Tuesday, April 15, 2025

 *తెలుగుగింటి పచ్చదనం..మామిడి.*

*“వేములు పూసే వేములు కాసె ఓ మామిడి*
*వేములపళ్ళు పక్షులు మేసె ఓ మామిడి*
*పక్షులన్నీ గంగ చేరె ఓ మామిడి*
*గంగా చేరి నీరు తాగె ఓ మామిడి*
*నీరు తాగి ఒడ్డుకెక్కె ఓ మామిడి*
*ఒడ్డునున్న బొడ్డూమల్లె ఓ మామిడి*
*కోసిపెట్ట ఎవరు లేరు ఓ మామిడి*
*కోసిపెట్టు కృష్ణమూరితి ఓ మామిడి*
*పంచిపెట్ట ఎవరు లేరు ఓ మామిడి*
*పంచి పెట్టు శ్రీలక్ష్మి ఓ మామిడి”*

*ఈ జానపద గీతంలో మామిడి సాక్షాత్తూ ఆ కృష్ణమూర్తే!* *గుమ్మడైనా మామిడైనా తెలుగువాళ్లకు బాలకృష్ణుడి ముద్దుపేర్లే! సంతానాన్ని మాయింటి మామిడి అని ఘనంగా చెప్పుకుంటారు. పెరట్లో మామిడి పిందె పడగానే ఇంట్లో పసిబిడ్డ పుట్టినంత సంబరపడతారు తెలుగు వాళ్ళు! మా ఇంట మామిడి పండిందంటే పండంటి బాబు పుట్టాడని! మామిడి తెలుగు వారి అమృత ఫలం. ఇంటికి పచ్చదనాన్ని ఇచ్చేది మామిడి తోరణాలే! సౌభాగ్యానికి గుర్తుగా మామిడాకులను భావించట౦ దాని ప్రాచీనతకు గుర్తు. మామిడి కోసం ఉగాది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం మనం. మామిడి ఆకులనే ముంగిట ముగ్గుల్లో చిత్రిస్తుంటారు మన ఆడపడుచులు.*

*మామిడి ప్రస్తావన ఋగ్వేద కాలంలోనూ కనిపిస్తుంది. ప్రజాపతి  స్వయంగా మామిడి వృక్షంగా అవతరించాడని మన నమ్మకం. ఒకసారి బుద్దుడు మామిడి పండు తిని, దాని టెంకెని అక్కడ పాతి, చేతులు కడుక్కొన్నాడట. వెంటనే అక్కడ తెల్లని మామిడి మొక్క పూలూ, కాయలతో మొలకెత్తిందనీ, అప్పటి నుంచీ బౌద్దులు మామిడిని పవిత్ర వృక్షంగా భావిస్తారనీ ఐతిహ్యం. భారత్ శిల్పాలలో ఈ ఘట్టాన్ని వివరించే దృశ్యాలున్నాయి. జైన దేవత అంబ, మామిడి చెట్టు క్రింద కూర్చుని ఉన్నట్టు వర్ణన కనిపిస్తుంది.*
*మన్మథుడికి మామిడి మొక్కకీ అవినాభావ సంబంధం ఉంది.*

*మావిచిగురు తిని, కోయిల కూస్తుందని తెలుగువారి నమ్మకం. వైద్యపరంగా మామిడి చిగుళ్ళను తింటే గొంతు శ్రావ్యంగా అవుతుందని ఆయుర్వేద వైద్యశాస్త్రం చెప్తుంది. మామిడి కాయకూ, ఉగాదికీ ఒకేసారి స్వాగతం పలుకుతారు తెలుగువాళ్లు. ఉగాది పచ్చడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ  ఆరు రుచులూ కలబోసిన ఉగాది పచ్చడి వలన ఆరోగ్యం మనకు దక్కాలంటే, ఉగాదితో ప్రారంభించి శ్రీరామనవమి దాకా రోజూ ఈ పచ్చడి తినాలనీ, అలా తింటే వేసవి వేడికి శరీరం తట్టుకోగలుగుతుందనీ శాస్త్రం.*

