Sunday, April 20, 2025

 ❓⁉️❕⁉️‼️⁉️❓⁉️‼️⁉️❓❗⁉️‼️❓
 *టీచర్ ప్రశ్న.. బాల ఆలోచన.* 
(కథ)
రచన: *కె.వి.లక్ష్మణరావు* 
🔵

 *బాల* నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి.. బ్యాగ్ హాల్లో
పెట్టేసింది. కాళ్లూచేతులు కడుక్కొని వచ్చి వాళ్ల తాతయ్య పక్కన
కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన తాతయ్య...

"ఏంటమ్మా..! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అని అడిగారు.

అప్పుడా చిన్నారి.. ఆయనకేసి చూస్తూ.. "ఈ రోజు స్కూల్లో..
మా సైన్స్ టీచర్ ఉమ్మడి కుటుంబం గురించి చెప్పారు..
అలాంటి కుటుంబంలో ఉండే వాళ్లలో ఎవరు గొప్పవారో?
ఆలోచించి రేపటి క్లాస్లో చెప్పాలి అన్నారు. దాని గురించే
ఆలోచిస్తున్నాను. మనది కూడా ఉమ్మడి కుటుంబమే కదా
తాతయ్యా మరి ఎవరు గొప్పవారో మీరు చెప్పండి" అని
అడిగింది. 
"బాలా! నీకు ప్రతిరోజు రాత్రీ ఎంచక్కా.. నీతి కథలు
చెబుతాను కదా.. కాబట్టి నేనే గొప్ప" అని నవ్వుతూ
బదులిచ్చారు తాతయ్య. అక్కడే ఉండి ఈ మాటలన్నీ వింటున్న వాళ్ల నాయనమ్మ ఆ చిన్నారిని పిలిచి...
"అప్పుడప్పుడు నీకు కావాల్సిన వంటలన్నీ చేసి
పెడతాను. గుడికి కూడా తీసుకెళ్తాను...
అందుకని నేనే గొప్ప" అని మెల్లగా చెప్పింది.

అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన బాలా వాళ్ల నాన్న విషయమంతా విని.. "చిన్నితల్లీ! నిన్ను రోజూ సాయంత్రం పార్కుకు తీసుకెళ్తాను.. కావాల్సినవన్నీ కొనిపెడతాను కదా! కాబట్టి నేనే గొప్ప" అన్నారు తనని దగ్గరికి తీసుకుంటూ.
 వాళ్లందరి మాటలు వింటూనే.. బాల వాళ్లమ్మ అప్పుడే తన కోసం పాలు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడా చిన్నారి "అమ్మా.. నువ్వు చెప్పు. అసలు ఉమ్మడి కుటుంబంలో ఎవరు గొప్ప" అని చిన్నగా అడిగింది. 
"ప్రతిరోజు నీ కోసం వాళ్ల విలువైన సమయాన్ని కేటాయిస్తూ.. నిన్ను బాగా చూసుకునే వాళ్లంతా గొప్పవాళ్లే.
కుటుంబంలో ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా అస్సలు చూడకూడదు. అందరూ సమానమే.. ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడతారు. ఒకరి కష్టంలో ఇంకొకరు తోడుంటారు. కాబట్టి కుటుంబంలో ఉన్న అందరూ గొప్పవాళ్లే అని అర్థం" అని నవ్వుతూ చెప్పింది అమ్మ.
 బాల వాళ్ల అమ్మ ఇచ్చిన పాలు తాగేసి.. మళ్లీ తాతయ్య దగ్గరకెళ్లి కూర్చుంది. టీచర్ చెప్పిన విషయం గురించే మళ్లీ ఆలోచించడం మొదలు పెట్టింది. కాసేపటికి.. తనకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వాళ్ల నలుగురికేసి నవ్వుతూ చూస్తూ..
 "ఇంట్లో అందరి కంటే అమ్మే గొప్ప"అంది. 
"అవునా.. అదెలా!" అని ఆశ్చర్యంగా అడిగారు మిగతా ముగ్గురూ. 
అప్పుడు బాల నవ్వుతూ. వ్వుతూ... "మీ ముగ్గురూ.. నేనంటే నేను గొప్ప అంటూ.. మీ పనులను గుర్తు చేస్తూ మీ గురించి మాత్రమే చెప్పారు. కానీ అమ్మ మాత్రం తాను చేసే పనులు కూడా చెప్పుకోలేదు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్లంతా గొప్పవాళ్లేనని చెప్పింది. తాను గొప్ప అని ఎప్పుడూ అనలేదు. మన కంటే ఎక్కువగా.. కుటుంబం గురించి, వారి మంచి గురించి ఆలోచించే వాళ్లు ఎప్పుడూ. గొప్పవారేనని మా తెలుగు టీచర్ ఒకసారి పాఠం చెప్పేటప్పుడు చెప్పారు. గొప్ప వాళ్లెప్పుడూ తామే గొప్పవాళ్లమని చెప్పుకోరని కూడా అన్నారు. అందుకే నాకు అందరి కంటే అమ్మే గొప్పదని అనిపించింది" అంది.

అప్పుడు తాతయ్య. "నిజమే! బాలా.. చిన్నపిల్లవైనా చక్కగా చెప్పావు. నీ మాటలతో మేమంతా కూడా ఏకీభవిస్తాం. ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ.. అన్ని పనులూ చేసి పెడుతున్న ప్రతి అమ్మా... ఈ సృష్టిలోనే అందరి కంటే గొప్పది" అన్నారు 
బాల వెంటనే వెళ్లి
మురిపెంగా చూస్తూ.. వాళ్లమ్మను హత్తుకుంది. కూతురు చిన్న వయసులోనే.. కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ చక్కగా తెలుసుకుంటుందని తాను కూడా ఎంతో సంతోషించింది. మరుసటి రోజు తరగతికి వెళ్లగానే బాలా... "ఉమ్మడి కుటుంబంలో అందరూ గొప్పవారే" అని వాళ్లమ్మ చెప్పిన విషయాన్ని వివరించింది. అమ్మ అందరి కంటే ఇంకా గొప్పదని చెప్పింది. దాంతో టీచర్తో పాటుగా క్లాస్లో ఉన్న పిల్లలంతా చప్పట్లు కొట్టారు. 🔵
💐💐💐🔹💐💐💐

(ఈ కథ 20-02-2024 నాటి ఈనాడు దినపత్రిక హాయ్ బుజ్జీ శీర్షికలో ప్రచురితము. )

No comments:

Post a Comment