Tuesday, April 22, 2025

 వృద్ధాశ్రమాలు - శాపాలా, వరాలా

రచన *లక్ష్మి* *మదన్* 
__________________

ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అంటే ఏమిటో ఎవరికి తెలియదు. వయసు పైబడిన వారు ఇళ్లల్లో కొడుకులు, కోడళ్ళు, మనవళ్లు మనవరాళ్ల సంరక్షణలో ఉండేవాళ్ళు. చాలా వరకు పెద్దవారు ప్రాణం పోయే వరకు వారి పనివారు చేసుకునే స్థితిలోనే ఉండేవారు. 

చిన్నచిన్న అనారోగ్యాలు వచ్చినా, ఏ ఆయుర్వేదం మందో వేసుకొని అలాగే జీవితాన్ని సాగించే వారు. చాలావరకు పెద్ద సమస్యలు వచ్చేవే కావు. వయసు పైబడిన అలసట తప్ప వేరే ఏమీ ఉండేది కాదు. ప్రాణాలు కూడా హాయిగా సొంత ఇంట్లో చుట్టూ తన వాళ్ళ మధ్య వదిలేవాళ్ళు. 

కానీ ఇప్పుడు శాస్త్రీయత పెరిగి, విపరీతంగా హాస్పిటల్స్ వెలసి, అందరికీ ప్రాణాలు అంటే ఎక్కువ మక్కువ కలిగి, చీటికిమాటికి హాస్పిటల్ కి వెళ్లడం పరిపాటి అయిపోయింది. అందుకు సంబంధించిన పరీక్షలు మందులు వాడకం కూడా ఎక్కువే అయిపోయింది. 

అందులో అనారోగ్యాలు కూడా విపరీతంగానే కలుగుతున్నాయి. దానికి బలమైన కారణం లేకపోలేదు. రసాయన మందులు వాడిన పంటలు వాడడం ఒకటైతే, శారీరక వ్యాయామం తగ్గి రోగాలు కలగడం మరొక ఎత్తు. 

మరో ముఖ్యమైనది ఈ మధ్య బయట ఆహారం తినడం ఎక్కువైపోయింది. దానివల్ల ఒళ్ళు విపరీతంగా పెరిగిపోవడంతో రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. 

ఆరోజుల్లో ఇంటి యజమాని ఒక్కడే ఇంటి పోషణ కోసం కష్టపడేవాడు. ఆడవాళ్లు ఇంట్లో ఉండి పిల్లలను, పెద్దవాళ్ళను చూసుకుంటూ వారికి తోచిన పనిని చేసుకొని ఉండేవారు.

ఎప్పుడైతే ఆడవారిని చిన్నచూపు చూడడం ప్రారంభం అయ్యిందో, పురుషాధిక్యత పెరిగిందో అప్పుడే ఆడవాళ్ళలో కసి పెరిగింది .మేము దేనికి తక్కువ ? ఎందుకు ఉద్యోగాలు చేయకూడదు ? మేము ఎందుకు సంపాదించకూడదు ? అనే ఆలోచనలు రేకెత్తించి ప్రతి ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. 

మహిళలు ఇలా ఉద్యోగాలు చేయడం మంచిదే. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ న్యాయం ఎవరికి జరిగింది? 

వెన్నీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్లు, ఆర్థికంగా భర్తకు సహాయం చేయడంతో పాటు ఉదయమే అన్ని పనులు చేసుకుని, పిల్లల బాధ్యత కూడా తమ మీదనే వేసుకొని, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి పనిని చూసుకోవడంతో ఇంకా బాధ్యతలు పెరిగాయి. అటు ఆఫీసులో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మగౌరవం దొరికింది అని అనుకుంటున్నాము అది నిజమే కావచ్చు. కానీ పని వత్తిడి మహిళలకు ఎక్కువగా పెరిగింది. అలాగని ఇంత చదువుకొని మహిళలు ఇంటిపట్టునే ఉండాలని నేను అనుకోవడం లేదు. అందరూ మగవాళ్లు ఏమి పట్టించుకోకుండా ఉంటారని కూడా నేను అనుకోను .ఒక 50% ఆడవాళ్లు విపరీతంగా కష్టపడుతున్నారు అనేది మాత్రం నిజం. 

ఎప్పుడైతే ఇల్లాలు ఆర్థికంగా తనకు సహాయపడుతుందో అప్పుడు భర్త కూడా ఆమెకు దైనందిన పనిలో సహాయం చేయాలి. 

