Monday, April 21, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
              *వసంత పంచమి*

*సకల సంపదలకు ఆధారం విద్య. వాక్కు, బుద్ధి, మేధ, ధారణ, శ్రద్ధ, ప్రతిభ, స్ఫురణ వంటి మనోమయమైన అంశాలన్నీ విద్యాపరంగా కీలకమైనవి. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యకు అధినేత్రి- సరస్వతి. జ్ఞానయుతమైన విద్యల సమాహార రూపమే ‘సరస్వతి’ అని వేదం ప్రతిపాదించింది. సర్వత్రా వ్యాపించిన శక్తితత్త్వానికి సరస్వతి అని పేరు. మానవ దేహంలో ‘సోహం’ అనే ప్రాణవాయువు సంచార ప్రక్రియను సరస్వతిగా యోగశాస్త్రంలో వ్యవహరిస్తారు. సమస్త సృష్టిలో తేజరిల్లే జీవకళకి ప్రతిరూపంగా శారదను, శబ్ద బ్రహ్మమయ సప్తస్వర నాదానురక్తికి సంకేతంగా బ్రహ్మరూపాన్ని దేవీభాగవతం దర్శించింది.*

*ప్రణోదేవీ సరస్వతీ- అంటూ రుగ్వేదం వాణీ వైభవాన్ని కీర్తించింది. సరస్వతీ శాస్త్రమయీ- అని లలితా సహస్రనామావళి స్తుతించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- అనే నాలుగు రూపాల సమష్టి రూపం శ్రీ భారతి. సత్వగుణ శోభితంగా విలసిల్లే సరస్వతిని ప్రకృతిలో ఉత్పాదక శక్తికి ప్రతిఫలనంగా ‘శారదా తంత్రం’ పేర్కొంది. మాఘ శుద్ధ పంచమినాడు అఖిల విద్యా  వరదాయినిగా, జ్ఞానవల్లీ సముల్లాసినిగా సరస్వతి అభివ్యక్తమైందని బ్రహ్మాండ పురాణం ప్రస్తావించింది. బ్రహ్మ సృజించిన జగత్తు ఓ సందర్భంలో పూర్తిగా నిస్తేజంగా, నిశ్శబ్దంగా మారిందంటారు. సృష్టి స్తంభించిపోవడంతో దేవతలు కలవరపడ్డారు. బ్రహ్మను శరణువేడారు. అప్పుడు విరించి, తన దివ్య కమండలంలోని పవిత్ర జలాన్ని భూమిపై చిలకరించాడంటారు. మంత్రపూరితమైన జలం నుంచి బ్రాహ్మీశక్తి ఉద్భవించిందంటారు. రెండు చేతులతో వీణను మోగిస్తూ, మరో రెండు చేతుల్లో అక్షరమాలిక పుస్తకాన్ని ధరించి శ్రీవిద్య అవతరించింది.* 

*ప్రణవ బ్రహ్మాత్మకంగా, విజ్ఞాన ఘనరూపిణిగా శ్రీమాత ఆవిష్కారమై లోకాలన్నింటా జ్ఞానదీప్తుల్ని ప్రసరింపజేసింది. సృష్టి నిర్మాణం, నిర్వహణా శక్తులన్నింటిలో సర్వోత్కృష్టమైన మూలకారక శక్తి మహాసరస్వతి అని జగద్గురు ఆదిశంకరులు సౌందర్యలహరిలో శ్లాఘించారు. చంద్రమౌళిగా ఈశ్వరుడు, చంద్రకళాధరిగా సరస్వతి వర్ధిల్లుతూ, ఇద్దరూ చంద్రుణ్ని సిగపువ్వుగా అలంకరించుకున్నారు. మహేశ్వరుడి స్త్రీ రూపమే మహాసరస్వతి అని, ఈశ్వరానుగ్రహం ఉపాసనా సంప్రదాయంలో సరస్వతిగా ఆకృతి దాల్చిందని శివమహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు వెల్లడించాడు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment