Thursday, April 17, 2025

 అప్పగింతలు

రాధిక పెళ్లి కోసం ఎదురుచూసినన్ని రోజులు పట్టలేదు. రాధిక అంటే ఎవరు ముకుందరావు సత్యవతి ల ముద్దుల కూతురు. ముకుంద రావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్నత ఉద్యోగి. ఉన్న ఒక్క కూతుర్ని దూరంగా పంపించకుండా ఉన్నచోటే డిగ్రీ చదివించి బీఈడీ ట్రైనింగ్ చేయించి టీచరుగా స్థిరపరిచాడు. ఆడవాళ్ళకి టీచర్ ఉద్యోగం ఉంటే సౌకర్యంగా ఉంటుందని అంతేకాకుండా పుట్టిన పిల్లలకి టీచర్ తల్లి మంచిగా తీర్చిదిద్దుతుందని ముకుంద రావు గారి ఉద్దేశం. ఎందుకంటే తన ఆఫీసులో పనిచేసే ఆడపిల్లల పరిస్థితి చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

  ఉదయం నుంచి ఒకటే హడావిడి. వచ్చే బంధువులు వెళ్లి పోయే బంధువులు మర్యాదలు భోజనాలు పెళ్లి తంతులు ఆశీర్వాదాలు ఇలా ఉదయం నుంచి ఎక్కడ ఖాళీ లేదు ముకుందరావు దంపతులకు. పంతులుగారు తంతులన్ని పూర్తి చేసి"  అమ్మ సత్యవతమ్మ గారు ఈ పెళ్లి కొడుకుకి పెళ్లి కుమార్తెకు కాస్త భోజనం పెట్టండి. ఆ తర్వాత అప్పగింతలు తర్వాత విడిది గృహ ప్రవేశం చేయించి వెళ్ళిపోతాను. నేను కూడా నాలుగు మెతుకులు తిని వస్తానంటూ శాస్త్రి గారు చేయవలసిన పని అప్పజెప్పి డైనింగ్ హాల్ లోకి వెళ్లిపోయారు.

 అంతవరకు ఆనందంగా ఉన్న ఉత్సాహంగా ఉన్న ఆ దంపతులకు ఒక్కసారి నీరసం వచ్చే సింది. ఒక్కసారి ఏదో తెలియని భయం పట్టుకుంది. పెళ్లిలో అన్ని తంతులు సాంప్రదాయాలు ఉత్సాహాన్ని ఇచ్చేవే గాని ఈ ఒక్కటి మాత్రం ఏడిపిస్తుంది 

ఈరోజుల్లో మగ పిల్లలకి కానీ ఆడపిల్లలుకి  కానీ పెళ్లిళ్లు కుదరడం చాలా అదృష్టం. అమ్మాయి బాగు లేదని ,జాతకాలు బాగు లేదని ,చదువు బాగోలేదని  తగినంత ఎత్తు లేదని, లావుగా ఉందని ఇలా అనేక రకాలైన వంకలు. అన్ని బాగుంటే సంబంధం నచ్చిందని మగ పెళ్లి వారి ఫోన్ చేస్తే తల్లిదండ్రులకు ఎక్కడ లేని ఆనంద o. అంతవరకు స్తబ్దుగా ఉన్న జీవితంలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. హుషారు పెరుగుతుంది . అక్కడి నుంచి నిశ్చితార్థం. ,పెళ్లి ముహూర్తాలు. ,పెళ్లి,పెళ్లి భోజనాలు ఇలా అన్ని మనసుకి ఉత్సాహం కలిగించేవే కానీ బాధ పెట్టే
 తంతులు కాదు. 

అప్పగింతలు అంటే సుమారు రెండు దశాబ్దాల పాటు ప్రేమగా పెంచుకున్న మన పిల్లని మంత్ర సహితంగా భర్తకి భర్త కుటుంబీకులకి అప్ప చెప్పడం అన్నమాట  అక్కడితో తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుంది. ఇన్నాళ్లు మన కళ్ళ ఎదురుగా నవ్వుతూ తిరుగుతూ ఉండే మనతో ఆడుతూ పాడుతూ ఉండే ఆడపిల్ల ఎప్పుడో చుట్టపు చూపుగా మన ఇంటికి వస్తుంది 

ఇక ముందు నుంచి.అతిధిలా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంది. ఇకముందు ఆ ఇంటి దీపమై వెలుగుతుంది. ముకుందరావుకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకో మరి .జీవితంలో కొన్ని అదృష్టాలు కొంతమందికే కలుగుతాయి.

