*ఉర్విలో సర్వం సత్యమయం*
*సత్యసాధన, సత్యశోధన, సత్యారాధన, సత్యనిరూపణ అనే పారమార్థిక ప్రక్రియలన్నీ ఆధ్మాత్మికంగా ఎదిగిన ఆస్తిక మహాశయులకే తెలుసు. నిత్యమైన, నిర్మలమైన, నిరాకారమైన, నిరుపమానమైన ఆత్మానందానికి సత్యమే ఆలయం.*
*"సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మా సమాశ్రితా*
*సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదమ్"*
*"లోకంలో సత్యమే భగవత్స్వరూపం. సర్వం సత్యం పైనే ఆధారపడి ఉంది. అన్ని ప్రయోజనాలకూ అదే మూలం. సత్యానికి సమానమైనది మరేదీ లేదు" అని వాల్మీకి రామాయణం అయోధ్య కాండంలోని ఈ శ్లోక భావం. సత్యసాధనలో సర్వప్రయోజనాలు పొందుతాము. అందుకు ఆగమాలు, ఆగమాంతాలు, అత్యధిక ఆధారాలు, వ్యక్తిని లౌకిక జీవన విధానంతో అలౌకిక ఆనంద శిఖరాలకు చేర్చే ప్రయత్నంలో కావ్య సంపద కూడా ఫలితాన్ని సాధిస్తుంది.*
*కానీ మనిషి మనస్సును మంచి మార్గంలో నడిపించగలగడమే ప్రధాన లక్ష్యం. అదే లోకోత్తర లక్షణం. అందుకు తాత్విక శక్తియుక్తులు, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం. సత్యసంధత, పవిత్రత, నిస్వార్థత అనే సద్గుణాలున్న వ్యక్తిని నాశనం చేయగల శక్తి సృష్టిలో ఎక్కడా లేదని వివేకానందుడు చెప్పారు. సత్యం పలకడమే కలియుగంలో తాత్విక తపస్సని రామకృష్ణ పరమహంస తెలిపారు.*
*"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్*
*నబ్రూయాత్ సత్యమప్రియమ్*
*ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మసనాతనః"*
*"సత్యమే చెప్పాలి. ప్రియమే (ఇష్టమైన మాటలనే) పలకాలి, సత్యమైనప్పటికీ అప్రియం (ఇష్టం కాని మాటలను) పలుకరాదు. అలాగే ఇష్టమైన మాటలైనప్పటికీ అసత్యమాడరాదు" అనేది ఈ నీతి సూక్తి తాత్పర్యం. సత్యం, ప్రియం అనే రెండు పదాలు పరస్పరం ప్రయోజనకరంగా ఆచరణలో అమలు కావాలి. అపుడే ఆధ్యాత్మిక ఫలాలు అపురూపంగా అందుకోవచ్చు. అప్పుడే అన్యాయం, అక్రమం, ఆరిష డ్వర్గాలు, దుర్గుణ, దురాచారాలు, సప్తవ్యసనాలు పలాయనం చిత్తగిస్తాయి. బలి చక్రవర్తి వడుగుకు మూడడుగులు దానమిచ్చే సమయంలో సత్యాన్ని, ప్రియాన్ని సమంగా సమర్థించాడు. గురువైన శుక్రాచార్యుడు తన సత్యదీక్షకు అడ్డుపడినపుడు "శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున భార్గవా!" అని ప్రియవచనాలు పలికి సత్యదానం చేసి దాన శీలిగా పేరు పొందాడు. కవితా కళామతల్లి శారదాంబ తన ఎదుట నిలిచి భోరున ఏడ్చినపుడు 'త్రిశుద్ధిగనమ్ము భారతీ' అని సత్యప్రమాణం చేసిన భక్త కవి పోతన తన భాగవతాన్ని భగవంతునికి అంకితమిచ్చి సరస్వతీమాతను సంతోషింపజేశాడు.*
*సాధారణమైన నూరు నూతులకంటే పరిశుద్ధ జలం కల ఒక బావి మేలని, అలాంటి బావులు నూరింటికన్నా ఒక్క క్రతువు శ్రేష్టమని, శతక్రతువులకంటే ఒక సుతుడు నయమని, వంద సుతులు సైతం ఒక సత్యవాక్కుతో సమానం కారని ఆంధ్రమహాభారతం ఆదిపర్వంలో నన్నయ కవీంద్రుడు చెప్పాడు. "త్యాగాయ సంభృతార్థానం సత్యాయ మితభాషిణామ్" అని రఘువంశరాజుల గుణగణాలను కాళిదాసు మహాకవి వర్ణించాడు. సత్యానికి గల శక్తి గురించి అనంతామాత్యుడు రచించిన 'భోజరాజీయం'లో ఓ కథ ఉంది. అడవిలోకి వచ్చిన ఆవును పులి చంపబోగా, తన ఇంటికెళ్లి బిడ్డకు పాలిచ్చి వస్తానని బ్రతిమాలి వెళ్లి వచ్చిన ఆవు సత్యనిష్ఠకు ఆ పులి ఆశ్చర్యపోయి ఆవును చంపకుండానే వదిలివేసిందట. సత్యానికి సత్యమే సాటి. అన్ని గుణాలకన్నా సత్యగుణమే మేటి. కాబట్టి మనందరమూ సత్యాన్నే అనుసరిస్తూ, పలుకుతూ తరిద్దాం.*
*┈┉┅━❀꧁హరి ఓమ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🪷🌹 🙏🕉️🙏 🌹🪷🌹
No comments:
Post a Comment