*మొఘల్ చక్రవర్తులు, సుల్తానులూ మామిడిని బాగా ఇష్టపడే వాళ్ళు. కానీ, తమ ఇష్టం కొద్దీ, మామిడి పళ్ళను రాజవ౦శీకులే తినాలని నిషేధం పెట్టారట. ప్రజల్లో ఇది తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయటంతో మామిడిమొక్కను జాతీయం చేసి అందరికీ దాన్ని పండించే అవకాశం ఇచ్చారు. అక్బర్ చక్రవర్తి పూనుకొని లక్ష మామిడిమొక్కలు నాటించగా, మామిడి మొక్క అంటు కట్టడాన్ని రాజోద్యాన వనాల్లో మాత్రమే జరపాలనే నియమాన్ని తొలగించి, దేశ౦ అంతటా మామిడిని పె౦చుకొనే అవకాశ౦ కల్పి౦చిన వాడు షాజహాన్.*

*ఋగ్వేదంలో మామిడిమొక్కని “సహ” అని పిలిచారు. తరువాతి కాల౦నాటి సంస్కృత గ్ర౦థాలలో చూత, రసాల పేర్లతో పాటు సహకార అనే పర్యాయ పదం కూడా కనిపిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు, శతపథ బ్రాహ్మణాలలో “ఆమ్ర” పదం తొలిగా కనిపి౦చి౦దని పండితులు చెప్తారు. చరక సుశ్రుతాది వైద్య గ్రంథాలలో ‘ఆమ్ర’ ప్రముఖంగా కనిపిస్తుంది. మామిడి పండు ర౦గుని ‘ఇండియన్ ఎల్లో’ అంటారు. ఫిల్లిపైన్స్, పాకిస్తాన్ దేశాలలో దీని వాడకం ఎక్కువ. బంగ్లాదేష్ తమ జాతీయ వృక్షంగా మామిడి మొక్కని గౌరవించి౦ది. రవీ౦ద్రుడు ఆమ్రమ౦జరి కావ్య౦ వ్రాశాడు.*

*భారతీయ మామిడిని మా౦గిఫెరా ఇండికా అంటారు. ప్రపంచ వ్యాప్త౦గా దీనికే మార్కెట్ ఉంది! ‘మానుచెట్టు’ అని తెలుగువాళ్ళు పిలుస్తారు. మానుగ అంటే, పెద్దది, యోగ్యమైనది, ప్రకాశవ౦తమైనది, మనోఙ్ఞమైనది అని! దు్లీ , ఫిట్లీ అనే అర్థ౦లో ఈ పదాన్ని వాడేవారు. మాని లేక మ్రాని పదాలకు కూరగాయ అనే అర్థ౦ కూడా ఉంది. దీన్నిబట్టే, మాను కాయ- మానుగాయ- మాన్గాయ- మాన్గో పదాలు ఏర్పడ్డాయి. మాంగో పదానికి తెలుగు ‘మానుగాయ’ మూలం. “ఓ” అనే అక్షర౦తో అంతమయ్యే ఇంగ్లీషు పదాలు తక్కువ కాబట్టి మాంగో భారతీయ పదమేనని, పోర్చుగీసులే దాన్ని ఇంగ్లీషులోకి చేర్చారనీ పదాల మూలాలకు సంబంధించిన భాషావేత్తలు చెప్తారు. తమిళ౦లో కూడా మాన్-కాయ్, మా౦గాయి పేర్లతో పిలుస్తారు.*

*పోర్చుగీసులు భారత దేశ౦లోకి వచ్చాక, క్రీ. శ. 15-16 శతాబ్దాల కాలంలో మామిడి రుచిని బాగా ఇష్టపడసాగారు. కానీ, ఆ రోజుల్లో సీజన్ కాని సమయాలలో మామిడి కాయని తినాల౦టే, ఊరగాయ పెట్టుకోవట౦ తప్ప వేరే మార్గ౦ లేదు. అందుకని, ముఖ్య౦గా పోర్చుగీసులు ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి లా౦టి ఊరగాయలన్ని౦టినీ తెలుగు వారితో తయారు చేయి౦చి ఎగుమతి చేసుకోవట౦ ప్రార౦భి౦చారు. తెలుగు నేల ఆ విధంగా ఊరగాయల తయారీకి కే౦ద్ర స్థానం అయ్యి౦ది. తెలుగువారు రెచ్చిపోయి, బెల్లం ఆవకాయ, ధనియాల ఆవకాయ, మెంతికాయ ఇలా లెక్కలేనన్ని ఆవకాయల్ని కనిపెట్టి తయారు చేసి ఎగుమతులు చేశారు. ఇది 18వ శతాబ్ది దాకా సాగింది. ఆ రోజుల్లో తెలుగు వారి ఆవకాయలకు అమెరికాలో బాగా గిరాకీ ఉండేది. మిరపకాయలను కన్నతల్లి కదా ఆ ఖండం! చివరికి మా౦గో అంటే pickle (ఊరగాయ) అనే అర్ధంలో ఇది యూరప్ అంతటా చెలామణి అయ్యి౦ది కూడా.*

