Monday, April 21, 2025

 *గోవింద నామ మహిమ.....* 

*'గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. వయసు, కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలేవీ లేకుండా అందరూ ‘నామసంకీర్తనం’గా దీన్ని జపించవచ్చు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేలనామాలు ఉన్నాయి. ‘నారాయణ’ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా, శరణు కోరేవారికి కొండంత అండగా, భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైన విష్ణునామం ‘గోవింద’ మాత్రమే. నిండు సభలో ద్రౌపది తనను రక్షించే వారెవరూ లేనివేళ ‘గోవిందా!’ అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించి, /రక్షణ పొందడమే దీనికి గొప్ప ఉదాహరణ.*

*‘మూన్నెఱుత్తుడైయ పేరాల్‌ కత్తిర బందుం అన్రే పరాంగతి కండు కొండాన్‌’. మూడక్షరాల గోవిందనామం చేతనే ‘క్షత్రబంధువు’ అనేఅతను ఏకంగా మోక్షాన్ని పొందాడు. ‘విప్రనారాయణులు’ (తొండరడిప్పొడి ఆళ్వార్లు) ‘తిరుమాలై’ అనే ద్రావిడ ప్రబంధంలో పేర్కొన్న ఆయన కథ ఆసక్తికరం. సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే ‘క్షత్రబంధువు’గా ప్రసిద్ధి పొందాడు. ఇతడు బాల్యం నుంచే హింసా ప్రవృత్తిని కలిగి మూగజీవాలను, చిన్నపిల్లలను చంపేవాడు. దీంతో ఇతణ్ణి మహారాజు ‘రాజ్య బహిష్కారం’ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపాడు. అక్కడకూడా ‘క్షత్రబంధువు’ మహర్షులను హింసిస్తూ, జంతువులను వధిస్తూ ఆఖరికి నరమాంసాన్నీ తినేవాడు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఓ సరస్సులోకి దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు. క్షత్రబంధువు దూరం నుంచే దీన్ని గమనించి వెంటనే ఆ సరస్సులోకి దూకి మునిని ఒడ్డుకు చేర్చాడు. స్పృహలోకి వచ్చేందుకు తగిన ఉపచారాలన్నీ చేశాడు. ఆ మునీశ్వరుడు యోగశక్తితో ‘క్షత్రబంధువు’ జన్మవృత్తాంతం, జీవనశైలి, స్వభావాలను తెలుసుకొని, తన ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు. మూడక్షరాల ‘గోవింద నామాన్ని పలుకమని’ ప్రబోధించాడు. తనకు అంత సమయం, ఆసక్తి లేవన్నాడు క్షత్రబంధువు. ‘నాయనా! నువు కేవలం తుమ్మినపుడో, దగ్గినప్పుడో ఈ గోవింద నామాన్ని పలికినా... చాలు’ అన్నాడు.*

*అంతేనా, అనుకొని, చివరికి రోజంతా అదే ధ్యాసతో, నిరంతర గోవింద నామస్మరణలో మునిగిపోయి, భగవదనుగ్రహాన్నే పొంది తరించాడు. జ్ఞానం, ఆచారం, విద్యావినయాలు, వంశప్రతిష్ఠ మొదలైనవే లేని గోపికల వద్దకు సర్వేశ్వరుడైన శ్రీహరి కృష్ణావతారంలో వచ్చి, వారికి వశుడై కట్టుటకు, కొట్టుటకు, తిట్టుటకు అవకాశమిచ్చి గోపికలకు ‘బంధువు’గా గోకులవాసిగా మారాడు.గో, గోప, గోపికలను రక్షించి, ఇంద్రుని గర్వమణచి శ్రీకృష్ణుడు ‘గోవింద’ నామాన్ని బిరుదుగా పొందాడు. ఇంత కష్టంతో వ్రేపల్లె వాసుల మీద ఇష్టం సంపాదించుకున్న శ్రీకృష్ణుని, గోవిందనామంతో కాక నారాయణ నామంతో పిలవడం అన్నది ‘దగ్గరి బంధుత్వాన్ని కాదని దూరపు బంధుత్వాన్ని చెప్పడం వంటిదని’ మహాభక్తురాలు, లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి (ఆండాళ్‌) భావించింది. ప్రేమగలవారు ‘ప్రాణనాథా’ అని కాకుండా ‘లోకనాథా’ అని పిలవడం వంటిదే ఇదని శ్రీకృష్ణుడూ భావిస్తాడనీ ఆ అమ్మవారు గుర్తించింది.*

*చెవిలో రహస్యంగా ఉపదేశింపదగిన, మెల్లగా జపించవలసిన ‘నారాయణ’ శబ్దానికి బదులుగా, సభలో గట్టిగా ఉచ్చరింపదగిన, బాహ్యశుద్ధి, స్థలశుద్ధితో పని లేకుండా, పలికినవారిని, విన్నవారిని ఉద్ధరించే ‘గోవింద’నామంతో పిలువనందుకు బాధతో శ్రీకృష్ణునికి గోదాదేవి క్షమాపణ కూడా చెప్పిందని ఆమె వృత్తాంతం వెల్లడిస్తున్నది. తిరుమల కొండపై, దేవాలయాల్లో, గృహాలలో జరిపే అర్చనలలో, భజనలలో భక్తిశ్రద్ధలతో భక్తులు ఉచ్చరించే ‘గోవింద’ నామం పట్ల మనందరం కూడా ప్రీతిని ఏర్పరచుకుందాం. గృహాలలోనూ చక్కగా ‘గోవింద’నామం పలికే విషయంలో ఎటువంటి సందేహాలకు, అపోహలకు లోనుకావద్దు. అత్యంత భక్తి ప్రపత్తులతో ‘గోవింద’నామాన్ని నిరంతరం, మనసా వాచా కర్మణా స్మరిద్దాం. భక్త సులభుడైన పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం.*

*┈┉┅━❀꧁ గోవిందా ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🦚🌷 🙏🕉️🙏 🌷🦚🌷

No comments:

Post a Comment