Thursday, April 24, 2025

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏
     
   *ఆచార్య సద్బోధన:*
                 
అల్ప మనస్సు గొప్ప విషయాలను గ్రహించలేదు.

“ఎవరు నా కొరకే కర్మలు చేస్తారో, నన్నే పరమ ప్రాప్యంగా విశ్వసిస్తారో నా యందే భక్తిని కలిగి ఉంటారో, సమస్త భౌతిక పదార్థాలయందు ఆసక్తిని విడిచి సర్వప్రాణుల ఎడల ద్వేషభావం లేకుండా ఉంటారో అట్టివారు నన్ను పొందుతున్నారు.”
               -భగవద్గీత.

మన చుట్టూ కొన్ని పరిమితులను విధించుకుని అవి అలవాట్లుగా మార్చుకుంటూ ఉన్నందున మార్పులు చేసుకునేందుకు భయపడుతూ కార్యసాధనకు సంసిద్ధతను వ్యక్తం చేయలేకపోతున్నాం.

మనమున్న పరిస్థితులు మెరుగ్గా లేవని తెలిసి ఉన్నా అడుగు ముందుకు వేయలేక పోతున్నాం. అయితే ఒక్కసారి మన అంగీకారాన్ని చూపుతూ మార్పుని ఆహ్వానిస్తే మన ముందు ఒక ప్రపంచం కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మిక సామ్రాజ్యం.

’నాది’ అనే భావనను భగవంతునితో  అనుసంధానం చేయగలిగితే జీవితంలోని చిన్న విషయాలు మనలను ఇక ఏ మాత్రం బాధించవు. ఉన్నత చైతన్యపు వీథిలో స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ భగవదాస్వానుభూతిలో మునగగలం.

భగవంతునిలో మన ఉనికిని గుర్తించాలి, దాని వలన మనలోని స్వీయబంధనాలు విముక్తి పొందుతాయి. మన హృదయాన్ని, మనస్సుని విస్తరించాలి, దాని వలన మన దృష్టి, భావాలు విశాలమవుతాయి. అల్ప విషయాలు, వ్యర్థ సంభాషణల నుండి మన మనస్సుని తప్పించాలి, దాని వలన సమస్త సార భూతమైన దేవదేవుని యందు మనం నివసించగలం.
.          *సర్వం శివమయం*                  

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment