Thursday, April 24, 2025

 వార్ అండ్ పీస్ :

యుద్ధమూ శాంతీ :

"ఇదుగో ...నాకు నాలుగు పడింది. ఒకటీ, రెండూ, మూడూ, నాలుగు మీ కాయ చచ్చూ ...."

"నేనొప్పుకోను గాక ఒప్పుకోను ఇందాక మూడో గడిలో ఉన్న కాయ ఐదోగడికి ఎలా వచ్చిందీ ...ఇలాంటి తొండాటలు మా యింటా వంటా లేవమ్మాయ్ ..."

"హన్నా !ఎంత మాటన్నారూ ...నాది తొండాటా ... *అష్టాచెమ్మా* ఆడటం రాకపోతే రాదని చెప్పొచ్చుగా ...ఆడలేనమ్మా మద్దెల ఓడన్నట్లు ...నామీద తోండాట ఆడానని నేరాలు ఎందుకూ ..."

"ఏమన్నావ్ ???  పోటిలకి వెళ్ళలేదు గానీ, వెళితే నేషనల్ ప్లేయర్ ని అయ్యేవాణ్ణి తెలుసా ..."

"అవునా ...ఎందులో ..పోల్ జంపా ...పదిహేనొందల మీటర్ల పరుగు పందెమా ..క్రికెట్టా ..ఫుట్ బాలా ఎందులోనో కాస్త క్లారిటీగా చెబుదురూ ..."

"అవేమీ కాదు. ఇండోర్  గేమ్‌స్ .."

"ఏవిటేవిటీ ...ఇండోర్ గేమ్ సా ...కొంపతీసి షటిలూ, చదరంగం, ఇలాంటివి కాదుగదా ..."

"అబ్బే ! అవి కాదే నీకు తెలిసిందే ...చతుర్ముఖ పారాయణం అనీ చాలా ఫేమస్ గేము. "

"సరీపోయె... అదా స్వామీ!! తమరు పిల్లలమీద ఒట్టేసి మానేసి చాలాకాలం అయిందిగా ...ఇవ్వాళ మళ్ళీ గుర్తొచ్చింది ఎందుకో ..."

"అసలు మర్చిపోతే కదే ...నువ్వూ మా అమ్మా ఇద్దరూ కలిసి కాళ్ళా వేళ్ళా పడి పిల్లలమీద ఒట్టేయిచ్చి, బంగారం లాంటి నా ఆటను నానుంచి దూరం చేసారూ ..."

"చెయ్యక ఏం చేస్తారు ...రోజూ ఆఫీసులో ఓవర్ టైము అని చెప్పి అర్ధరాత్రి రెండింటి వరకూ మీరూ మీ మిత్రబృందం పేకాట సెషన్లు పెట్టుకోవటం. మీ బాసు కూడా మీతో చేరిపోవటం. "

"కానీ మొత్తానికి దొంగలను  పట్టేసిన  పోలీసులాగా కనుక్కున్నావుగా ..."

"ఏం చేస్తాను. అప్పుడు చంటాడు జ్వరంతో మూడు రోజులపాటు మూసిన కన్ను తెరవలేదు. మీరేమో O T అంటూ ఏరోజూ ఇంటికి రాకపోతే అత్తయ్యగారూ నేనూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అక్కడ కనిపించింది మీ స్టెనో విమల కుమారి... లేకపోతే మీ సంగతి నాకెలా తెలుస్తుంది. "

"తెలిస్తే తెలుసుకున్నారు. ఏకంగా ఆఫీసుకి వచ్చి పేకాట ఆడుతున్న మమ్మల్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నదే కాక ...మా అమ్మేమో మా బాస్ ని "ఒరే !!పింజారీ  వెధవా  ... నీకు పెళ్ళాం పిల్లలు లేరట్రా ఉండు  మీ పెద్దాఫీసుకి ఫోన్ చేస్తా"  అనగానే ఆయన పరుగోపరుగు. నువ్వేమో భద్రకాళిలా మింగేసేలా చూపూ ...."

"మరంతే సరదాగా ఆడితే ఆట. అందులో పడి బాధ్యత కూడా మర్చిపోతే అది వ్యసనం అర్ధమయిందా ..."

"అర్ధమైంది లేవోయ్ ..ఇది నాజూకు పట్నం పెద్దమనుషులు ఆడే ఆట. మీలా అచ్చెంగిల్లాలూ, కోతి కొమ్మచ్చులూ ఆడతావేంటీ ..."

"అబ్బో ...తమరి నాజూకు తనం పెళ్ళిలో మేజువాణీలోనే తెలిసింది లెండి. ఎదురుగా ఉన్న నాకు కాకుండా ఎక్కడో వెనకున్న మా చెల్లికి పూలబంతి విసిరినప్పుడే అనుకున్నా ...ఆవేశమే గానీ. ఆలోచన లేని మనిషని. "

"నేనూ అనుకున్నానే నాగవల్లిలో బిందెలో ఉంగరాలు తీసేటప్పుడు, అయ్యో ! మొగుడూ ...మగవాడూ వాణ్ణి కాస్త గెలిపిద్దాం అని ఆలోచన లేకుండా మూడుసార్లూ నువ్వే గెలిచినప్పుడు దీనితో జీవితాంతం పోటీ తప్పదురా భగవంతుడా !! అనీ "..

"మిట్ట మద్యాహ్నం అరుంధతిని అదుగో అంటూ చూపించినప్పుడే అనుకున్నా ...మరీ పట్టపగలు చుక్కలు చూపించేసే రకం అని. ఇదుగో చూసారా మళ్ళీ ఆరు పడింది. ఇంకోటి చచ్చూ ...."

"నేనొప్పుకోను నన్ను మళ్ళీ మాటల్లో పడేసి ఏమార్చావ్ ...ఆరు పడిందో ...ఐదే పడిందో ఒట్టి తొండాట. అందుకే ...నేను నీతో ఆడంది. "
"ఆడకండి నాకేం ...నేను శాంతమ్మ అక్కయ్యగారి దగ్గరకు వెళ్ళి ఆడుకుంటాను. ఈలోగా ఆ కాసిని ఇడ్లీపప్పూ గ్రైండర్ వేసేసి, ఎండపెట్టిన వడియాలు కాసినీ లోపల పెట్టేసి... ఆరిపోయిన ఆ నాలుగు దుప్పట్లూ మడత పెట్టేసి, ఆ రెండు బంగాళ దుంపలూ తరిగేసి ...."

"హమ్మో ...హమ్మో ...ఇంక ఆపెయ్ ...నా పేకాట వ్యసనమైతే ... మరి మొగుడికి పన్లప్పగించి టింగురంగా మంటూ వెళుతున్నావే మరి దీన్నేమంటారూ అంట ...."

"హయ్యొ రామచంద్రా ...ఆడాళ్ళకు అంతమాత్రం స్వతంత్రం లేదా తండ్రీ ...కాసేపు పక్కింటిదాకా వెళ్ళొస్తానంటే ..ఇన్నేసి మాటలా ...స్త్రీ స్వాతంత్ర్యాన్ని అణిచివేస్తున్న  ఇలాంటి పురుషపుంగవులను ఏం చేయాలి తండ్రీ ..."

       "హమ్మో !! ఏవిటీ విపరీతం రామచంద్రా ... అర్జంటుగా ఇంట్లో టీవీ లో అమెజానూ, నెట్ ఫ్లెక్సూ , హాట్ స్టారూ లాంటివి తీసెయ్యాలి. లేకపోతే ఇంట్లో స్నేహ భంగమూ, థప్పడ్ మార్లూ తప్పేలా లేవు తండ్రీ. "

 *పద్మజ* *కుందుర్తి* .

No comments:

Post a Comment