అటువంటి వాటిలో   ఇంటిలో ఆడపిల్ల పుట్టడం.ఆడపిల్ల పుట్టిందంటే అందరూ భయపడతారు.దాన్ని పెంచి పెద్ద చేయడం ఒక బాధ్యతని,సంఘంలో గౌరవంగా మసిలే బుద్ధులు చెప్పడం మరొక బాధ్యతని,పెళ్లిళ్లు చేయాలని పేరంటాలు చేయాలని,అందుకే అది మన గుండెల మీద  కుంపటి అని
ఇలా రకరకాలుగా ఆడపిల్ల గురించి భయపడతారు.

నిజానికి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపం. కళ్ళకు కాటుక పెట్టుకుని ,కాళ్లకు గజ్జెలు కట్టుకుని ,నుదుట తిలకం దిద్దుకుని, చేతులకు గాజులు ,పట్టుపరికిణి పట్టుకుని ఇల్లంతా కలయ తిరుగుతుంటే  లక్ష్మీ స్వరూపమే కనపడుతుంది.

అసలు ఆడపిల్ల పుడితేనే తండ్రికి బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుంది.  కన్యాదాన ఫలితంగా ముందు తరాలు తరిస్తాయి.
ఆడపెళ్లి వారు అయితేనే  అతిధిని ఎలా గౌరవించాలి? అనే విషయం , ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. అందుకనేమో పెళ్లి చూసి చూడు! ఇల్లు కట్టు చూడు !అనే సామెత వచ్చింది

నిజానికి ఆడ మగ ఒక ప్రకృతి స్వరూపమైన తేడాయే కానీ
ఈ రోజుల్లో ఇద్దరకి తేడా ఏమీ లేదు. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించాలి. పెళ్లిళ్లు చేయాలి పేరంటాలు చేయాలి. ఇంకా పెద్ద తేడా ఏముంది. పెళ్లయిన తర్వాత  అక్కడ ఉండే  పిల్ల అవుతుంది. అదొక్కటే. ఆ వంశానికి మూల స్తంభం అవుతుంది.
అన్నీ మారిపోతాయి. కానీ  కనిపెంచినతల్లి తండ్రి పేర్లు ఎవరూ మార్చలేరు

 అప్పటివరకు నాన్న గుండెల మీద ఆడుకున్న ఆ చంటి దాన్ని పెళ్లి అనే  తాయిలం  చూపించి అక్కడికి  పంపుతాము. అంతవరకు మన గుండెల్లో ఉన్న ఆ బొమ్మ వేరొకరు గుండెల్లో అందాల బొమ్మగా మారిపోతుంది.మన ఇంట్లో మనం చందన బొమ్మతో ఆడుకుంటూ ఉంటాం.. ఆ వయ్యారిభామ మళ్ళీ మన ఇంటికి  వచ్చే పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవసాన దశలో కూడా మన గుండె ఆగిపోకుండా కొట్టుకుంటూ ఉంటుంది.
ఆఖరి చూపు అమ్మాయి కోసం. అమ్మాయి వచ్చింది చూడు! అంటారు ఎవరో .దాంతో మన శ్వాస ఆగిపోతుంది. ఇదీ ఆడపిల్ల అంటే నాన్న గుండెల్లో ఉన్న స్థానం.

ఆడపిల్లలంటే పుట్టింటి మెట్టినింటి గౌరవం నిలిపే ఒక వారధి.
పలానా ఇంటి ఆడపడుచు అని, పలానా ఇంటివారి కోడలని ప్రతి ఆడపిల్లకి రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి. నాన్నంటే ఆడపిల్లకి దాసుడు. ఆడపిల్ల అంటే నాన్న  కూచి.

