*దుఃఖము...!*
*'జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం'...!*
మానవ జీవితం అంతా దోష భూయిష్టం, దుఃఖ భూయిష్టం, అప్పుడప్పుడు కొన్ని సుఖాలున్నా దుఃఖాలు మాత్రం తప్పవు.
ఇలా దుఃఖాలతో కూడినదే ఈ మానవ జన్మ అని తెలిస్తే దీనిపై వైరాగ్యం కలుగుతుంది, ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది...
జన్మ రాహిత్యానికి ప్రయత్నించాలి అనిపిస్తుంది , కనుక ఈ జన్మలోని దుఃఖ దోషాలను నిశితంగా పరిశీలించాలి...
‘ప్రపంచం దుఃఖమయం, దేహం రోగమయం’ అని పెద్దలు చెబుతారు.
‘అనిత్యమసుఖం లోకం’ అని గీతాచార్యుడే అన్నాడు.
‘విద్ధి వ్యాద్యభి మానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం’ అని భజగోవిందంలో శంకరాచార్యులు వారన్నారు.
వ్యాధులతోను, అభిమానంతోను కూడి దుఃఖాల చేత సత మతమైపోతున్నది ఈ జన్మ అని.
పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడూ ఏడుస్తాడు, మధ్యలో రోగాలొస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు.
ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం...
*1) జన్మదుఃఖం...!!*
ఇది ఎలాంటిదో గర్భోపనిషత్ చెబుతున్నది.
తలచుకొంటే సిగ్గుతో చచ్చిపోవాలి.
సిగ్గో యెగ్గో అది బహిరంగ రహస్యం, కోడి గ్రుడ్డు అంత గర్భకోశంలో 9 నెలల నివాసం.
అక్కడి క్రిముల చేత పీడించబడటం, జఠరాగ్ని చేత తపించి పోవటం, తల్లి ఆహార విహారాల వల్ల అలమటించి పోవటం, మావి చేత బిగించబడి తలక్రిందులుగా ఉండటం, పూర్వ జన్మల స్మృతితో విపరీతంగా దుఃఖించటం, ప్రసూతి వాయువుల చేత త్రోయబడటం, బయట బడి మల మూత్రాలలో పెద్ద పురుగులాగా పొర్లాడటం.. ఇవన్నీ జన్మదుఃఖాలే.
*2) మృత్యుదుఃఖం...*
పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యుదుఃఖం.
ఈ దేహం మృత్యు దేవత సొత్తు.
పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు, హాటులతో చక్కగా పెంచి, ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్ తో పోషించిన ఈ బంగారం లాంటి శరీరానికి చివరి దశ ఏమిటో కళ్ళు మూసుకొని ఒక్కసారి భావనకు తెచ్చుకోండి.
మర్మస్థానాలు భేదించబడటం, అంగ సంధులు వికలమైపోవటం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకు రావటం, ప్రాణోత్ర్కమణ జరిగేటప్పుడు లక్ష తేళ్ళు ఒక్కసారిగా కుడితే కలిగేంత బాధ, వశం దప్పి మల మూత్రాలు విడిచి పెట్టటం, భరించ లేని యాతన. ఇవి.. మృత్యురోగాలు.
ఇంతేనా... !!!
ఇక మరణించ బోతున్నాను అని తెలియగానే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలు, భార్యాబిడ్డలు అంతా గుర్తుకు వస్తారు.
ఇంత సంపాదించి అన్నీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ, ఇదంతా మృత్యు బాధ...ఆర్.కే.భట్!
*సర్వేజనా సుఖినోభవంతు!*
No comments:
Post a Comment