అందరూ అంటారు "ఏముంది మా కాలంలోలాగా నీళ్లు తోడటం, పిండి రుబ్బడమో విసురుకోవడము ఈ పనులన్నీ ఉన్నాయా ? గ్యాస్ స్టవ్ ల మీద వంట, మిక్సీలో వేస్తే పిండి వస్తుంది. స్విచ్ నొక్కితే చాలు పనులన్నీ అయిపోతాయి అంటారు. అది అంత సులభమా చెప్పండి ? ఒకప్పుడు ఇన్నిరకాల టిఫిన్స్ ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. ఒక సమయంలో అందరూ కలిసి ఉపహారమైన, భోజనం అయిన ఒకే రకంగా చేసే వాళ్ళు. ఇప్పుడు మూడేళ్ల పిల్లవాడు కూడా వాడి కోరికల చిట్టా విప్పుతాడు. తినడానికి ముప్పుతిప్పలు పెడుతున్నారు. వంట చేసిన దానికన్నా ఎక్కువ సమయం పిల్లలకి తినిపించడం లోనే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి సుఖం లేదు.

ఇక పిల్లల ఫీజులు, ఖర్చులు చెప్పనవసరం లేదు. ఇద్దరి జీతాలు కావాల్సిందే.ఎంతో దూరంలో స్కూళ్లు. అందరూ 8 కల్లా బయటపడితే, ఇక మిగిలేది ఇంట్లో ఉండే వృద్దులు.

ఇందులో తప్పు ఎవరిది ? కాలంతో పాటు పరిగెత్త వలసిందే పిల్లలు. పెద్దవాళ్ళని  దిక్కు లేని పక్షులను చేస్తున్నారు అని అంటారు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు అనే అపవాదు కూడా ఎక్కువగానే ఉంది.

కానీ చాలామంది వృద్దులు వారికై వారు అందులో చేరుతున్నారు. రిటైర్మెంట్ హోమ్స్ గా పిలవబడే ఈ సదనాలు ఎంతో మందికి ఓదార్పు నిస్తున్నాయి.

రోడ్లమీద వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు.అది వేరే విషయం. ఇప్పుడు డబ్బు కట్టి వాటిల్లో చేరేవారు మాత్రం ఇష్టంతో చేరుతున్నారు.

వారికి అక్కడ ఎంతోమంది స్నేహితులు అవుతున్నారు. నిద్ర లేచినది మొదలు వారి దినచర్య ఆరోగ్యకరంగా సాగుతుంది. వ్యాయామం చేయడం, ఇష్టమున్న దైవాన్ని ప్రార్థించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, మరో ముఖ్యమైనది మందులు వేసుకోవడాన్ని గుర్తు చేస్తారు.

అందరితో కలిసి ఉండడం వల్ల ఒంటరితనం పోయి, సంతోషంగా ఉండ గలుగుతున్నారు.

ఇళ్లల్లో ఉంటే ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఉండాలి. పిల్లలు విదేశాలలో ఉంటే మరీ సమస్యలు. ఒంటరిగా ఉండలేక. సరైన రక్షణ లేక ఇలా రిటైర్ మెంట్ హోం లో చేరుతున్నారు.

బాధాకరమైన విషయం ఏంటంటే కొంత మంది ఆస్తులు రాయించుకుని రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది దారుణం.

విదేశీ చదువులు కోరి పంపించిన తల్లి తండ్రులకి మరో మార్గం లేదు. అలాగని అసంతృప్తిగా లేరు. 

అంతే !ఎక్కడికో ఒక దిక్కు సర్దుకుని మనుగడ సాగించి తీరాలి. ఎవరి జీవితాలు పూల బాటలో పయనించవు.

ఎవరి వ్రాతని బ్రహ్మయ్య ఎలా రాస్తాడో తెలియదు. శివయ్య ప్రాణాన్ని ఎప్పుడు తీస్తాడో అంతకన్నా తెలియదు.

బతికినంత కాలం దుఃఖమైనా ,సంతోషమైన భరించాల్సిందే.

మళ్ళీ పూర్వపు వైభవం వచ్చి ఇళ్లన్నీ పిల్లలు,పెద్దలు, పాడి పంటలు, ఆల మందలతో విలసిల్లాలని కోరుతున్నాను.

________🌹_______

No comments:

Post a Comment