చిన్నప్పుడు అల్లరి చేసిన ఆడపిల్లను మటుకు గారంగా మందలిస్తాడుకోరినవన్నీ ఇస్తాడు .కోరకుండానే కోరికలు తీరుస్తాడు. అల్లరి చేస్తుంటే చంకనెత్తుకుని ముద్దాడుతాడు. ఒళ్ళు వెచ్చగా ఉంటే తల్లడిల్లిపోతాడు. తన కంఠంలో ప్రాణం  ఉన్నంతవరకు కంటికిరెప్పలాకాచుకుంటాడు.

ఆడపిల్లలోతనఅమ్మనిచూసుకుంటాడు. అమ్మా అని  పిలుచుకుంటాడు.అమ్మ కంటే నాన్న దగ్గర చనువు ఎక్కువ. నాన్నను ఆప్యాయంగా మందలిస్తుంది. నాన్నవస్తువులు ధైర్యంగా తీసుకుంటుంది.చంక ఎక్కి అవి ఇవి కావలసినవి కొనిపించుకుంటుంది. అమ్మకు కావలసివి నాన్నకు రికమెండ్ చేస్తుంది ఆడపిల్ల.

 ఇది ఆడపిల్లలకు ఉండే నైపుణ్యం. అన్నయ్య మీద చాడీలు చెప్పి నాన్న చేత అన్నయ్యని కొట్టిస్తుంది. అన్నయ్యని తిడుతుంటే నాన్నకి అడ్డుపడుతుంది. అమ్మ పెట్టిన తాయిలం కొరికి  సగం అన్నయ్య కి ఇస్తుంది. ఎందుకంటే ఆడజన్మంటే త్యాగం. 

ఆడపిల్ల పెద్ద  ఆరిందాలా అమ్మని అనుకరిస్తుంది. పెద్దక్క లాగా అన్నదమ్ములను  అనునయిస్తుంది. నాన్న గుండెలో నిదు రించి
గుండె బరువు తగ్గిస్తుంది. ఆడపిల్లంటే ఇంటిలో ఉన్న అమ్మకి ప్రతిరూపమే కదా.

అమ్మతనంతో తరాలను తరింప చేస్తుంది. కమ్మగా వండిపెట్టి
అన్నపూర్ణ దేవిని మరిపిస్తుంది. నిశి రాత్రిలో చందమామ వలే మగనికి  వెలుగు చూపి మగని మనసు దోచుకుంటుంది.
.
ఆడపిల్లలంటే ఎందుకు అంత ప్రత్యేక అభిమానం అంటే అది మన వదిలి  అత్తవారింటికి వెళ్ళిపోతుందనే బెంగ బాధ పుట్టినప్పటినుంచి తండ్రి గుండెల్లో ఉంటుంది.  
మంచి వరుడిని చూసి వివాహం అంగరంగ వైభవంగా చేసిన  బాధ్యత తీరిపోయిందని ఆనందించిన ఏదో ఒక తీయని బాధ ఎప్పుడు మనసులోనే ఉంటుంది నాన్నకి. మంగళసూత్రధారణ కాగానే తన ప్రాణం ఎవరో తీసుకుపోతున్నట్లు అనిపించిన అంతకంటే ఆనందం కూడా కలుగుతుంది. 

భర్తతో కలిసి ఏడు అడుగులు నడుస్తుంటే చిన్నప్పుడు తన వేలుపట్టుకునిఅడుగులునేర్చుకొనితనతోదొంగపోలీస్ఆటాడుకున్న,దాగుడుమూతలు ఆడుకున్న క్షణాలన్నీ గుర్తుకొచ్చి ఆ క్షణం తిరిగి రాదనే బాధ కలుగుతూనే ఉంటుంది. తప్పు చేసినా,ఒప్పు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకోండని  ఆ పిల్ల చెయ్యి అత్తవారికి  అందించినప్పుడు  అంతవరకు దాచుకున్న సముద్రం పొంగిపోతుంది తండ్రికి.

ఒక మంచి తోడు దొరికిందని నవ్వుతూ అల్లుడు అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తున్నప్పుడు  ఇంతవరకే మన బాధ్యత అని సరిపెట్టుకుంటాడు.

పెళ్లి  అయ్యేంతవరకు ఒక బాధ . పెళ్లయిన తర్వాత తాళి కట్టినవాడు మనసున్న మహారాజా  కాదా అని ఆందోళన పడుతుంటాడు. అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల మొహంలో వెలుగు కోసం వెతుకుతాడు. ఆ వెలుగు దీపావళిలా ఉంటే ఆనంద పడిపోతాడు. నిరంతరం మతాబులా వెలగాలని చేయని ప్రార్థన అంటూ ఉండదు.

ఆ ఇంటిలో అడుగుపెట్టిన పిల్ల భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆ కుటుంబానికి వారసులను ఇస్తూ అత్తమామలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆర్థికంగా భర్తకి చేయూతనివ్వడానికి బయటకు వెళ్లి  ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ  ఆ భర్త జీవితంలో ఒక ముఖ్య పాత్ర వహించే స్త్రీని ఎల్లవేళలా మహారాణిలా చూసుకునే కుటుంబాలు ఎన్నో. కొన్ని కుటుంబాల్లో  స్త్రీ కన్నీళ్లు కారుస్తూనే ఉంది. వేధింపులకు గురి అవుతూనే ఉంది. ఆడపిల్లలంటే బాధ్యతని బాధ్యతలకు భయపడి ఆడపిల్లని ఆదిలోనే హత్య చేయడo ప్రకృతి  విరుద్ధమైన పని.సృష్టి ఆగిపోతుంది. ప్రపంచంలో కరుణ అనే మాటకు ఉండదు.త్యాగం అనే మాట వినపడదు

కరుణా సహనం ఓర్పు అనేవి ప్రతి స్త్రీకి అంతర్లీనంగా ఉండే
సద్గుణాలు. త్యాగం ఆమె ట్రేడ్ మార్క్. అంధుడైన భర్త కోసం తన కళ్ళకు కూడా గంతలు కట్టుకుని స్త్రీ అంటే త్యాగమూర్తి అని నిరూపించిన గాంధారి మహా పతివ్రత నేటికీ ఈనాటికి మరి ఎన్నటికీ మనకు ఆదర్శమూర్తి. 
కద నరంగంలో కత్తి దూసి భారత తొలి స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి అసువులు బాసిన ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వానికి ఎప్పటికీ ఆదర్శమే. 

ఏ రంగం చూసినా ఆమె వీరంగం చేస్తోంది. ఆడపిల్ల అంటే భయం ఎందుకు. చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడిక నేర్పిస్తే చాలు. పెళ్లి వారు వెతుక్కుంటూ మరీ వచ్చి పిల్లని అడిగి మరీ పెళ్లి చేసుకుంటా రు. ఇది ఈ రోజుల్లోని పరిస్థితి.

ఈరోజు ఆడపిల్లను వద్దని మనం అనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాధ అవుతుంది.. నేటి ఆడపిల్ల రేపటి  అమ్మ
అలా దిగాలుపడిన మనసుతో ఆలోచిస్తూ కావాల్సినవన్నీ పంతులుగారు చెప్పినట్లుగా సమకూర్చారు ముకుందరావు దంపతులు.
ఈలోగా పంతులుగారు భోజనం చేసి వచ్చి "అమ్మ సత్యవతమ్మ  గారు అమ్మాయిని మీ పక్కన కూర్చోబెట్టుకోండి అంటూ చెప్పాడు. ఎదురుగుండా పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి ఒకపళ్ళెంలో పాలు పోసి అప్పగింతల తంతు ప్రారంభించాడు పంతులుగారు. ముందుగా పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ,ఆడపడుచు ఆడపడుచు భర్త  ,మరిది ఇలా అందరి చేతుల్లో పెళ్లికూతురు చేతిని తాకించి తంతు పూర్తి చేశాడు మంత్ర సహితంగా. సన్నాయి వాళ్లు పాడే పాటలు పంతులుగారు చదివే మంత్రాల్లోని అర్థం అందరికీ కళ్ళు నీళ్లు తెప్పించేయి. ముకుందరావు పరిస్థితి  సరే సరి.

