Thursday, April 24, 2025

 కథ పేరు...

*ఒక్కసారి*ఆలోచించండి* !

*******************
"నమస్కారం సార్!"
తలెత్తి చూసాను. ఎదురుగా ఓ యువజంట.
"సార్! విడాకులుకు అప్ప్లై చేయాలని వచ్చాం. మీరు లాయర్ రావుగారే కదా!" 
నాకేసి చూస్తూ అడిగాడతను. 
చూస్తే చూడముచ్చటగా ఉన్నారనిపించింది.
"యస్! లాయర్ రావును నేనే. బై ది బై ఫ్యామిలీ కౌన్సిలర్ ని కూడా "

అంటూ 
వచ్చిన ఆ ఇద్దరినీ తేరిపారా చూశాను. 
ఇద్దరి వయసూ దాదాపు  ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య ఉండవచ్చేమో ?
ఆమె  ఎదురుగా కనిపిస్తున్న    గదిలోని గోడలను చూస్తోంది. అతను నాకేసి చూస్తున్నాడు.
నేను ఇద్దరినీ పరిశీలిస్తూ "ముందు కూర్చోండి !"అంటూ నా టేబుల్ కు ఎదురుగా ఉన్న కుర్చీలను చూపించాను.
"తన పక్కన కూర్చోను!" అంటూ అతను కుర్చీని కొంచెం దూరంగా జరిపి కూర్చున్నాడు.
"నాకు మాత్రం ఇష్టమా!" అంటూ ఆమె కూడా కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది.
ఇద్దరూ కోపంగానే ఉన్నారు.
సమానంగానే తగవు లాడుకుంటున్నారని అర్ధమైంది.
"అబ్బాయ్ !నీ పేరు?" అన్నాను.
"సుధీర్ సార్!" అన్నాడు.
"అమ్మాయి! మరి నీ పేరు ?"
"సరళ !సార్."
"పేర్లు కలిశాయి. చూస్తుంటే వయసు దగ్గరగానే కుదిరినట్లుంది. ఇంక దేనికి విడాకులు ?" ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.
"మనసులు కలవలేదు సార్!" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"మీది పెద్దలు కుదిర్చిన వివాహమా ?"
"కాదు ...లవ్ మ్యారేజ్ సార్!" సుధీర్ అన్నాడు.
"ప్రేమికులు దంపతులయ్యారు. కానీ దంపతులయ్యాకా ప్రేమ కొరవడిందా ?"
నా ప్రశ్నతో ఇద్దరూ నాకేసి విచిత్రంగా చూశారు.
"పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మనసులు కలిస్తే చాలు. ఇక వేరే కారణంతో పని లేదు. కానీ విడిపోవడానికి బలమైన కారణం ఉండాలి. ప్రేమించుకున్నప్పుడు కలిసిన మనసులు పెళ్లయ్యాక ఏమయ్యాయి ? సరే..ఇప్పుడు చెప్పండి. విడాకులు ఎందుకు కావాలంటున్నారు ?"
నేను సూటిగా అడగడంతో వాళ్లిద్దరూ ఒకేసారి...ఒకరి నొకరు వేలెత్తి చూపించు కుంటూ..."తనకు ఇగో, సార్ !"అన్నారు.
నాకు నవ్వొచ్చింది.
"ఎందుకు సార్ నవ్వారు ?" ఒక్కసారిగా ఇద్దరూ  నన్నడిగారు.
"ఏం లేదు. కలిసి ఉండలేమంటున్నారు. కానీ కలసి  సమాధానం ఒకటే చెప్పే సరికి నవ్వకుండా ఉండలేకపోయాను.
లేడీస్ ఫస్ట్ అంటారు. సరళ ముందు చెబుతుంది. సుధీర్ నువ్వు మాత్రం మధ్యలో అడ్డు రాకూడదు !" అంటూ సరళ వైపు  చెప్పమన్నట్టుగా చూశాను.
"ఆఫీసునుండి రాగానే హాల్లో సోఫాలో ఒరుగుతూ తను టి.వి.ముందు దర్జాగా కూర్చుంటాడు. నేను మాత్రం కిచెన్ రూమ్ లోకి వెళ్లి చెమటలు కార్చుకుంటూ వండి పెట్టాలి..
నేను కాఫీ కలిపిస్తే అతను హ్యాపీ గా సిప్ చేస్తాడు. ఖాళీ కప్పు కూడా సింక్ లో పడేయడు.
అటు ఆఫీసులో....ఇటు ఇంట్లో పని తప్పడం లేదు.
