనే "అదేమిటే మరిదిగారు అడుగుతుంటే, వెళ్ళు వేయించు", నేను తెచ్చిన గుమ్మడి వడియాలు కూడా వేయించు అంటూ నన్ను అరిచింది. మనసులో ఇద్దరినీ తిట్టుకుంటూ అప్పడాలు వడియాలు వేయించాను. ఏమాటకామాట చెప్పుకోవాలి. పప్పూ అన్నంలోకి అక్క తెచ్చిన గుమ్మడి వడియాలు అదిరిపోయాయి.
అన్నము తిని నేను చేయి కడుక్కోడానికి లోపలికి వెళ్ళాను. అంట చేతులతో కంచాలు తీస్తే అక్క తిడుతుంది. ఈలోపు రోజు అంట్లు ముట్టుకోని మా ఏమండీగారు మా ఇద్దరి కంచాలు తీసారు. మళ్ళీ అక్కతో అక్షింతలు
😌
కాసేపు పడుకొని లేచాక మా అక్క తెచ్చిన మైసూర్ పాక్ మా ఏమండీగారికి పెట్టాను.. టకటక రెండు ముక్కలు తిని దీనితో పాటు ఉల్లిపాయ పకోడి ఉంటే బాగుంటాయి. అందులో చక్కగా కరివేపాకు అవి వేసి అన్నారు. వెంటనే అన్నాను అక్క ఈరోజు ఉల్లిపాయలు తినదు. మరి ఎప్పుడన్నా చేస్తాను అన్నాను.
మా ఏమండీగారు అక్కకేసి జాలిగా చూసారు. వెంటనే మా అక్క, మరిదిగారికి ఉల్లిపాయ పకోడీ వేసి నాకు బంగాళ దుంప బజ్జిలు చేయి అంది.
తప్పుతుందా!! కళ్ళల్లో నీరు కార్చుకుంటూ ఉల్లి, మిర్చి కరివేపాకు వేసి ఒక రకం, బంగాళదుంప వేసి ఒక రకం బజ్జిలు వేసి వాళ్లకు ఇచ్చాను.
మా ఏమండీగారు ఇంక ఎప్పుడూ చెయ్యనేమో అన్నట్టుగా ఓ నాలుగు ఎక్కువ తిన్నారు.
కాఫీలు తాగాక అక్క రాత్రికి ఉండమన్నా, మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయింది.
నేను ఏమన్నా అంటానేమో అని మా ఏమండి కూడా అలా నడిచి వస్తా అని బయటికి వెళ్ళేరు.
రాత్రి ఇంక ఆకలి లేదు అంటూ మజ్జిగ తాగి పడుకున్నారు.
కానీ తిన్న సెనగపిండి అరగొద్దా!! రాత్రి అంతా పొట్ట పట్టుకు కూర్చున్నారు.
"చాధాస్తపు మొగుడు చెపితే వినడు కొడితే ఏడుస్తాడు అన్నటుగా ఉంది"
No comments:
Post a Comment