Tuesday, April 22, 2025

 *🔊AI: ఏఐ.. భయమేం వద్దు*

*🔶సహజ నైపుణ్యాలకు కృత్రిమ మేధ తోడైతే కొలువులు పదిలం*

*🍥ఈ డిజిటల్‌ యుగంలో మనం అడుగుపెడుతోన్న ప్రతిరంగంలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. జీవితంలోని ప్రతి రంగాన్ని తాకేస్తూ, ఉద్యోగాల స్వభావాన్నే మార్చేస్తుంది. వ్యాపార నిర్వహణ, ఆరోగ్యం, విద్య, మీడియా, కస్టమర్‌ సర్వీసెస్‌ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్‌.. పనిని వేగవంతం చేస్తోంది. ఈక్రమంలో కొంతమందికి అవకాశాలు కల్పిస్తున్నా.. మరికొంత మందికి ఉద్యోగ భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే 90శాతానికి పైగా కోడింగ్‌ ఉద్యోగాలు అంతమవుతాయని సాంకేతిక నిపుణులూ అంచనా వేస్తున్నారు. పరిశ్రమలు, కంపెనీలు ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడంతో పనుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఫలితంగా వ్యయభారం తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు లేఆఫ్‌లు, ఉద్యోగాల కోతలు చేపడుతున్నాయని అంటున్నారు. ఇటీవలే దిగ్గజ టెక్‌ కంపెనీలు సైతం వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి పరిణామాల్లో ఏఐ నుంచి మీ ఉద్యోగ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవడం ఎలా? నిపుణులు సూచిస్తోన్న మార్గాలను తెలుసుకుందాం.*

*మానవ కేంద్రీకృత నైపుణ్యాలు...*

*పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్, కరోనా ఇవన్నీ మానవ జీవితాలపై ప్రభావం చూపించాయి. ఇప్పుడు వంతు ఏఐది. అయితే మానవ సంబంధాలు, భావోద్వేగం, స్పష్టత, దయ, హాస్యం, భయం.. ఇవన్నీ ఏఐ నేర్చుకోలేని విషయాలు. మన జీవితాలకు విలువను జోడించే మానవీయ అంశాలు ఎప్పటికీ మారవు. వీటితో ముడిపడి ఉన్న అంశాల్లో మనిషి ప్రమేయం కచ్చితంగా ఉండాల్సిందే. క్రియేటివ్‌ థింకింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.. మానవులకే ప్రత్యేకమైన ఈ నైపుణ్యాలను నవ తరం ఉద్యోగులు మెరుగుపరుచుకోవాలి. కృత్రిమమేధ భర్తీ చేయలేని మానవ కేంద్రీకృత నైపుణ్యాలను పెంచుకోవాలి. నాయకత్వ లక్షణాలు, టీం వర్క్, ఎథికల్‌ డెసిషన్స్, నెట్‌వర్కింగ్, అడాప్టబిలిటీ వంటివి ఈ కోణంలోకే వస్తాయి. భవిష్యత్తులో ఏఐ అందరి జీవితాల్లోకి చొచ్చుకురావడం ఖాయం. ఈ తరుణంలో ఉద్యోగాల్లో ప్రగతి సాధించాలంటే రెండే మార్గాలున్నాయి. మొదటిది ఏఐ చేయలేని పనులను నేర్చుకోవడం.. రెండోది ఏఐతో పని చేయించే నైపుణ్యాలను సాధించడం.*

*సహానుభూతి, టీంవర్క్‌*

*ఏఐ చక్కగా గణాంకాలు విశ్లేషించగలదు. కానీ, మానవ సంబంధాలను నిర్మించలేదు. సహానుభూతి, టీమ్‌ వర్క్, కస్టమర్‌ కనెక్షన్‌ వంటి నైపుణ్యాలు మానవులకే ప్రత్యేకమైనవి. మీ విలువను పెంచే ఈ నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఉదాహరణకు విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధించగలదు. కానీ, టీచర్‌కు, విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధాన్ని అది నిర్మించలేదు.*

*ఎలా?*

*శ్రద్ధగా వినండి. దేన్నైనా స్పష్టంగా చెప్పగలిగే నైపుణ్యం. ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోవడం అలవర్చుకోవాలి..*

*సృజనాత్మకత*

*కొత్తగా ఆలోచించడం, సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపించే సామర్థ్యం మనుషులకే ఉంది.  సృజనాత్మకంగా ఆలోచించడం అలవర్చుకోండి.*
 
*ఎలా?*

*పుస్తకాలు చదవడం, విభిన్న రంగాల జ్ఞానాన్ని పొందడం. ఆర్ట్, మ్యూజిక్, రచన మొదలైన రంగాల్లో భాగస్వాములు కావడం.*

