మా అరుగులు
లక్ష్మి మదన్
*************
*************
ఆనాటి ఇళ్ళకి రాజసం కొన దర్వాజా అయితే సేదతీర్చే ఆవాసం ఇంటి ముందరి అరుగులు. ఇంట్లో పని అంతా అయ్యాక కాసేపు ఆటవిడుపు ఇల్లాళ్లకి అరుగులు. కాసేపు కూర్చుని ముచ్చటించి కష్టాలు సుఖాలు పంచుకుని గుండె భారం తీర్చుకుని వెళ్లే ఆడ వాళ్ళు. వారు బాధలను వింటూ కన్నీరు కార్చి సంతోషాలను విని తృప్తి పడుతూ వారికి ఆవాసమయ్యేవి.
తరాల చరిత్రకి సాక్షిగా నిలిచి అన్నింటినీ తనలో దాచుకుని గుంభనంగా ఉండిపోయిన ఆనందాల సొరగులు ... అప్పుడప్పుడు కడిగి ముగ్గులు వేస్తే మురిసి పోయేవి పిచ్చి తల్లులు. నీళ్ళు చిలకరిస్తే చాలు పులకరించి పోయేవి.
వయసు మీరిన వారికి అలసట లేకుండా ఆరామంగా చేసేవి. వారి కథలు వినాలని ఎదురు చూసేవి. అనుభవాల సారాంశం వినాలని ఎంతో ఆశ పడేవి. పిల్లలకి ఆటల వేదిక. సుద్ద ముక్కలతో రాసుకున్న రాయితో గీసిన ముచ్చట పడేవే తప్ప కోపమే తెలియదు పాపం.
పండగో, పెళ్లో వస్తే సున్నంతో మెరిసిపోయి ఠీవిగా చూసేవి. బోలెడు కాలక్షేపం వాటికి అప్పుడు. వచ్చిన చుట్టాలంతా వచ్చి కూర్చుని ఏ కూరో.. నారో ఏరుతూ వాళ్ళ ఊరి ముచ్చట్లు చెప్తుంటే కడుపు నిండేది. ఎవరైనా కూర్చోకుండా వెళితే మాత్రం కోపం వచ్చేది. వాడ కట్టులో వచ్చి పోయేవారిని చూసి మురిసిపోయేది. దీపావళి వస్తె తనదే అంతా అన్నట్టు ఉండేవి. పిల్లలు పూర్నీలు కొట్టినా..పొటాష్ బాంబులు కొట్టినా ఆనందమే.
ఎండకు ఎండినా వానకు నానినా ఇంటి ముందు రక్ష నేనే అనుకుని బాధ్యతగా ఉండేవి. ఇంటి యజమానిని చూస్తే భయం, గౌరవం. ఇంటామేని చూస్తే భలే చనువు. పిల్లలంటే ప్రాణం. అంత మంచి అరుగులు. ఇంటికే సొబగులు .
ఈనాడు అలాంటి ఇల్లు కనుమరుగు అయ్యాయి. ఒకవేళ ఉన్న వేసిన రోడ్లతో కూరుకుపోయాయి. మా అరుగులు ఎక్కడో భూమిలో దాగిపోయాయి. ఎన్ని విషయాలు దాచుకున్నాయి. చెప్పుకుందామని తలిస్తే ఎలా వస్తాయి బయటకు. వెళ్లి చూసి బాధ పడ్డనే తప్ప ఏం చేయగలను. నా మదిలో మెదిలిన ఎన్నో జ్ఞాపకాల నిధులు అవి.
No comments:
Post a Comment