Sunday, April 20, 2025

 *🌺 ఆదిత్య హృదయం విశిష్టత 🌺*

ప్రపంచములో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. ఇతర దేవతలు భావనాగమ్యులు. వారు భావనాశక్తితో ధ్యానించి ఆరాధించవల సినవారు. కనుక సామాన్యులకు సాధ్యం కారు. కాని ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని ప్రతివ్యక్తి ఆరాధించవచ్చు. సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశనూ, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకొని, తనను ఆరాధించేవారిని తగిన రీతిలో తరింపచేసే ఆదిత్యుని హృదయాన్ని వివరించే స్తోత్రరాజం -- ఆదిత్య హృదయం.

ఆదిత్యుడంటే సూర్యుడు. కాని సూర్యునికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు - అని ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను, శక్తి సామర్థ్యాలను వివరిస్తాయి. ఒక్కొక్క పేరులో ఒకానొక విశిష్టగుణం భాసిస్తుంది. వీటిలో ఆదిత్యనామం ఈ స్తోత్రకర్త అయిన వాల్మీకికి బాగా నచ్చింది. అందువల్లనే దీనికి 'ఆదిత్య హృదయం' అనే పేరు వచ్చింది. 

ఆదిత్యులు పన్నెండు మంది. వీరిలో విష్ణుపుకూడా ఒకడు. 'ఆదిత్యానా మహం విష్ణుః' - అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని చెబుతుంది. ఆదిత్యులలో ప్రధానస్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రమవటంచేత దీనికి ఆదిత్యహృదయ మనే పేరు సార్థకమయింది. దీనిని స్తోత్రమని చెప్పక హృదయమని చెప్పడంలో విశేషముంది. నిజానికి మనకు కావలసిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, స్థాయిని ప్రసాదించే పౌహార్దం, సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉన్నాయి.

No comments:

Post a Comment