సుధీర్ తో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. కనీసం నాతో సమానంగా అతను పని చేయడా ?
ఈ కంజెస్టెడ్ జీవితం నాకు వద్దు. నాకూ చదువుంది. ఉద్యోగం ఉంది. అందం ఉంది. హోదా ఉంది. అన్నీ ఉండి కూడా పాతకాలపు ఇల్లాలుకు మల్లె ఉండాల్సిన ఖర్మ నాకేంటి ? నా పేరెంట్స్ 'నీ వెనుక  మేమున్నాం' అన్నారు. నో వే సార్.. ఐ వాంట్ డైవర్స్"
గుక్క తిప్పుకోకుండా మనసులో మాటలన్నీ ఏకరువు పెట్టింది.
"ఓకే! సరళ..సుధీర్! ఇప్పుడు నువ్వేమంటావ్?" అంటూ సుధీర్ వైపు చూశాను.
"సార్! తను నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అహంకారం. అందుకే నన్ను ఇంటి చాకిరీ పంచుకో మంటుంది. నేను మగాన్ని ...సింహంలా బతికాను. దర్జాగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తే  తప్పేంటి ? నాకంటే ఎక్కువ సంపాదిస్తోందని పనిలో ఇంటిపనిలో వాటా వేస్తే ఎలా?ఇలా అయితే రేపు కన్సీవ్ అయ్యాకా పదిలో సగం ఐదు నెలలు నన్ను మోయమంటుంది కూడా. ఎవరు చేసేపని వాళ్ళు చెయ్యాలి.
సమ విభజన కోసం సైన్స్ కే విరుద్ధంగా మాట్లాడుతుంది. అన్ని పనులూ చేస్తే ఆడంగి వాడంటారు..ఎప్పుడైనా పొరపాటున కాఫీ కలిపితే ఊరుకుంటారా ?బావుందంటారు. కిచెన్ రూమ్ లో వాటా పెడతారు. నువ్వు కూరలు తరుగు. నేను వంట చేస్తానంటారు. నువ్వు బియ్యం కడుగు. నేను కుక్కర్ పెడతానంటారు.
"మగాడివి, మహారాజులా ఉండు. భార్యకు బానిస కాకు" అని నా పేరెంట్స్ పెళ్లికి ముందే  చెప్పారు.
నాకు సరళకు సరిపడలేదు సార్! ఐ టూ వాంట్ డైవర్స్. సుధీర్ కూడా అంతే గట్టిగా చెప్పాడు.
ఇద్దరూ ఒకరికేసి ఒకరు కోపంగా చూసుకున్నారు.
"బిడ్డను కనడానికి  సర్రోగసి సిస్టం ఉంది తెలుసుకో" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"చూసారా సార్! అంటే తను కనలేనని ముందే షరతుగా చెప్పేస్తోంది. అమ్మ కావడం కన్నా, అందంపై మోజే మిన్న సార్ తనకూ. నాకు వద్దు సార్!"
సుధీర్ అన్నాడు ఆవేశంగా.
"ఏయ్! మిస్టర్! నేను మార్గం చెప్పాను. కానీ ఆ మార్గంలో వెడతానని అనలేదే.
మాటలను సరిగ్గా అర్ధం చేసుకోని మొండివానితో నేను వేగలేను సార్! నాకు అతనితో 
విడాకులు ఇప్పించండి. ప్లీజ్" సరళ బతిమాలే ధోరణిలో నా వైపు చూస్తూ చేతులెత్తింది.
"ఉష్ ...గొడవలు పెట్టుకునే వచ్చారు. మళ్లీ ఇక్కడ కూడా గొడవలా ?..మీరు సైలెంటుగా ఉంటేనే మాట్లాడుతా. నాకు టైం లేదు. మరో కేసు బయట సిద్ధంగా ఉంది. నా మాట వింటారా ? లేక వెళ్లిపోతారా ?" నేను గట్టిగా అడగడంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగారు.
తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది.
ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నేను అందుకున్నాను.
"చూడండీ! మీరిద్దరూ మాట్లాడారు. 
నేను విన్నాను. ఫ్యామిలీ కౌన్సిలర్ ని కదా. ముందు నా మాట కూడా మీరు వినాలి. 
