Sunday, April 20, 2025

విరామం..!!

 *విరామం..!!* 

*రెండు జన్మల నడుమ ఒక విరామం. అదే మరణం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. చావుకు భయపడి ఏటికి ఎదురీదకపోతే రేవు చేరుకోలేరు. చావో రేవో తేల్చుకోవలసింది, ఆ అవసరం అవకాశం ఉన్నది- మనిషికి మాత్రమే. ఈ లోకంలో ప్రతిరోజూ ఎందరో పుడుతూ, చస్తూ ఉంటారు. అది చూస్తూ తనకు చావులేదని, రాదని, రాకూడదని అనుకునేవాడు అమాయకుడు, అజ్ఞాని. లోకంలో ఇంతకుమించిన ఆశ్చర్యకరమైనది. వింతైనది మరొకటిలేదని ధర్మరాజు యక్షుడి ప్రశ్నకు జవాబుచెప్పి 'భళా' అనిపించుకున్నాడు.*

*సాధారణంగా, చావుకు భయపడటం లోకసహజం. అదొక తిరిగిరాని పయనంగా భావించటమే భయానికి కారణం. మృత్యువును జయించాలంటే ముందుగా మరణ భయాన్ని జయించాలి. ముక్తిమార్గంలో పయనించి మోక్షశిఖరం అందుకోవాలంటే మృత్యుద్వారం ప్రవేశించాలి. చావు గురించిన బెంగ, భయం తొలగించుకోవటానికి మూడు దారులున్నాయి.*

*తార్కిక, ప్రాణిక, మానసిక శక్తుల ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. మేధామధనం చేసి చావు బతుకులు బొమ్మ బొరుసు లాంటివని జ్ఞాని తెలుసుకుంటాడు. వివేకి మనోధైర్యంతో, యోగి ఆత్మబలంతో-యథార్థం గ్రహిస్తారు. చైతన్యం ఒక ఆగని ప్రవాహం. యథార్థం ఎప్పటికీ ఉండేది. మారేది పదార్థం, ప్రకృతి ప్రభావం వల్ల ఈ ప్రపంచం మారుతుంది కాబట్టి శరీరాలు రాలినా చైతన్యం మనిషికి మరో జన్మను సరికొత్త జీవితం ప్రసాదిస్తుంది. తాను శరీరం కాదని, ఆత్మ అని ఎరుక కలిగితే మనిషికి మరణభయం తొలగటంతో పాటు మరణం మరో జీవితానికి, నూతన ఆవిష్కారానికి అవసరం అన్న సత్యం సాక్షాత్కరిస్తుంది. మృత్యువు ఆవలితీరాన అమృతత్వం స్వాగతిస్తుందని, అటువైపు అడుగు వేయమని ఉపనిషత్తు ఆశ్వాసిస్తున్నది.*

*ఒక మనిషి అమరుడయ్యాడు అంటే ఒంటరిగా అలా ఉండిపోవటం కాదు. నేను నేనుగా మిగిలిపోవటం కాదు... చైతన్య స్ఫూర్తిమన్మూర్తిగా తాను చైత్యపురుషుడై ప్రపంచాన్ని, ప్రజానీకాన్ని ఆదుకోవటం.*

*త్యాగరాజు మరణించినా, ఇప్పటికీ ఆయన స్వరసామ్రాజ్యానికి రాగరాజే. మరణం ఆరిపోయిన దీపం వత్తి కాదని, నాలుగు వైపులా కాంతిని ప్రసరిస్తూ చిరకాలం వెలిగే అమరదీపపు సెమ్మె అని తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానవంతుడు వివేకంతో జీవన్ముక్తుడై ఈ లోకంలోనే ఉంటాడు. తనతో పాటు మిగతా జీవులను ముక్తుల్ని చేయటానికి దైవప్రతినిధిగా, ఈ ప్రపంచంతో భాగస్వామ్యం నెరపటమే జీవన్ముక్తుడి కర్తవ్యం. సూర్యచంద్రులు ఏ కామన లేకుండా విశ్వ వేదికను వెలిగించే చందంగా పనులు చేపట్టటమే నిస్వార్థక్రియాయోగం. తాను ఏరు దాటితే చాలనుకోవటం స్వార్థం.*

*ఈ ప్రపంచాన్ని నడిపించటానికి ఆ పరమాత్మ అవతారాలు ఎత్తుతూ ఉన్నాడు. అవతారం చాలించినా ఆ ప్రభావం సజీవంగానే ఉంటుంది. త్రేతాయుగంలో ధరించిన రామావతారం యుగాలు గడిచినా మనుషుల హృదయాల్లో చిరస్థాయిగా నెలకొంది. ఒక ఆదర్శ మానవుడిగా ఈనాటికీ రాముణ్ని ప్రజలు పూజిస్తున్నారు. రామనామం జపతపాలకు తారకమంత్రం అయింది. వేదరుషులు అమరత్వాన్ని, అమృతత్వాన్ని జీవిత సత్యానికి ప్రత్యామ్నాయంగా భావించలేదు. వారి దృష్టిలో దైవం వెలుగు మాత్రమే కాదు. సంకల్పం, శక్తి... అన్నీ ఆయన ప్రసాదాలే. మరణం నుంచి తప్పించుకోలేనని దిగులుచెందేవాడు నిరాశావాది. మరణాన్ని గుడ్డిగా ప్రతిఘటించే వాడు మూర్ఖశిఖామణి, మరణం ముక్తికి ముఖద్వారంగా గుర్తించినవాడు జ్ఞాని జ్ఞాని అంటే తనకు బహుప్రీతి అని గీతాచార్యుడు చెప్పాడు. పూర్ణత్వపు బాటలో ప్రగతికి సోపానం వంటిది మరణం. భవతరణో పాయం తెలుసుకున్నవాడే మృత్యుంజయుడు. మరణాన్ని ఒక విరామంగానే చూడాలి. జీవితరంగంలో నిర్విరామంగా శ్రమిస్తూ మును ముందుకు సాగాలి. అదే లక్ష్యం, అదే మోక్షం.*

*꧁❀❀━❀━❀❀꧂*

No comments:

Post a Comment