Tuesday, April 22, 2025

 *పునరపి జననం పునరపి మరణం* 

*పునరపి జననీ జఠరే శయనం* 
*ఇహ సంసారే బహు దుస్తారే* 
*కృపయా పారే పాహి మురారే* 

*భజగోవిందంలో చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే... "మళ్లీ మళ్లీ పుట్టడం, మళ్లీ మళ్లీ చావడం, మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతు లేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు". మన వాసనలు, కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించి జన్మ పొందుతాము. ఆ జన్మలో కొన్ని వాసనలు, కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము. మళ్లీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను, వాసనలను ప్రోగు చేసుకుంటాము. మళ్లీ ఈ వాసనలు, కర్మఫలాల మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తుంటాం. ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్లీ మళ్లీ ఎత్తుతూ ఉంటాం. ఈ జనన, మరణ చక్రంలో బంధింపబడతాం.*

*ఈ వాసనలు, కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన, మరణాలు తప్పవు. అసలు ఈ వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడతాయనేది ప్రశ్న. ప్రతి మానవుడూ ఏవో కర్మలను చేస్తుంటాడు. మమకారంతో, కోరికతో, రాగద్వేషాలతో కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు, కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. అయితే మానవుడు ఏ పనీ చేయకుండా ఉండడానికి బండరాయి కాదు కనుక పని చేయాల్సిందే. 'కుర్వన్నే వేహ కర్మాణి' అని ఈశావాస్యోపనిషత్లో చెప్పినట్లు 'ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే! 'నహికశ్చన్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృ త్' అని భగవద్గీతలో బోధించినట్లు 'కర్మలు చేయకుండా ఒక్కక్షణం కూడా ఉండే వీలు లేదు. అయితే ఎలా చేయాలి? కోరికలు లేకుండా... నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా అనగా కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవ దర్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావమూ లేకుండా నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు కొత్త వాసనలు దరి చేరవు. కర్మఫలాలు కూడా అంటవు. అయితే ఇలా చెయ్యాలంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మన స్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంత కాలం ఈ పుట్టడం, చావడం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే.*

*జనన, మరణాల వల్ల మనకు ఏమిటి నష్టం? పుట్టేటప్పుడు ఏడుపు, పెరిగేటప్పుడు ఏడుపు, రోగాలొస్తే ఏడుపు, ముసలితనం వస్తే ఏడుపు, కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు, నీది అనుకున్నది దూరమైతే ఏడుపు. చివరకు మరణించేటప్పుడు కూడా 'అయ్యో! అన్నింటినీ, అందర్నీ వదిలి పోతున్నానే అని ఏడుపు. ఆ అవ్యక్తలోకాల్లో ఎన్ని కష్టాలు పడాలో, ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు.*

*మళ్లీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి. అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి. అక్కడ ఉండడానికి చాలా ఇరుకు, సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుగుప్సాకరమైన రక్తము, చీము, మాంసం మొదలైన పదార్థాలతో నివాసం. ఇక ఉండడం కూడా తల క్రిందకు మోకాళ్లకు ఆని ఉంటుంది. అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. అంతటి దుర్భరం, బాధాకరమైనది గర్భనరకం.*

*ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్దరించుకోవాలంటే మనకు సాధ్యమేనా? మన శక్తి సరిపోతుందా? చాలదు. కనుక పరమాత్మను ఆశ్రయించాలి. 'ఓ ప్రభూ! ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి. భగవంతునితో తాదాత్మ్యం చెందాలి. ఆయనను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు. ఇలా భగవంతుని ఆశ్రయించి, జనన మరణ చక్రం నుండి విడుదల పొందితే జీవన్ముక్తులవుతాం.*

*┈•━❀꧁గురుభ్యోనమః꧂❀━•┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment