హ్యాపీ టీచర్స్ డే...
రండి మీకు ఈరోజు అసలైన టీచర్ ను పరిచయం చేస్తాను.ఈ టీచర్ ఉన్నత పదవులను ఆశించలేదు.ఈ టీచర్ విద్యార్థుల చేత పల్లకీ మోయించాలని కోరుకోలేదు.
ఈ టీచర్ మన టీచర్ల లాగా వాట్సాప్ ఫేక్ న్యూస్ లను ఫార్వర్డ్ చేస్తూ ఇతర మతాల మీద విషం చిమ్మలేదు.ఈ టీచర్ మతతత్వాన్ని మోస్తూ , మూఢనమ్మకాల్ని ప్రవచించే సైన్సు టీచర్ కాదు.ఈ టీచర్ కు కనీసం మన టీచర్లలగా జీతం డీఏ కూడా లేవు.
ఈ టీచర్ అభంశుభం తెలియని ఆదివాసీ .ఈ టీచర్ తనకు తెలిసిన నాలుగు ముక్కలు పిల్లల మెదళ్లలోకి కాదు , మనసుల్లోకి ఎక్కించాలని ఐదేళ్లుగా తపన పడుతుంది.
ఈ టీచర్ పేరు " మాలతి ముర్ము" భర్త పేరు బాంకా ముర్ము.బెంగాల్ లోని పూరూలియ దగ్గరి జంగలి మహల్ ఆదివాసీ నివాస ప్రాంతం .పెళ్ళై అత్తగారింటికి వచ్చిన పద్దెనిమిదేళ్ల మాలతికి అక్కడి చిన్న పిల్లలు ఎవరూ స్కూల్ కు వెళ్లకపోవడం చూసి బాధపడింది.ఆ ఆదివాసీ పల్లెనుండి దగ్గరి స్కూల్ కు వెళ్లాలంటే చాలా దూరం.అక్కడికి ప్రభుత్వ టీచర్లు ఎవరూ ఎక్కువగా రారు.ఒక్క వాలంటీర్ వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాడు.ఆ ