ధరిత్రి దినోత్సవం .
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
యూరప్ లో ముఖ్యమైన పక్షజాతిగా పేర్కొనబడే 'గ్రేట్ టిట్' పక్షులకు సంభవించే ప్రమాదాల గురించి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. మనిషి ప్రకృతి యెడల అనుచితంగా ప్రవర్తించటం వల్ల కలిగే దుష్ఫలితాలు ఇంతా అంతా కావు! నెదర్లాండ్స్ లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ'లో 'గ్రీన్ ల్యాండ్' అనే పరిశోధకుడు తన బృందంతో విస్తృతమైన పరిశోధనలు చేసి వాయు కాలుష్యం, ఆమ్ల వర్షాలు కలిసి, గ్రేట్ టిట్ పక్షుల జాతి పెరగటానికి ఎలా అవరోధంగా పరిణమిస్తోందో నిరూపించ గలిగాడు.
వాయు కాలుష్యం వలన యాసిడ్ రైన్స్ ఏర్పడటం మనం వింటున్న విషయమే. ఈ యాసిడ్ రైన్స్ కారణంగా గ్రేట్ టిట్ పక్షులు గుడ్లు పెట్టడంలోనూ, పొదగపడకుండా ఉండి పోవడంలోనూ గల మార్పులను ఆయన వివరించాడు. నెదర్ ల్యాండ్ అడవులలోని' బందర్ క్యాంప్' ప్రాంతంలో ఆయన పరిశోధనలు కావించాడు. ఆ ప్రాంతంలోని గ్రేట్ టిట్ పక్షులు పెట్టే గుడ్లు చాలా భాగం వరకు పగిలిపోతున్నాయట! అంతేకాదు, ఎక్కువ శాతం పొదగబడటం లేదట! 1984లో కేవలం 10 శాతం గుడ్లు పాడైపోతే 1988 నాటికి 40 శాతం వరకు గుడ్లు పాడైపోయి పిల్లలుగా తయారవడం లేదని ఈయన పరిశోధనలలో తేలింది.
ఆ ప్రాంతంలోని పక్షులు గుడ్లు నున్నగా ఉండక గరుకుగా ఉన్నట్లు, పెంకు భాగము దళసరిగా ఉండక పల్చబడిపోతున్నట్లు తేలింది. అలా పలుచనయిపోవటం మామూలు అయిపోయింది. అంతేకాదు తమ గుడ్లు బాగు లేవని గ్రహించిన ఆడ టిట్ పక్షులు తమ గూళ్ళను వదిలి వెళ్ళిపోతున్నట్టు కూడా పరిశోధనలలో వెల్లడైంది. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రజ్ఞులు బుర్ర కొట్టుకొని ఆలోచించగా, తల్లి పక్షులలో కాల్షియం శాతం తక్కువ అయిపోవడం వలన అవి పెట్టే గుడ్డు పెంకులు పగిలిపోతున్నాయి అని గ్రహించారు. తల్లి పక్షులలో క్యాల్షియం తగ్గిపోవటానికి కారణం ఆయా ప్రాంతాల నేలలో క్యాల్షియం శాతం బాగా తక్కువగా ఉండటమే. ఆ నేలల్లో ఉండే నత్తలను తినటం ద్వారా టిట్ పక్షులు బతుకుతాయి. సాధారణంగా నత్తలు తమ ఆహారంతో పాటు మన్ను, రాతి పదార్థాలు తినటం ద్వారా వాటిని చర్మం ద్వారా అన్ని వైపులకు పంపగలగటం వలన తమ గుల్లలు నిర్మించుకుంటాయి. అంటే నత్తలు సంచరించే ప్రాంతంలోని మట్టిలోని కాల్షియం వాటికి అందవలసి ఉంటుంది. అయితే ఆసిడ్ రెయిన్స్ వలన ఆ ప్రాంతాల్లోని కాల్షియం అంతా రసాయనికంగా మార్పు చెంది వృధా అయిపోతోంది. అందువల్ల నత్తలకు ఆ ప్రాంత భూముల్లో క్యాల్షియం అందటం లేదు. వాటి గుల్లల్లో కాల్షియం శాతం తగ్గిపోయి గుడ్లు గిడస బారిపోవటం జరుగుతోంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఒక పక్షి జాతి అంతరించిపోవడానికి పరోక్షంగా ఎలా హాని కలిగిస్తుందో వివరించడానికే.
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో మరింత అవగాహన కలిగించటమే దరిత్రీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 1962లో అమెరికాలో రాజకీయ వేత్త 'వేలార్డ్ నెల్సన్ 'కు వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రి దినోత్సవం.
మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం అవటం, చెట్లను నరికి వేయడం, శిలాజ ఇంధనాలను మరింతగా మండించడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులతో భూమిని వేడెక్కించడం, పక్షులు జంతుజాలం మొదలైనవాటిని విచక్షణారహితంగా వేటాడటంతో అవి నశింపుకావటం; మొదలైన పరిస్థితులను గమనించి అందరికీ ఈ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు నెల్సన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని ప్రకారం అప్పటి ప్రెసిడెంట్ కెనడీకి ఈ విషయం వివరించి చెప్పి , దీని మీద అవగాహన కల్పించే నిమిత్తం ఆయనను దేశమంతా పర్యటించమని విజ్ఞప్తి చేశాడు .కానీ కెనడీ పర్యటన సఫలీకృతం కాలేదు !అప్పటి ప్రజలు పెద్దగా వీటిని పట్టించుకోలేదు.
నెల్సన్ కి 1969 లో మరొక ఆలోచన వచ్చింది. మన వాతావరణంలో జరిగే మార్పులను, పర్యావరణం కలుషిత మవుతున్న వ్యవహారాన్ని ; అలా కలుషితం కాకుండా ఉండడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన వంతు మనమేం చేయాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజు అంటూ ఉంటే బాగుంటుందని అనుకొని, తన ఆలోచనలకు రూపకల్పన చేస్తూ ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకు ఈ ధరిత్రి దినోత్సవం గురించి వివరించాడు.
1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రి దినోత్సవం జరిగింది. ఆరోజు ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని రెండు కోట్ల మంది అమెరికన్ ప్రజలు నగర వీధుల్లోకి వచ్చి ప్రమాణాలు చేశారు. ఆ వీధి నిరసన భారీ సంచలనం సృష్టించింది. దావానలం లా వ్యాపించిన ఈ ఉద్యమం, వందలాది నగరాలను క్రమంగా ఉద్యమ బాట పట్టించాయి! ప్రపంచంలోని అతిపెద్ద నిరసనలలో ఒకటిగా ఈ ఉద్యమం నిలిచింది! ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ధరిత్రి దినోత్సవం ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాపితమైంది. ప్రజల్లో మరింత అవగాహన కలిగించేందుకు "ఎర్త్ డే నెట్వర్క్" అంటూ ఏర్పడింది.
20 25 ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్" మన శక్తి- మన గ్రహం ".ఈ థీమ్ మనమందరం పర్యావరణ సమస్యల నుండి మన గ్రహాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపు ఇచ్చింది.
20 25 ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే మనం చేసే ప్రతి చర్య అది ఎంత చిన్నదైనా సరే పర్యావరణం మరియు భూమిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గ్రహించడం! మన చర్యలకు మనమందరం సమిష్టిగా బాధ్యత వహించాలి !మన పృధివికి ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా సానుకూల చొరవ తీసుకొని పర్యావరణాన్ని రక్షించాలి.
ఈ ప్రకృతిలో ఒక క్రమం ఉంది. ఒక లయ ఉంది .ఒక తత్వం ఉంది. చైతన్యవంతమైన ఒక సమతుల్యత ఉంది. అది ఒక సంపూర్ణ వ్యవస్థ .ప్రకృతిని ఆరాధించటంలో గల కిటుకు ఇదే! ప్రకృతి ఎడల మనిషికి సంపూర్ణమైన గౌరవం చాలా అవసరం. ప్రాణికోటి అంతా ప్రకృతిలోని అంతర్భాగమే. మనిషి దురహంకారంతో ప్రవర్తించి తన అవసరాల నిమిత్తం, తాత్కాలిక సుఖాల నిమిత్తం; పక్షులను, జంతు జీవాల్ని వధించి ఆహారం ఏర్పాటు చేసుకోవడం, అధిక రీతిలో వృక్షాలు నరికి గృహోపకరణాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైన పనులు చేస్తే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితాలు ఘోరంగా ఉంటాయి! వెంటనే కనబడకపోయినా, మెల్లమెల్లగా అవి బయటపడతాయి! భావితరాల వారిని బాధిస్తాయి!
మన దేశంలో 15 వేల రకాల చెట్లు, 1400 రకాల జలచర భూచర జంతువులు, 1200 రకాల పక్షులు ఉన్నాయి. సుమారు 400 రకాల పాములు ఉన్నాయి. ఇందులో 250 రకాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 250 రకాల జంతువులు కూడా త్వరలోనే తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1900 లో 40 వేల వరకు పులులు మన దేశంలో ఉండేవి ప్రస్తుతం వాటి సంఖ్య 2000ల లోపుకు తగ్గిపోయింది.
అలాగే మొక్కలలో కూడా అరుదైన రకాలు మన దేశంలో ఉన్నాయి. అయితే వీటి ప్రాముఖ్యత తెలీక కొన్నింటిని రూపుమాపడం జరుగుతోంది .'లెగుమినస్' జాతి మొక్కలు పంట పొలాలకు చక్కని ఎరువుగా ఉపయోగపడతాయి.' లుబేలియా' మొక్కల నుండి లభించే సారంతో మందులు తయారవుతాయి. ఫాన్స్లో మొక్కల నుండి రక్తపోటును అదుపు చేసే మందులు తయారు చేస్తున్నారు. క్వీనైన్ మందు సింకోనాచెట్ల బెరడునుండి దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేలవేల రకాల ఉపయోగాలు ఔషధ రంగాల్లో మొక్కల ద్వారా మనకు దర్శనం ఇస్తాయి. అరుదైన మొక్కలకు జీవరాశులకు పశుపక్ష్యాదులకు స్థావరమైన అరణ్యాలను కాపాడుకోవడం ద్వారా పర్యావరణం చాలా మేర వరకు మనం మెరుగుపరచుకోవచ్చు.
మన ధరిత్రి ని రక్షించుకోవడం మన సమిష్టి బాధ్యత.
************
No comments:
Post a Comment