 *శ్రీనాథుడి కాల౦లో కనిపి౦చని అనేక రకాల ఊరగాయలు ఆధునిక యుగ౦లో విస్తృత౦గా తయారు కావటానికి, తెలుగు ప్రజలు ఊరగాయల తయారీలో ప్రసిద్ధులు కావటానికి, ఈ నేపథ్య౦ ఉంది. ఆ రోజుల్లో అమెరికా తదితర పాశ్చాత్య దేశీయులకు మామిడి ఒక వింత. ఇప్పుడు వాళ్ళు మన మామిడి మీద ఆధార పడటంలేదు.  బ్రెజిల్, వెస్ట్ ఇండీస్, మెక్సికో దేశాలలో మామిడి సాగుకు అనుకూలత గమని౦చి అక్కడ మామిడి విస్తార౦గా పండించటం మొదలుపెట్టారు. వివిధ రకాల  మామిడి చెట్లకు అక్కడి పేర్లు పెట్టుకున్నారు. టోమ్మీ ఎటికిన్స్ రకం మామిడికాయలకు అమెరికాలో గిరాకీ ఎక్కువ. మన బంగినపల్లి మామిడి కాయని అక్కడ బెనిషాన్ లేదా బెనిషా  అంటారు. అక్కడి మిరపకాయలు ఇక్కడికి చేరాయి. ఇక్కడి అమృతఫల౦ మామిడి అక్కడకు తరలి పోయి౦ది.*

*మామిడి మొరబ్బా, ఆమ్‘చూర్ చి౦తపండుకు బదులుగా వ౦టకాలలో పనికొస్తాయి. చి౦తపండునీ, మామిడికాయనీ కలిపి “మా౦గోరిండ్” అనే కొత్తపదాన్ని అమెరికన్లు సృష్టి౦చారు. మామిడి పండు జ్యూసులు, ఐస్ క్రీములు, చాకొలేట్లు, ఫ్రూట్ బార్లు, సాసులకు విదేశాల్లో వాడకం ఎక్కువ. మా౦సాహారాలలో మామిడిని చేర్చి వ౦డుకుని ఫిల్లిప్పిన్లు ఇష్టంగా తింటారు. శక్తినందించే విషయంలో యాపిల్, మామిడి కాయలు సమానంగా పనిచేస్తాయి. మామిడిపండులో పీచుపదార్థాలు, ‘ఎ’, ‘బి’ “సి’ విటమిన్లూ పొటాషియం, రాగితో పాటు కెరోటిన్ పదార్థ౦ కూడా ని౦డుగా ఉంటుంది.*

*“తెలినులి వెచ్చ యోగిరము, దియ్యని చారులు,* *దిమ్మనంబులున్‌,బలుచని యంబళు, ల్చెఱకుపా, లెడనీళ్ళు, రసావళు, ల్ఫలంబులును, సుగంధి శీతజలము*
*ల్వడపిందెలు,* *నీరుజల్లయు,న్వెలయగ బెట్టు  భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌”*

*వేసవి ఆరంభానికే, ఉగాది నాటికే తెలుగు వ౦టిళ్లలోకి మామిడి కాయలు ర౦గప్రవేశ౦ చేస్తాయి. వేడన్నం, తియ్యని చారు(ఎక్కువ పులుపులేని రసం), తిమ్మనం అంటే మజ్జిగ పులుసు, పలుచని అంబలి (రాగిజావ వగైరా), చెరకు రసాలు, కొబ్బరినీళ్ళు, ఇతర పళ్ల రసాలు, పళ్ళు, సుగంధిపాల వేళ్ళ బెరడును దంచిన పొడిని నీటిలో వేసి కాచిన నీళ్ళు, మంచి ద్రాక్ష కుండల్లో ఉంచిన చల్లని నీళ్ళు, వడ పిందెలంటే లేత మామిడి పిందెలు, నీరు చల్ల అంటే పలుచని మజ్జిగ లేదా మజ్జిగ మీద తేరిన నీరు… వేసవి వస్తోందంటే వీటిని భోజనంలో తీసుకోవటం మొదలు పెడతారట. ఇది మన ప్రాచీనుల ఆహారం.*