 ఇన్నాళ్లు ఆడపిల్ల పెళ్లి అవలేదని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు పిల్ల వెళ్ళిపోతుందని ఏడుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులతో పాటు ,వచ్చిన బంధువులు అందరూ తమ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి తమ పిల్లల గురించి బాధపడుతూ ఉన్నారు 

 ఆడపిల్లంటే అక్కడ ఉండేదని మన దగ్గరికి ఎప్పుడో వస్తుందని  అత్యవసర సమయంలో తల్లిదండ్రుల  కడసారి చూపు కూడా ఆ బిడ్డకు దక్కుతుందో లేదో అని  తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు . 

నిజమే కదా పెళ్లితో  కొత్త జీవితo ప్రారంభమవుతుంది. ఆ ఇంటిలో కొత్తగా పుడుతుంది. ఎవరిని ఏది అడగాలి అన్న బిడియం  ఏమనుకుంటారో అని భయం. కట్టుకున్నవాడు మనసున్న వాడు అయితే అన్నీ తానే కంటికి రెప్ప లా చూసుకుంటే గొడవే లేదు. ఆడపిల్లకు అత్తవారింట్లో కాపురం లాటరీ లాంటిది. అత్తవారిల్లు అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మంచి కోడలు దొరకడం అత్త వారికి కూడా అంతే. మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యాలను బట్టి జరుగుతుంటాయి. ముకుందరావు  పెళ్లి మండపం చుట్టూ చూసాడు. అందరూ కళ్ళు తుడుచుకుంటున్నారు. ఇంతవరకు ఆనందంతో వెలిగిపోయిన ముఖాలు మాడిపోయి ఉన్నాయి. 

ఏ బిడ్డ అయినా పుట్టినప్పుడు ఏడుస్తూనే పుడుతుంది. ఈ ఏడుపు బిడ్డ ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. మనం  కడుపున పుట్టిన ఆడబిడ్డను పెళ్లి చేసి అప్పగింతలు చేసేటప్పుడు ఏడుస్తూనే పంపుతాం. 

ఈ ఏడుపు ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన పిల్ల వెళ్ళిపోతుంది అనే బాధ తప్పితే ఇంకేం ఉంటుంది. అది ఆపుకున్నా ఆగదు. వరదలా ప్రవహిస్తుంది. బాధ తీరే వరకు కెరటాలు పొంగుతూనే ఉంటాయి తప్పితే ఎవరు ఓదార్చిన కళ్ళు మటుకు వర్షించడం ఆపవు.

 పైగా ఇప్పుడు సన్నాయి వా ళ్ళ పాట తప్పితే మామూలుగా పెళ్లిలో ఎవరూ  పాటలు పాడడం లేదు. ఒకప్పుడు పెళ్లిలో సందర్భానుసారం పాటలు పాడేవారుట. ఆ పాటల్లో ఎంతో హాస్యం నీతి  అత్తవారింట్లో పెళ్ళికూతురు మెలగవలసిన విధానం అన్ని చక్కగా పొందుపరిచి ఉండేవి

అంటే అప్పుడు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు కాబట్టి అంతగా చదువుకొని స్త్రీలు తన ఇల్లు వదిలి వేరొక ప్రదేశంలో ఒక వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో పాటల రూపంలో చెప్పేవారు. ఆధునిక కాలంలో స్త్రీలందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పెద్దగా వీటి అవసరం లేకపోయింది. ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం వీరికి తెలుసు. అందుకే ఆ సాంప్రదాయం ఇప్పుడు లేదు.

 ఇప్పుడు మంగళ హారతి పాటలు మటుకు పాడుతున్నారు. ఎవరైనా పాటలు పాడతారా అని అడిగారు పురోహితులు గారు. అంత ధైర్యం ఎవరూ చేయలేదు. పీటల  మీద లేచిన ముకుంద రావు గారు రాధిక ని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ అత్తారింటికి సాగనంపారు అందరి తల్లిదండ్రులాగే.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ9491792279

No comments:

Post a Comment