*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 47-1*
*1925 - 2009*
*విలక్షణ స్వరలక్ష్మి, నట గాయని ఎస్.వరలక్ష్మి*
ఆమె సహజ గాయని. కథా నాయిక, చలన చిత్రనటి. అనుకరణ సాధ్యంగాని విలక్షణ స్వరమాధుర్యం ఆమె పాటల్లో ఒప్పారుతుంది. *'మీర జాల గలడా నాయానతి'* అంటూ సత్యభామలా అహాన్ని, *రతి రాజ సుందర రణ రంగధీర'* అంటూ భర్తలో పౌరుషాన్ని రేకెత్తించే అవకాశాన్ని *ఎవరినే నేనెవరినే* అంటూ తన సౌందర్యానికి తానే మురిసిపోయే ఆనందాన్ని, *'తిరుమల తిరుపతి వెంకటేశ్వర'* పాటలో భక్తి పారవశ్యాన్ని *'వేయి శుభములు కలుగు నీకు'* అనే పాటలో ప్రశాంత చిత్తంతో శుభాకాంక్షను ఇలా ఏ రసాన్నైనా, ఏ భావాన్నైనా విలక్షణ గమకాలతో ఆలపించే స్వరం ఆమె సొత్తు.
13-8-1925న గోదావరి జిల్లా జగ్గంపేటలో శ్రావణ శుక్ర వారం నాడు పుట్టి వరలక్ష్మి అయింది. తండ్రి సరిదె నీలా చలం నాయుడు. ఈమె నాలుగో ఏట నుండి కర్నూలులో పెద్దమ్మ దగ్గరే పెరిగింది. పెదనాన్న రంగయ్య నాయుడు సంగీతం తెలిసినవాడు తానే ఈమెకు వర్ణాలూ, కృతులూ నేర్పాడు.
బాల్యంలోనే గూడవల్లి రామబ్రహ్మంగారు ఖంగుమని మోగుతున్న ఈమె గొంతులోంచి శాస్త్రీయంగా ఆలపించిన కృతులు విన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈమెనుపిలిపించి *'బాల యోగిని'* వేషం ఇచ్చారు. అపుడామెకు పదేళ్లు. తరువాత వరసగా *సేవాసదన్* అనే తమిళ చిత్రంలోను, *ప్రేమ సాగర్* అనే హిందీ చిత్రంలోను బాల పాత్రలో నటించింది. బాల నటిగా ఆమె మూడు భాషల్లో మొదటి మూడు చిత్రాలూ నటించడం విశేషం. హిందీ చిత్రంలో నాలుగు పాటలు కూడా పాడింది. ఆ తర్వాత 1939లో రామ బ్రహ్మంగారు నిర్మించిన సంచలన చిత్రం *రైతు బిడ్డ'* లో పి. సూరిబాబు కుమార్తె గాను నటించింది. 1940లో రామ బ్రహ్మంగారే నిర్మించిన మరొక ప్రసిద్ధ చిత్రం *'ఇల్లాలు'* లో కాంచన మాల చిన్నప్పటి వేషం వేసింది. యుక్త వయస్కురాలు కావడంతో పెత్తండ్రి ఈమెను సినిమాల్లో నటింప జేయడానికి అంగీకరించకపోవడంతో కొన్నాళ్ళు చిత్రపరిశ్రమకు దూరమైంది. మద్రాసులో ఉంటూనే రేడియోలో పాడుతుండేది. 1945లో మళ్లీ రామ బ్రహ్మంగారు పిలిచి తాను నిర్మిస్తున్న *'మాయాలోకం'* చిత్రంలో కథా నాయికగా వేయమన్నారు. నాయకుడు అక్కినేని. ఆ పాత్రకు మొదట ఎంపికైంది కమలా కోట్నీస్, చిత్రం కూడా కొంత పూర్తయింది. ఆమె విరమించుకోవడంతో ఈ అవకాశం ఎస్. వరలక్ష్మికి దక్కింది. రామబ్రహ్మం ఈమె పెత్తండ్రిని ఒప్పించి ఇందులో నటింపజేసారు.
ఎస్. వరలక్ష్మికి పేరు వచ్చిన చిత్రం *పల్నాటి యుద్ధం*. దీని దర్శకుడు రామ బ్రహ్మం గారే. ఐతే అనారోగ్యం వల్ల చిత్రంలో ఎక్కువ భాగం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందింది, కాని వరలక్ష్మి *మాంచాలగా* నటించిన దృశ్యాలన్నీ రామ బ్రహ్మం గారి దర్శకత్వంలోనే చిత్రించారు. ఈ చిత్రంలో అక్కినేని, వరలక్ష్మి ఎవరి పాటలు వాడే పాడుకున్నారు. భర్తను తలచుకుని మాంచాల విరహ బాధను చెప్పుకునే *చందమామ ఓ చందమామ*' గీతంలోనూ, మరో ప్రణయ గీతం *ఈ మహా రాత్రి'* లోనూ గొంతులో విరహ భావాన్ని పలికించి పాటలకు జీవం పోసారు. బాలచంద్రుని రణ రంగానికి పంపే సన్నివేశంలో వీర తిలకం దిద్ది సాగనంపే వీర నారిగా వరలక్ష్మి నటన అద్భుతమని నాటి తరం మెచ్చుకున్నారు.
*'రణములో తొడ గొట్టి రాగాల బట్టి'* అని మాంచాల ఆవేశపడితే, దానికి స్పందించిన బాల చంద్రుడు ఆవేశంతో *'మానవ నైజంబు మాననేనయితి*' అంటూ కర్తవ్యోన్ముఖుడౌతాడు. మాంచాల రెట్టించిన ఉత్సాహంతో *'రతిరాజు సుందర రణ రంగధీర'* అంటూ సాగనంపుతుంది. రెండు పదుల ప్రాయంలోనే వరలక్ష్మి వీరలక్ష్మిలా అభినయించింది, ఈ చిత్రంలో అక్కినేని, వరలక్ష్మి విజయవంతమైన జంటగా ప్రసిద్ధికెక్కారు.
ఎస్. వరలక్ష్మికి బాగా పేరు తెచ్చిన చిత్రం *'బాలరాజు,* ' కథా నాయకుడు నాగేశ్వరరావు, యక్ష కన్య మోహిని ఇంద్రుని శాపం వల్ల భూలోకంలో సీతగా జన్మిస్తుంది. ఆ పాత్రలో వరలక్ష్మి నటించి పాడిన ప్రతి పాట ప్రజాదరణ పొందింది.
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సశేషం)
No comments:
Post a Comment