ఆ పై మీ అభిప్రాయం. సరేనా!" అంటూ ఇద్దరికేసి చూశాను.
వాళ్ళు మళ్లీ ఒక్కటిగా "ఒకే సార్!" అన్నారు.
ఈసారి పైకి నవ్వు కనబడకుండా ...లోపల నవ్వుకున్నాను.
"అమ్మానాన్నా, తోబుట్టువులూ గాడ్స్ గిఫ్ట్...ఎలా ఉన్నా ఒప్పుకుంటాం. జీవితాంతం వారితో బావుంటాం. బాగానే చూస్తాం. కానీ భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి
చిన్న కారణానికే...అంటే  కుక్కర్ పొయ్యిమీద పెట్టలేదని, అడిగిన డిష్ చేయ లేదని, కూల్ డ్రింక్ తేలేదని, నేనంటే ప్రేమే లేదని, ఇలా సిల్లీ పాయింట్స్ నే సీరియస్ గా తీసుకుంటున్నారు. నచ్చలేదని జీవిత భాగస్వామిని వదులు కోవడానికి సిద్ధపడి పోతున్నారు..."
"సార్, అదీ..."సుధీర్ ఏదో చెప్పబోయాడు.
"ప్లీజ్...లెట్ మి టెల్ యూ" అనగానే చెప్పమన్నట్టుగా  మౌనం వహించాడు.
"అటుగాని, ఇటుగానీ, ఒకప్పుడు నచ్చచెప్పి కాపురానికి పంపించే పేరెంట్స్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.
అగ్ని కి ఆజ్యం పోస్తున్నట్లుగా 'విడిపోయినా నీకేం పర్వాలేదంటూ' భరోసా ఇస్తున్నారు.
అయినా వస్తువును సృష్టించ డానికి కష్టపడాలి గానీ, నాశనం చేయడం ఎంతసేపు ?నేలకేసి గట్టిగా కొట్టినంతసేపు పట్టదు.
అవునా ? కాదా ?" ఇద్దరినీ అడిగాను.
వాళ్లిద్దరూ బదులు ఇవ్వలేదు. నా మాటలు వింటున్నారని పించింది. ఆలోచనలో పడుతున్నారని అర్థమయ్యింది.
ఇదే సరైన సమయం అని భావించాను.
"ఆమెకు ఒంట్లో బాగో లేకపోతే కూర చేయాలా ? కర్రీ పాయింట్ నించి తెప్పించడానికి వర్రీ ఎందుకు ? అతనికి ఒంట్లో నలతగా ఉన్ననాడు ఈరోజు శనివారం...షికారుకు రా' అని పిలవడం దేనికి ? ఒక శనివారం పోతే, మరో  శనివారం రాదా? ఆరోగ్యమే  మహాభాగ్యం అని గుర్తించాలి కదా!..గొడవలు తవ్వుకుంటే ఇద్దరి మధ్య  పూడ్చలేని గొయ్యి మిగులుతుంది. కానీ సర్దుబాటు మొదలైతే సమాధానం దొరుకుతుంది. సఖ్యత పెరుగుతుంది. పరిష్కారం లభిస్తుంది. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన మొదలవుతుంది." అని ఆగి ఇద్దరికేసి చూసాను. మౌనంగా వింటున్నారు.
"కృష్ణ అని నా  ప్రాణ స్నేహితుడు, పెళ్ళైన కొత్తలో భార్యను బాగా చూసుకునే వాడు. భార్య ఎదురురానిదే బయటకు వెళ్లేవాడు కాదు. అయితే అతని వృత్తిపరమైన బాధ్యత, బాగా సంపాదించాలనే ఆత్రుతతో భార్యకు సమయం కేటాయించలేక పోయాడు. పోనుపోనూ డబ్బును ప్రధాన లక్ష్యం చేశాడు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. భార్య 'నన్ను భార్యగా చూడండి' అంటూ అభ్యర్ధించింది. కానీ కృష్ణ అందుకు సమయం లేదన్నాడు. మీరు నాకు సరి పడరంటూ, ఆమె కృష్ణనుండి విడాకులు తీసుకుంది.
కోల్పోయకా మనిషిని గుర్తుకు తెచ్చుకున్నట్లుగా, వెళ్ళిపోయాక కృష్ణకు భార్య విలువ తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె రెండో  జీవితం మొదలు పెట్టింది.
'సమయాన్ని సర్దుబాటు చేస్తే ఎంత బాగుండేదో ?' అని కృష్ణ బాధపడ్డాడు. కానీ ఆ బాధకు  ప్రయోజనం లేదు.
ఇతరుల పట్ల ఆకర్షణ, జీవిత భాగస్వామివద్ద నిరాదరణ, కారణాలు మొదట్లో చిన్నవిగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. గతంలోనూ ఇవి ఉన్నాయి.కానీ కుటుంబంలో పెద్దలు సర్ది చెప్పేవారు. విడాకుల వరకూ వెళ్లకుండా తిరిగి కలిపేవారు. ఇప్పుడు వాళ్ళూ వెనకేసు కొస్తున్నారు. గుమ్మానికి వాడిపోయిన మామిడాకులను తీసేసినంత సింపుల్ గా విడాకులను తీసుకోమంటున్నారు. పేరెంట్స్ సర్దిచెబితే.. కౌన్సిలర్ అవసరం దేనికి ?
ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరంటే మరొకరికి గౌరవం, సహకార భావన ఈ నాలుగూ దాంపత్యానికి పునాదులు. బీటలు వారితే వారిమధ్య సంబంధం సమాధి అవుతుంది. ఏ కాలంలోనైనా దాంపత్యానికి ప్రధాన సూత్రాలు రెండే రెండు. ఒకటి అర్ధం చేసుకోవడం. రెండు సర్దుకు పోవడం. సంపాదన కంటే సమయం గొప్పది. ఆ సమయాన్ని భార్యాభర్తలు కలసి సర్దుబాటు చేసుకుంటే అది  ర"సమయం" అవుతుంది. లేకపోతే విషమయానికి దారి తీస్తుంది.
విడిపోదాం, విడాకులు తీసుకుందాం అని వచ్చారు.అప్పుడు  ఆవేశం తప్ప ఆలోచన ఉండదు.
ఒక్కరోజు "కలిసుందాం" అని అనుకోండి. సర్దుబాటు మొదలవుతుంది. ఆలోచన ఆచరణ అవుతుంది.
అడవిలో పుట్టిన కవ్వం మనింటికి వస్తుంది. పాలతో బంధం ఏర్పర్చుకుంటుంది. సున్నితమైన వెన్నను ఇస్తుంది.ప్రాణం లేని వస్తువులే  ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రేమనే ప్రాణంగా చేసుకుని ఒక్కటయ్యారు.
ఒక్కసారి ఆలోచించండి ! 
విడిపోవడానికి కాదు, కలిసుండటానికి.
అప్పుడు రండి. మీరు కాదూ,  కూడదంటే  విడాకులు  ఇప్పించడం పెద్ద పని కాదు. నిర్ణయం మీదే. ఇప్పుడు దయజేయండి" అన్నాను.
నా మాట విన్నట్టుగా వాళ్ళు లేచారు.
"వస్తాం సార్!" అంటూ లేచారు.
"ఆవేశంతోనా ? 
ఆలోచనతోనా ? " అన్నాను నవ్వుతూ.
"ఆచరణతో సర్!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
ఈసారి "వెళ్లండి, కానీ రావద్దు" పైకి నవ్వుతూ అనేసాను.

ముందుకు వెడుతున్న సుధీర్ ఒక్కసారిగా ఆగి నా వైపు చూశాడు. 'ఎందుకు ?' అన్నట్లుగా చూసాను ?
"మాలో మార్పుకోసం ఎన్నో చెప్పారు. ఆలోచించుకోమంటూ సలహా ఇచ్చారు. మరి ప్రాణ స్నేహితుడు కృష్ణ విషయంలో మీరు ప్రయత్నం ఎందుకు చేయలేక పోయారు సార్ ?" అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ 
"నా అసలు పేరు కృష్ణా రావు. కానీ నన్ను అందరూ "రావు" అనే పిలుస్తారు!" అన్నాను.

"సారీ, సార్!" అంటూ సుధీర్ ముందుకు కదిలాడు. సరళ అతన్ని అనుసరించింది.
****************
అయిపోయింది
********
తెలుగుతల్లి ...కెనడా, అంతర్జాల మాస పత్రిక వారు, 2024 లో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఏప్రిల్ 2025, తెలుగుతల్లి కెనడా, మాస పత్రికలో ప్రచురితమైన కథ.
********
రచయిత.. కె.వి.లక్ష్మణరావు
మానేపల్లి

No comments:

Post a Comment