భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ఉపదేశసారము - ఉపోద్ఘాతం
ఈ లోకంలో ప్రతి మానవుడు - అతడు తెలివిగలవాడైనా - తెలివి తక్కువవాడైనా, ఉన్నవాడైనా - లేనివాడైనా, చదువుకున్న వాడైనా - అక్షరజ్ఞానం లేనివాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, స్త్రీ యైనా పురుషుడైనా ఎవరైనా సరే హాయిగా, ఆనందంగా ఉండాలని, సుఖంగా జీవించాలని; ఏ కష్టాలు, బాధలు, భయాలు, దు:ఖాలు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ బ్రతకాలనీ కోరుకుంటాడు. అలా కోరుకోవటమే కాదు, అలా ఆనందంగా జీవించటానికి బుద్ధితో జాగ్రత్తగా ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అనేకమైన కర్మలు చేస్తుంటాడు. వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, ఏదో వృత్తిని చేపడతాడు, లేదా రాజకీయాలలో దిగి ఉన్నత పదవులు సంపాదిస్తాడు. అందుకొరకు నిజాయితీగా కష్టపడి పనిచేస్తాడు, లేదా అక్రమ మార్గాలలో సంపాదిస్తాడు. అనేక వస్తువులను సంపాదిస్తాడు, ధనాన్ని సంపాదిస్తాడు, ఇళ్ళు కడతాడు, తోటలు పెంచుతాడు, స్విస్ బ్యాంకులలో ధనాన్ని నింపుతాడు. ఎలాగో ఒకలాగా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు. అనేక సందర్భాలలో ఆనందం వచ్చినట్టే వస్తుంది. ఆ తర్వాత వస్తువు పోవటం వల్లనో, పదవులు పోవటం వల్లనో, శత్రువుల వల్లనో, లేదా తనలోని కోరికల స్వభావం మారటం వల్లనో ఈ వచ్చిన ఆనందం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది. మళ్ళీ మనస్సులో అసంతృప్తి. దానిని పోగొట్టుకోటానికి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభం. మళ్ళీ వాటివల్ల ఆనందం వస్తుంది. కాని అదీ తాత్కాలికమే. మళ్లీ అసంతృప్తి. కొందరికి ఎన్ని సంపదలున్నా ఎంత ధనమున్నా
చాలదు. ఇంకా ఇంకా కావాలి. అసంతృప్తి. ఇక కొందరికి తమకు లేదని గాక, ఎదుటివాడికి ఉన్నదే అని బాధ, అసూయ. కొందరికి ఉన్నవి చేజారిపోతాయేమోననే భయం. ఏ క్షణం ఏమౌతుందోననే భయం. ఈశోకం-భయం ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి. "శోకస్థాన సహస్రాణి - భయస్థాన శతానిచ" వేలకొద్దీ శోకాలు, వందల కొద్దీ భయాలు. ఈ శోకాలు,భయాల మధ్య ఇంక ఆనందం ఎక్కడ? ఒక వేళ ఉన్నా ఎంతకాలం ఉంటుంది? ఒక వేళ అన్నీ బాగున్నా క్రమక్రమంగా ఈ దేహంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంద్రియాలు క్రమంగా పనిచేయటం లేదు. వృద్ధాప్యం మీద పడుతున్నది. రోగాలు రాగాలు తీస్తూ వచ్చి కూర్చుంటున్నాయి. చివరికి ఏదో ఒకనాటికి ఈ దేహం రాలిపోవాల్సిందే. మళ్ళీ మరోజన్మ. ఆ జన్మలో మళ్ళీ ఆనందం కోసం పరుగులు. ఇంతకు ముందు ఎన్నో జన్మలలో పరుగులు తీశాం. ఈ జన్మలోనూ తీస్తున్నాం. అయినాసరే మనం కోరుకున్న శాశ్వత ఆనందం లభ్యం కావటం లేదు. మనకు కావలసింది దుఃఖం లేని ఆనందం. శాశ్వతంగా ఉండే ఆనందం. మార్పులు లేని ఆనందం. కానీ మనకు వస్తున్నది తాత్కాలిక ఆనందం. దుఃఖంతో - భయంతో కూడి ఉన్న ఆనందం. ఏ మాత్రం పరిస్థితులు మారినా జారిపోయే ఆనందం. ఇదికాదు మనం కోరుకుంటున్నది. మరి మనం కోరుకొనే ఆనందం మనకు ఎందుకు రావటం లేదు? పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని సంపదలు కూడబెట్టినా, ఎందరు వ్యక్తులను తనవారిగా చేసుకున్నా - ఎందుకు ఈ శాశ్వతానందం దక్కడం లేదు? ఈ ప్రపంచంలో ఎంతదూరం పరుగెత్తినా పరుగులే తప్ప శాశ్వత ఆనందం లభించటం లేదేమిటి? పైగా ఆనందం కోసమని కర్మలు చేస్తున్న కొద్దీ కర్మ ఫలాలు, వాసనలు కూడుకొని అవి మనను మరింత బంధిస్తున్నాయి. జనన మరణ
చక్రంలో పడేస్తున్నాయి. జన్మ- కర్మ వలయంలో సుడిగుండంలో త్రిప్పుతున్నాయి. ఎందువల్ల? ఈ లోకంలోని వస్తువులు గాని, విషయాలు గాని, భోగాలు గాని అనిత్యమైనవి. అనిత్యమైన విషయాలు అనిత్యమైన ఆనందాన్నిస్తాయే గాని శాశ్వతానందాన్నివ్వలేవు. మరి ఏమిటి దీనికి పరిష్కారం ? శాశ్వతమైన ఆనందం నీకు కావాలంటే అశాశ్వతమైన, అనిత్యమైన వస్తువుల వెంట, విషయాల వెంట పడరాదు. శాశ్వతమైన వస్తువేదో తెలుసుకొని అట్టి వస్తువును పొందటానికి ప్రయత్నం చేయాలి. శాశ్వత వస్తువు పరమాత్మ. కనుక ఆ పరమాత్మను తెలుసుకొని ఆయనను ఆశ్రయించాలి. ఆయనకు దగ్గర కావాలి. ఆయనతో ఐక్యం కావాలి. అప్పుడే ఆనందం. శాశ్వతానందం. దానితో దు:ఖాలన్నీ మటుమాయం.