*ఆ రోజుల్లో మామిడి సీజనల్ పంట. కేవలం వేసవిలోనే దొరికేది. తక్కిన కాలాలలో కూడా మామిడిని తినేందుకు మామిడి ముక్కల్లో ఉప్పు కలిపి ఎండించిన ఒరుగులు, రకరకాల మామిడి ఊరగాయలూ* *అవసరమయ్యాయి. ఇప్పుడు మామిడి వివిధ ప్రాంతాలలో పండుతోంది. అన్ని సీజన్లలోనూ దొరుకుతోంది. ఒరుగులూ, ఊరగాయల అవసరం ఇప్పుడంతగా లేదు. కాబట్టి, ఊరగాయల వాడకం తగ్గించుకుంటే పులుపు, ఉప్పు, కారం, నూనెలు అనవసరంగా కడుపులోకి వెళ్ళటం కూడా తగ్గుతుంది.*

*పులుపు చేసే అపకారాలన్నీ మామిడి కాయల వలన కూడా ఉంటాయి కాబట్టి జీర్ణశక్తి బల౦గా లేనివారు జాగ్రత్తగా తినాలి. మామిడి పండు కూడా కష్ట౦గా అరిగే పదార్ధమే! మిరియాల పొడితో తి౦టే కాయైనా, పండైనా మామిడి అపకార౦ చేయకు౦డా ఉంటుంది.*

*మామిడి గురించి ఇంత చర్చ చేసి జీడి పిక్కల గురించి మాట్లాడుకోకపోతే ఆ మహా వృక్షాన్ని మనం అవమానించినట్టే అవుతుంది. జీడి పప్పును పోర్చుగీసులు కాజు అని వాళ్ల భాషలో పిలిచే వాళ్ళు ఇదే మాట ఇంగ్లీషులో కాష్యూ అయ్యింది. జీడి మామిడి కాయను కాష్యూ యాపిల్ అంటారు. జీడి మామిడికి బ్రెజిల్ పుట్టిల్లని, పోర్చుగీసులు దీన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారనీ వృక్ష చరిత్రవేత్తలు చెప్తారు.*

*మామిడి సొన విషపూరిత౦. ఉరుషియోల్ అనే విషరసాయనం (రెజిన్) మామిడి సొన, మామిడి తొక్క, మామిడి ఆకులు, మామిడి జిగురులతో పాటు, జీడిగింజల పైపొరలో కూడా ఉంటుంది కాబట్టి, వాటిని తొలగించి జీడి గుళ్ళు, జీడి పప్పు అమ్ముతారు.  జీడి పప్పులో ప్రొటీన్లు, విటమిన్లు, రాగి, ఇనుము, మెగ్నీషియం, జింకు లాంటి ఖనిజాలతోపాటు గుండెకు మంచి చేసే కొవ్వు ఆమ్లాలు (monounsaturated-fatty acids) అధికంగా ఉన్నాయి. అన్ని వయసుల వారికీ మేలు చేస్తాయి. అతిగా తింటే హాని చేస్తాయి.*

*మామిడి పంటను తెలుగు వారే కాపాడుకోవాలి. కృష్ణా, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో వివిధ రకాల మామిళ్ళు పండుతున్నాయి. తెలుగు నేలమీద వ్యవసాయం పట్ల అశ్రద్ధ పెరుగుతూ రావట౦తో మామిడి తోటల విస్తీర్ణ౦ ఏటేటా తగ్గిపోతూ వస్తో౦దని గణా౦కాలు చెప్తున్నాయి. దిగుబడి అంతంత మాత్రం అవుతోంది. పండుని పాతిక రూపాయలకు అమ్ముతున్నారు. సామాన్యుడికి ‘అందని మామిడి”  అయ్యింది పరిస్థితి. మామిడి పండుని కార్బయిడ్ వేసి కృత్రిమంగా పండు అయ్యేలా చేయటం వలన ఆ పండు విష తుల్యం అవుతోంది. దానిలోని మాధుర్యాన్ని మనం కోల్పోతున్నాం. కార్బయిడ్ తో పండించే ప్రక్రియ మీద ఉన్న నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తేనే , ఆరోగ్యదాయకమైన మామిడి అందేలా గట్టి చర్యలు అవసరం.*

No comments:

Post a Comment