Sunday, April 20, 2025

 ఈ రచన నా స్వీయ సృజన ...
                        ------- 
         డాక్టర్ గారు రిపోర్ట్లు పరిశీలిస్తుంటే, నడివయసులో ఉన్న ఆ దంపతులు ఆయన ఏం చెప్పబోతున్నారో అన్న ఉద్విగ్నతతో నిటారుగా కూర్చొని ఆయనకేసి చూస్తున్నారు. వీరి ఆందోళన  అర్థం చేసుకున్న ఆయన "మరేం ఫర్వాలేదు, అంతా బాగానే ఉంది. మీ ఇంట్లో గాని, మీ ఇద్దరి నడుమ గాని ఏ సమస్యలు లేవుగా?"...అని ప్రశ్నించగానే, "అబ్బే! అలాంటివేమీ లేవండి"... అని ముక్తకంఠంతో బదులిచ్చారు.
          డాక్టర్ గారు చిరునవ్వుతో భర్త వేపు చూస్తూ..."మీ శ్రీమతి గత కొన్నేళ్లుగా ఒకే విధమైన దినచర్య, జీవనశైలి తో అలసిపోయి దానిని అధిగమించే మార్గం తోచక, తనలో తానే మధనపడుతూ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. చెప్పుకోవటానికి పెద్ద జబ్బేమీ కాదు గానీ అలక్ష్యం చేస్తే ఇదే పెనుముప్పుగా పరిణమించవచ్చు. ఈ విషయంలో  మందులు చేయగలిగిందేమీ లేదు. నా సలహా ఏమిటంటే... కొన్నాళ్ళు ఆవిడని ఈ వాతావరణానికి దూరంగా ఉంచితే బాగుంటుంది, ప్రయత్నించండి"...అని ముగించగానే దంపతులిరువురూ ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు.
          ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఆమె అభావంగా ఉండిపోవడం గమనించిన అతను, భార్యతో..."మీ మేనమామగారు ఎప్పటినుండో నిన్ను వారింటికి రమ్మంటున్నారు కదా, ఓ నాలుగు రోజులు వెళ్ళివద్దామా?"... అని లాలనగా అడిగాడు. దానికామె ముక్తసరిగా..."మీ ఇష్టం", అని బదులిచ్చింది. "సరే అయితే, రేపు ఉదయమే బయలుదేరాం" , అని ఆమె చేతి మీద తన చేతిని ఉంచాడు భరోసాగా.
                           -------
          ఊరు పొలిమేరకి చేరుకోగానే ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లున్న పెద్ద పెద్ద చెట్లు, వాటికి కట్టిన ఉయ్యాలలో ఊగుతూ ఉన్న పిల్లలను గమనిస్తూ, పంట కాలువ పక్కగా ఊర్లోకి వెళ్తుంటే దారిలో కనిపించిన గుడికి మనసులోనే నమస్కరించి, కొన్నాళ్ల క్రితం కలతిరిగిన ఆ వీధులు, పరిసరాలు ఆసక్తిగా పరికిస్తూ...తన మేనమామ ఇంటికి చేరుకుంది. 
         ఎప్పుడూ తన భర్తా,పిల్లల కోసం తాను పడిగాపులు పడడమేగాని ...తమకోసం గుమ్మం లోనే కాచుకుని ఉన్న మేనమామ దంపతులను చూడగానే, గతించిన తన అమ్మానాన్నలు గుర్తు రాగా, అప్రయత్నంగానే చెమర్చిన కళ్ళతో వారిరువురి పాదాలకు నమస్కరించిందామె. "ఎన్నాళ్ళకెన్నాళ్ళకు గుర్తుకు వచ్చామే"... అంటూ ఆమెను ఆప్యాయంగా హత్తుకుని, "లోపలికి రండి బాబూ"... అంటూ అతనిని ఆహ్వానిస్తూ,  ఆ వృద్ధ దంపతులు ఆమెను పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. 
          తన ఇంటి ఇల్లాలుగా అజమాయిషీ చేస్తూ పెద్ద తరహాతో ఉండే ఆమె, ఈ ఇంట్లో ఒక చిన్నపిల్లగా ఆ దంపతులతో మసలుతుంటే, ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్న అనుభూతి కలిగింది అతనికి. 
తన మేనమామ దంపతులతో అవిశ్రాంతంగా కబుర్లు చెబుతూ తనదంటూ ఏ బాధ్యత లేకుండా అలా హాయిగా, ఉల్లాసంగా కనిపిస్తున్న తన శ్రీమతిని మురిపెంగా గమనిస్తున్నాడతను.
          తెల్లవారుఝామున తన అత్త కళ్ళాపి చల్లితే, చుక్కలముగ్గు వేస్తూ మైమరిచిపోయిందామె. ఆ పెద్దావిడతో కుంకుడుకాయలు చితక్కొట్టి, ఆ పులుసు తో తలారా స్నానం చేసి, పెరట్లోని తులసమ్మ చుట్టూ ఆవిడ వెనకే అడుగులు వేస్తూ... ఆపై మేనమామ పడక్కుర్చీలో కూర్చుని చిన్ననాటి కబుర్లు చెబుతూ ఉంటే, ఆయన భార్య మెత్తటిగుడ్డతో  తుడుస్తూ,చిక్కులు తీస్తూ తడితల ఆరబెడుతుంటే... వాళ్ళిద్దరితో ముచ్చట్లు చెబుతూ, కులాసాగా ఫలహారం ఆరగిస్తున్న ఆమెను..‌ సంతోషంగా చూస్తున్న అతనికి, ఆమె పోగొట్టుకున్నదేంటో మెల్లమెల్లగా అర్థం అవుతుంది. వంటింటిలో తన అత్తతో కబుర్లు చెబుతూ తనకిష్టమైన పదార్థాలు అడిగి మరీ చేయించుకుని కడుపారా ఆరగించిందామె. పెరట్లో పూసిన పూలను అత్తతో కలిసి మాలలు కడుతూ లోకాభిరామాయణం అంతా చెప్పిందామెకు.రాకరాక వచ్చిందని ఆమెతో కూడా పంపడానికి వడియాలు, పచ్చళ్ళు, పిండివంటలు ఆ దంపతులు ఏర్పాటు చేస్తుంటే, తనొకడిని ఉన్నానన్న విషయమే గుర్తులేనట్లు వాళ్ళతో కలిసిపోయిన ఆమెను అపురూపంగా చూస్తూ...డాక్టర్ గారు మంచి సలహానే ఇచ్చారు అనుకున్నాడతను.
         మేనమామ దంపతులతో కలిసి ఊర్లోకి షికారుగా వెళ్లినప్పుడు,దారిలో ఎదురైనవాళ్ళు తన గురించి ఆరా తీస్తుంటే..."ఎవరనుకున్నారు, మా అక్క కూతురు", అని మేనమామ గర్వంగా చెబుతూ సాగిపోతుంటే ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరంగా అనిపించింది ఆమెకి. పంటకాలువలో కాగితం పడవలు వేసింది. గుళ్ళో చెట్టు కింద రాలిన పూలు ఏరి తెచ్చుకుంది. ఊరి మొదట్లో ఉన్న ఉయ్యాల ఎక్కి ఊగుతూ మురిసిపోయింది. సందకాడే రాత్రి భోజనం ముగించి ఆరుబైట ఆకాశంలో చందమామ, తెల్లటిమబ్బులు, నక్షత్రాలు ను మైమరపుతో చూస్తూ ఆ దంపతులతో తన పుట్టినింటి పాతజ్ఞాపకాలు, కబుర్లు నెమరువేసుకుంటూ ఆ వెన్నెలలో ఏ చీకూచింతా లేకుండా పొద్దెక్కేదాకా హాయిగా పడుకునిపోయింది ఆమె. 
                         -------
         ఎంతో ఉల్లాసంగా నాలుగురోజులు గడిపి, తిరుగుప్రయాణమైన తమకు... మేనమామ దంపతులు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదిస్తూ..."ఈసారి పిల్లలను కూడా తీసుకుని పదిరోజులు ఉండేలాగా రావాలి", అని సాగనంపుతుంటే... ఇన్నాళ్లుగా తను పోగొట్టుకున్న పెన్నిధి ఏదో దొరికినట్టు ఉంది ఆమెకు. చిరునవ్వుతో వారికి వీడ్కోలు చెబుతూ వాళ్ళు కనుమరుగయ్యేంతవరకూ చూస్తూనే ఉందామె. ఈ ఊరు వచ్చేటప్పటికీ, ఇప్పటికీ ఆమెలో మార్పును గమనించిన అతను....

