*వజ్ర సంకల్పం ఉంటే... అన్నీ సుసాధ్యమే*
*కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది ఒక చలనచిత్రంలోని పాట చరణం. ఈ చరణంలో విజ్ఞానమే కాక ప్రేరణాయుతమైన భావన కూడా ఉంది. దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఇందులోని అంతరార్థంగా చెప్పవచ్చు. మహాత్మా తులసీదాస్ కూడా ఎన్నో స్పూర్తిదాయకమైన పద్యాలు రాసి ప్రజల్ని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. ఆయన రాసిన దోహావళి అనే కావ్యంలోనిదే ప్రస్తుత పద్యం.*
*"గంగా యమునా సురసతి సాత్ సింధు భర్పూర్*
*తులసీ చాతక్ కే మతే బిన్ స్వాతీ సబ్ ధూర్'*
*భూమ్మీద గంగా యమునా సరస్వతీ వంటి నదులు మంచి నీటిలో ఉన్నా, సప్త సాగరాలు నీటితో ఉన్నా చాతక పక్షికి ఇవేవి పనికిరానివే. చాతక పక్షి కేవలం వర్షరుతువులోని స్వాతి నక్షత్రంలో మేఘాల నుంచి కురిసే నీటిని నేరుగా తాగి మాత్రమే తన దాహాన్ని తీర్చుకుంటుంది.*
*అది అయిపోయిన తర్వాత తిరిగి సంవత్సరమంతా వాన చినుకుల కోసం మబ్బుల వైపు చూస్తూ బతుకుతుంది అంటాడు తులసీదాసు. భక్తుడు కూడా భగవంతుని దర్శన భాగ్యం కోసం చాతక పక్షివ వలె పట్టుదలతో కష్టాల కోర్చి ఎదురుచూడాలన్నదే భక్త శిరోమణి గోస్వామి తులసీదాసు అభిప్రాయం. ఆది శంకరులు కూడా ఒకానొక సందర్భంలో తన శిష్యులు శివ సాన్నిధ్యం చేరడానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో బోధించారు. చాతక పక్షి స్వాతి నక్షత్రంలో కురిసే వర్షం చినుకులు మాత్రమే తాగుతుంటుంది. అందుకే అది నిండైన మేఘాల కోసమే ఎదురుచూస్తుంది. హంస తామర తూళ్ళను మాత్రమే తింటుంది. అందుకే ఆది పద్మాలతో నిండి ఉన్న సరోవరాల కోసమే వెతుకుతూంటుంది. చకోర పక్షికి వెన్నెలే ఆహారం. అందుకే అది చంద్రోదయానికై ఎదురుచూస్తుంటుంది. అలాగే నిజమైన భక్తుడు పరమేశ్వరుని చేరడానికి అనేక కష్టాలను ఎదిరిస్తూ ఆయన కోసం నిరీక్షిస్తాడు అన్నారు. పట్టుదలతో అనుకున్నది సాధించే వరకూ నిద్రపోని వారిని భగీరథునితో పోలుస్తారు. అందుకే ఎవరైనా కఠోర పరిశ్రమ, చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేసారంటారు. దీనికి కారణం ఎన్నో కష్టనష్టాలకోర్చి భగీరథుడు దివి నుంచి గంగను భువికి తీసుకువచ్చాడు. ఈ భగీరథుని విషయం రామాయణ, భారత, భాగవతాల్లో కూడా కనిపిస్తుంది. భగీరథుని విషయం బహుళ ప్రచారంలో ఉన్నదే. అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశరథ మహారాజు పూర్వీకుడైన సగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఆయనకు ఇద్దరు _ భార్యలు. వారిలో కేశిని అనే ఆమెకు అసమంజసుడు అనే కుమారుడు, రెండో భార్య సుమతికి అరవై వేల మంది కుమారులు కలిగారు. సగరుడు మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధయాగం తలపెట్టాడు. యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దాని వెంట తన కుమారులను పంపించాడు. సగరుడు చేసే అశ్వమేధయాగంతో అతను తనతో సమానుడై తన పదవికి ఎక్కడ పోటీ అవుతుందో అని భావించి ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని మాయం చేసి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న మహావిష్ణు అవతారమైన కపిల మహా ముని ఆశ్రమం వద్ద కట్టివేసాడు. సగరుని కుమారులు అరవై వేల మంది దానిని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్లారు. అశ్వం కపిలాశ్రమం వద్ద కనబడే సరికి ఆయనే తమ అశ్వాన్ని కట్టివేసాడని భావించి కపిలునితో యుద్ధానికి దిగారు. సమాధినిష్టుడై ఉన్న కపిలుడికి వీరి అలజడితో భంగం కలిగింది. వారు తన పైకి యుద్ధానికి దిగడం చూసి తీక్షణం గా చూసే సరికి వారంతా భస్మమై అరవై వేల బూడిద కుప్పలుగా మారారు.*