అయితే పరిమితమైన వస్తువులు పరిమితమైన ఆనందాన్నిస్తాయే గాని శాశ్వతానందాన్ని ఇవ్వలేవని ముందుగా గ్రహించాలి. తర్వాత తాను అనుభవిస్తున్న దుఃఖాల నుండి విడుదల పొందాలంటే తాను సమస్త కర్మ బంధనాల నుండి విడుదల పొంది, శాశ్వత పరమాత్మను తెలుసుకొని ఆయనతో ఐక్యమై పోవడం, మోక్షాన్ని పొందటం ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని గుర్తించాలి. అట్టి మోక్ష సాధనకు తీవ్ర ప్రయత్నం చెయ్యాలి.
మోక్షమంటే మరేమీకాదు. నీ సహజ స్థితియే మోక్షం. నీవు పరమాత్మ స్వరూపుడివే. నీవు మోక్ష స్వరూపుడివే. నీవు శాశ్వత ఆనంద స్వరూపుడివే. అయితే ఆ సంగతి నీవు మరచావు. నీవెవరో నీవు మరచావు. నిన్ను నీవు తెలుసుకోకపోవటమే నీ బాధలకు కారణం. కనుక ఇప్పటికైనా నీ కళ్ళు తెరచి నీవెవరో తెలుసుకో. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? శాస్త్రాలు చెబుతాయి. అయితే మనకు ఎన్నో శాస్త్రాలున్నాయి. భౌతిక శాస్త్రం,రసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం, జంతు శాస్త్రం, వైద్య శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం.. అని - ఇవన్నీ ఈ ప్రపంచాన్ని గురించి; ఇందులోని వస్తువులు, ప్రాణులు, విషయాల గురించి; దేహాదుల గురించి చెబుతాయే గాని నీ గురించి చెప్పవు. ఈ శాస్త్రాల ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా - ఎన్నిరకాల సౌకర్యాలు పొందుతున్నా - ఎన్ని నూతన వస్తువులు కనిపెడుతున్నా నీలోని అసంతృప్తి పోతున్నదా? శాశ్వత ఆనందం కలుగుతున్నదా ? లేదు. అందుకే ఈ శాస్త్రాలన్నీ మూగబోయిన చోట వేదాంత శాస్త్రం దర్శనమిస్తుంది.
జాగ్రదావస్థలో ఒక ప్రపంచం ఉన్నది. అది దృశ్యం. ఈ దృశ్యాన్ని చూచే వాడొకడున్నాడు. అతడే ద్రష్ట. కళ్ళు మూసుకొని నిద్రపోతే - ఈప్రపంచం కాస్తా అదృశ్యం. కొంతమంది కళ్ళు సగం తెరుచుకొనే నిద్ర పోతుంటారు. అంటే వారికి నిద్రలో కూడా ఈప్రపంచాన్ని వదిలి పెట్టటం ఇష్టం లేదేమో! అయితే వారికీ ఈ ప్రపంచం అదృశ్యమే, నిద్రించే వాడికి ఏ ప్రపంచం లేదు.