"ఈమె యంత్రం కాదు, మనిషి. గత కొన్నేళ్లుగా తమకు సేవ చేసి శారీరకంగా, మానసికంగా అలసిపోయిన ఆమెకు తామివ్వవలసింది... "గుర్తింపు". అదే తాను కోల్పోయింది, తన మేనమామ ఇంట తిరిగి పొందింది. ఆమె కోరుకునేది...తన పనిలో తమ వంతు సాయం, తన భావాల పట్ల తమ గౌరవం... వెరసి మా అందరి కోసం మాత్రమే తాను కాదు...తన కోసం మేమందరం కూడా ఉన్నామన్న ధీమా. తన జీవితమంతా మేమే కాదు... మాతో పాటు తన ఇష్టాలు, కోరికలు, అభిరుచులు... వాటిని పొందే వెసులుబాటు. అదే మేమందరం ఆమెకు ఇవ్వవలసింది. తన జీవితమంతా మేమే ఆక్రమించుకుంటే,  "అసలు తనని" మా కోసం కోల్పోతూ, మమకారమనే పాశంతో బందీ అయి, అందులోంచి ఎలా బయటపడాలో తోచక, తనకెంతో అపురూపమైన "తన స్వేచ్ఛ" కై పరితపిస్తూ...తన ఈ భావాలను ఎవరితో పంచుకోవాలో తెలియక...తనలో తానే కుమిలిపోతూ, పైకి తమకు ఏ లోటూ రానీయకుండా కాలం గడిపేస్తూ, లోలోపల మాత్రం శుష్కించిపోతూ ఎంతో వేదనకు గురైంది. తనతో ఉన్న తను తాను కాదు. తన మేనమామ ఇంట్లో నేను చూసిన తానే తను"...

అని తమ సమస్యకు పరిష్కారం దొరికింది అన్న తృప్తి తో ఆమె చేతి మీద తన చేతిని ఉంచాడు మృదువుగా...
"నీకు నేను ఉన్నాను అన్నట్లు".
                        ------
నా బుడిబుడి రాతలను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.....ఆరాధ్యుల ప్రణవ్.

No comments:

Post a Comment