*వారెంతకూ తిరిగిరాక పోవడంతో సగరుడు, అసంమంజసుడి కుమారుడైన అంశుమంతుని తమ పెద నాన్నల జాడ తెలుసుకురమ్మని పంపాడు. అతడు వెతుకుతూ పాతాళానికి వెళ్ళి ఆరవైవేల బూడిద కుప్పలు చూసి దగ్గరలోని కపిలుని వద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారికి సద్గతి ప్రాప్తించడం కోసం ఏమి చేయాలని కోరాడు. దానికి ఆయన ఆకాశంలో ప్రవహించే సుర గంనను భూమి మీదకు తెచ్చి వారి బూడిద కుప్పలపైగా పారిస్తే వారికి సద్గతి ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది సాధ్యమయ్యే పని కాదని అంశుమంతుడు ఈ విషయం సగరునికి చెప్పాడు. అది విని ఆయన మనోవ్యాధితో బాధపడుతూ కొంత కాలానికి మరణించాడు. ఆయన తర్వాత అతని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు రాజులయ్యారు. వారిలో భగీరథుడు తన పూర్వీకులకు సద్గతి ప్రాప్తించేందుకు గంగను భువిపైకి తేవాలనే దృఢ సంకల్పంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన గంగను భూమిపైకి ప్రవహింపజేయడానికి అనుమతించాడు. ఆయన గంగానదిని కోరగా ఆమె అంగీకరించింది. అయితే తాను ఆకాశం నుంచి భూమిపైకి పడితే ఆ వేగానికి భూమి బద్దలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయం బ్రహ్మకు తెలపగా ఆయన ఆమె వేగాన్ని అదుపుచేయగలవాడు పరమేశ్వరుడేనని తెలిపాడు. భగీరథుడు మళ్లీ పరమేశ్వరుని కోసం తపస్సు చేసాడు. ఆయన ప్రత్యక్షమై గంగను భరించేందుకు అంగీకరించాడు. అలాగే గంగ శివుని జటాజూటంలోకి చేరింది. భగీరథుడు గంగను విడవాల్సిందిగా పరమేశ్వరుని కోరాడు. ఆయన తన జటాజూటం నుంచి సన్నని పాయను వదిలాడు. ఆ విధంగా గంగ భువి పైకి వచ్చింది. అయితే నా ప్రవాహమార్గం ఏమిటని ఆమె అడగ్గా తనని అనుసరించమ న్నాడు భగీరథుడు. ఆయన ముందు కదలగా గంగ వెంట రాసాగింది. దానిలో ఆయన జహ్ను మహర్షి ఆశ్రమం పక్కగా నడుస్తుండగా గంగా ప్రవాహ వేగానికి ఆయన ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆ మహర్షి కోపించి గంగను మొత్తం తాగేశాడు. భగీరథుడు అతనిని ప్రార్దించి గంగను వదలమనగా ఆయన కరుణించి తన చెవి నుంచి వదిలాడు. ఆయన శరీరంలో నుంచి వచ్చిది కనుక గంగను జహ్నుని కుమార్తెగా భావించి జాహ్నవి అని పిలవడం జరిగింది. ఆ తరువాత భగీరథుని పూర్వీకుల బూడిద కుప్పల మీదుగా ఆమె ప్రవహించడం వారికి సద్గతులు ప్రాప్తించడం జరిగింది.*
*కఠోర పరిశ్రమతో ఎన్ని అడ్డుకులెదురైనా వాటిని సమర్ధంగా ఎదుర్కొన్నాడు కనుకే భగీరథుడు పట్టుదలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి పొందాడు. ఈనాడు ఇటువంటి వజ్రసంకల్పులు ఉన్నారు. కూలిపనులతో పొట్టపోసుకునే కార్మికుని కొడుకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా బాగా చదివి కలెక్టరైన సంఘటన, ఆటో డ్రైవర్ కుమార్తె విమానం పైలెట్ కావడం వెనుక ఉన్నది భగీరథ ప్రయత్నమేనని గుర్తించాలి.*
*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🪷🌺 🙏🕉️🙏 🌺🪷🌺
No comments:
Post a Comment