ఈ ప్రపంచాన్ని 'ఇదం' వస్తువు అంటారు. ఇది ఇది అని చూడబడేది. దానిని చూచే 'నేను' 'అహం' వస్తువును. జాగ్రదావస్థలో ఈ రెండూ ఉన్నాయి. అలాగే స్వప్నావస్థలో కూడా ఒక ప్రపంచం ఉంది. దానిని చూచే వాడు ఉన్నాడు. అంటే అక్కడా ఇదం అహం రెండూ వున్నాయి. అయితే సుషుప్తి సంగతేమిటి? అక్కడ ఏ ప్రపంచము లేదు. అంటే ఏ దృశ్యము లేదు. ఏమీ లేదు కనుక చూచే వాడొకడు ఉండే వీలులేదు. అయితే అక్కడ రెండూ లేకపోయినా రెంటికి ఆధారమైన 'తాను' ఉన్నాడు. అలా ఉండి ఉండకపోతే ఆ అనుభవాన్ని చెప్పటం గాని, మళ్లీ నిద్ర లేవటం గాని జరగదు గదా ! అయితే ఇక్కడే 'నేను'కు - 'తాను'కు మధ్యనున్న తేడా గ్రహించాలి.
'నేను' కొంతకాలం ఉండేది. తర్వాత పోయేది. జాగ్రదావస్థలో ఉంటుంది. సుషుప్తిలో ఉండదు. 'తాను' మాత్రం అన్ని అవస్థలలో ఉండే నిత్యసత్యం. 'నేను' అనగానే కొన్ని భావాలు, ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు, ఇష్టాఇష్టాలు ఉంటాయి. 'తాను'లో ఇవేవీ ఉండవు. 'నేను' రాకముందు ఎందరో ఉన్నారు. 'నేను' పోయిన తర్వాత కూడా ఎందరో ఉంటారు. కాని 'తాను' అనేది ఒక్కటే. తనకన్నా వేరే ఎవరూ ఎప్పుడూ వుండరు.
ఈ ప్రపంచం నేను తాను ఈ మూడింటి మధ్యనడిచే కథ ఏమిటో చూద్దాం. జాగ్రదావస్థలో ఒక ప్రపంచం, దానిని చూస్తూ తెలుసుకుంటూ ఉండే 'నేను' ఉన్నాను. అయితే నిద్రలోకి జారుకోవటంతో ఈ ప్రపంచమంతా చుట్టచుట్టుకొని నేనులోనికి పోతుంది. ఈ నేను 'తాను'లోనికి పోతుంది. ఇదే సుషుప్తి. మళ్ళీ జాగ్రత్త లోకి రావటంతో 'తాను'లో నుండి ఈ నేను లేస్తాడు. 'నేను'లో నుండి ఈ ప్రపంచం లేచి దర్శనమిస్తుంది. మారిపోతుండే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని చూచే నేను ను సర్వాన్ని ప్రకాశింపజేసేదే మార్పులు లేని ఈ 'తాను'. తాను నిత్యం - సత్యం - శుద్ధం - బుద్ధం - ముక్తం.
ఈ దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెంది, కర్మలు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ ఉండే జీవుణ్ణి 'నేను' (అహం) అనే పదంతోను ఈ జీవుడికి ఆధారమైన ఆత్మను - నిత్య - సత్య పరమాత్మ చైతన్యాన్ని 'తాను' అనే పదంతోను రమణ మహర్షి తెలియజేయడం జరిగింది. ఈ 'తాను' యే మన నిజస్వరూపం. మన నిజస్వరూపాన్ని తెలియజేసే జ్ఞానాన్నే 'ఆత్మజ్ఞానము' అంటారు. ఈ ఆత్మజ్ఞానము వల్లనే మన యదార్ధ స్వరూపం ఏదో తెలుస్తుంది. అలా మన స్వరూపం మనకు తెలిసి స్వస్థితిలో ఉండటమే మోక్షం. అదే శాశ్వత ఆనంద స్థితి. ఆత్మజ్ఞానం లేకుండా ఎన్ని
కర్మలు చేసినా మోక్షం లేదు. ఆత్మజ్ఞానాన్ని సందేశాల ద్వారా ఆదేశాల ద్వారా తెలుసుకొనే వీలు లేదు. కేవలం 'ఉపదేశం' ద్వారానే తెలసుకోవాలి. ఈ ఉపదేశాన్ని అందించేవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులందించే జ్ఞానాన్ని పిండి ఆసారాన్ని అందించేదే ఉపదేశసారం అనే గ్రంథం. ఈ ఉపదేశ సారాన్ని అందించింది సామాన్య పండితుడు కాదు, గ్రంథ పరిశోధన చేసిన కవీ కాదు. ప్రపంచానికి అతీతంగా - మనస్సుకు అతీతంగా నేనుకు అతీతంగా - తనలో తానుగా ఉంటూ, ఈ ప్రపంచంలో అందరి మధ్యన నడయాడిన ఆత్మజ్ఞాన సంపన్నుడైన ఒకమహాత్ముడు - మానవాతీత శక్తి - కదులుతున్న దేవాలయం - సాక్షాత్ భగవంతుడే అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షి. తన అనుభవాన్నంతా పిండి సారంగా అందించారు ఈ ఉపదేశసారమనే 30 శ్లోకాలు గల చిన్న గ్రంథంలో..!
Pdf ebook link : https://archive.org/embed/20250421_20250421_1028
No comments:
Post a Comment