*డెసిషన్‌ మేకింగ్‌ నైపుణ్యాలు*

*ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ నిర్ణయాలు తీసుకుని, క్లిష్ట సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలు చాలా విలువైనవి. ఉద్యోగులు, అభ్యర్థులు ఈ అలవాట్లను పెంపొందించుకునేందుకు సాధన చేయాలి. మానవీయ అనుభవం కీలకమైందని గుర్తించి, సృజనాత్మకమైన పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం పెంచుకోవాలి.*

*ఎలా?*

*చిన్న చిన్న సమస్యలపై సొంత విశ్లేషణ రాసే అలవాటు చేసుకోండి. అనుభవజ్ఞుల సాయం తీసుకోవచ్చు.*

*ఎప్పటికప్పుడు పెంచుకోవడం ఇలా...*

*ఏఐ కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తుంది అన్నది నిజమే. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని, నైపుణ్యాలు ఉన్నవారికి విస్తృత అవకాశాలు ఉంటాయని  గ్రహించాలి. ఉదాహరణకు, బ్యాంకింగ్‌ రంగంలో ఏఐ చాట్‌బాట్స్‌తో కస్టమర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు తగ్గినప్పటికీ..ఏఐ మేనేజ్‌మెంట్, డేటా ఎనాలసిస్‌ వంటి కొత్త నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఏఐని శత్రువుగా కాకుండా..సహాయకుడిగా చూడాలి. ఈ సాంకేతిక మార్పు భయపడాల్సిన విషయం కాదని గ్రహించి, దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రతి ఉద్యోగికీ ఏఐపై కనీస అవగాహన అవసరం. ఏఐ ఎలా పనిచేస్తుంది? మీ రంగంలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాన్ని ఉపయోగించి, మీరు ఎంత మేరకు పనులను చేయగలరు? వంటి విషయాలు తెలిసి ఉండాలి. ఏఐతో కలిసి పనిచేసే దిశగా అడుగులు వేయడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇది సాధ్యమైనంత త్వరగా అలవర్చుకుంటే మీరు ఏరంగంలో ఉన్నా ఏఐకి పోటీగా నిలబడగలుగుతారు.*

*వారిని పరిశీలించండి*

*వివిధ రంగాల్లో నిపుణులైౖనవారు ఏఐని ఉపయోగించి, ఎలాంటి అద్భుతాలు సృష్టించగల్గుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వివిధ పరిశ్రమల్లో ఏఐ పెంచుతోన్న ఉత్పాదకతను లింక్డిన్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిశీలించండి. దాని నుంచి మీరు ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చో నోట్స్‌ తయారుచేసుకోండి.*

*కోర్సులు*

*ఆన్‌లైన్‌లో స్వల్పకాలిక ఏఐ కోర్సులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే విద్యార్థులు, ఇప్పటికే వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఏఐ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరముంది. ‘ఇంట్రడక్షన్‌ టు ఏఐ’ నుంచి మొదలుపెట్టి క్రమంగా ఏఐ వాడకాన్ని పెంచుకుంటూ వెళ్లండి.*

*ఏఐ టూల్స్‌ వాడకం*

*చాట్‌ జీపీటీ, క్యారెక్టర్‌.ఏఐ, గూగుల్‌ బార్డ్‌ వంటి చాట్‌బాట్‌లు, క్విల్‌బాట్, నొవెల్‌ ఏఐ వంటి ఏఐ రైటింగ్‌లు, క్యాప్‌కట్, మిడ్‌జర్నీ వంటి ఇమేజ్‌ జనరేటర్‌లు, హగ్గింగ్‌ఫేస్‌(డేటాసైన్స్‌), సివిట్‌ ఏఐ మొదలైన ఏఐటూల్స్‌ను వాడడంలో నైపుణ్యాన్ని సాధించండి. మీ రోజువారీ జీవితంలో ఈ యాప్స్‌ సాయం తీసుకోండి. వీటిని ఉపయోగిస్తూ మెయిల్‌లో సందేశాలు రాయడం వంటి చిన్న టాస్క్‌లను చేయండి. ఉద్యోగంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుంది.*

*ఏఐ సాంకేతిక రంగంలో వచ్చిన ముప్పు కాదు. అది మన పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే సాధనంగా గుర్తించాలి. మానవ మేధస్సు ఎప్పటికీ విలువైనది. నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా మనిషి విలువ మరింత పెరుగుతుంది. అప్పుడు ఉద్యోగ భద్రతపై ఎలాంటి బెంగ ఉండదు.*

No comments:

Post a Comment