*✍🏻 నేటి కథ✍️*
*మానవత్వం*
గోపవరంలో గోపయ్యకు పది గోవులు వున్నాయి. ఆ గోవులన్నిటిని తన రెండు ఎకరాల పొలంలో పోషించేవాడు. వాటిని చూసుకునే బాధ్యతను ఒక పిల్లవాడికి అప్పగించాడు. ఆ పిల్లవాడు గోవులను కన్నబిడ్డలవలే చూసుకునేవాడు. అప్పటి నుంచి పశువులు పాలు బాగా ఇచ్చేవి. పేదవాడైన గోపయ్యకు పాడిపంటలతో సంపద పెరిగింది. ఇది పక్క పొలంలో వున్న రాజయ్య గమనించసాగాడు. రాజయ్య బాగా ధనవంతుడు, ఆ ఊర్లో బాగా పేరొందిన మోతుబరి. తనే గొప్పగా బతకాలని భావించేవాడు. తన గురించి తప్ప ఇతరుల గురించి పొగిడితే ఓర్వలేదు. పగబట్టి పతనం చేసేవాడు. తన కళ్ల ఎదుటే గోపయ్య ధనవంతుడు కావటం, అతని పశువులు తన గోవులకన్నా అధికంగా పాలు ఇవ్వడం జీర్ణించుకోలేకపోయాడు. పతనం చేయాలని పన్నాగం పన్నాడు.
మరుసటి రోజు గోపయ్య గోవులు పిల్లవాడి ఆశ్రద్ధతో రాజయ్య పొలంలో పడ్డాయి. ఏపుగా పెరిగిన వరిపైరును మేశాయి. ఇది చూసిన రాజయ్య పగపట్టాడు. పెద్ద కర్ర తీసుకుని ఆవుకాళ్లపై బాదాడు. అది భయంతో దిక్కులు తిరుగుతూ తప్పించు కోవడానికి ప్రయత్నించినా పరిగెత్తించి బాదాడు. గోవుకాళ్లపై బాదడంతో కుప్పకూలింది. కాలు విరిగింది. పైకి లేవలేక కన్నీరు కార్చింది. రాజయ్యకు పగ తీరలేదు. 'నా పైరులో పడతావా?' అని హుంకరిస్తూ కడుపు మీద రెండు దెబ్బలు వబాది వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత గోపయ్యకు తన గోవు కనిపించకపోవడంతో చుట్టూ వెతికాడు. అది రాజయ్య పొలంలో కన్నీరు కార్చుతూ కనిపించడంతో ఆందోళనతో వెళ్లి అవాక్కయ్యాడు. కాళ్లు విరిగిపోవడంతో పైకి లేకలేకపోయింది. గోపయ్య ఇక చేసేదేమీ లేక వైద్యం అందించాడు. విరిగిన కాలుతోనే కుంటుతూ వచ్చి తన పశువుల పాకలో కూలబడింది. ఇదంతా రాజయ్య గోవులు గమనించసాగాయి. కట్లు తెంచుకుని వచ్చి గోపయ్య గోవువద్ద నిలబడ్డాయి. కళ్లనిండా సుడులు,పరామర్శించాయి. ఆరోజు నుంచి రాజయ్య ఆవులు పాలు ఇవ్వడం మానివేశాయి. దాన్ని చూసి మిగిలిన పశువులు కూడా కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని నెమరువేసుకుంటూ బాధతో పాలు ఇవ్వడం మానివేశాయి.
ఒక్కసారిగా పాలు ఇవ్వడం మానుకోవడంతో రాజయ్య 'పాల వ్యాపారం ఆగిపోయింది. దీనికి కారణం ఏమిటీ? గోపయ్య పాల వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుంటే నా పాల వ్యాపారానికి ఎదురుదెబ్బ తగిలింది ఏమిటా! అని ఆలోచించసాగాడు రాజయ్య. సరిగ్గా అప్పుడే రాజయ్య పశువు ఒకటి గోపయ్య ఆవు దగ్గరకు వెళ్లడం చూసి దాని వెనుకే వెళ్లాడు. తన గోవు గోపయ్య పశువు వద్ద నొల్చొని కన్నీరు పెట్టుకోవడం తన మనసును తీవ్రంగా కలచివేసింది. ఆన ఆగ్రహానికి గోపయ్య పశువు కాలు విరిగి పైకి లేవలేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. మానవత్వం మరిచి నోరులేని జీవాలను హింసించినం దుకు తన పాల వ్యాపారం దెబ్బతిని తగిన శాస్తి జరిగింది. గోపయ్య గోవుకు ఎదురైన బాధను చూసి నోరులేని తన గోవు ఓదార్చడం చూసి రాజయ్య మనసు చలించింది. మానవత్వం మరిచి క్రూరంగా హింసిం చినందుకు అది అనుభవిస్తున్న నరకాన్ని చూశాడు. అ పరిస్థితి తనకు ఎదురైతే ఊహించి భయాందోళనకు గురయ్యాడు. పశ్చాత్తాపంతో గోపయ్య వద్దకు వెళ్లి తను చేసిన పనికి క్షమించమని కోరాడు. వివేకంతో మానవత్వం విలువను తెలుసుకున్నాడు రాజయ్య.
*- బోగా పురుషోత్తం, తుంబూరు*
No comments:
Post a Comment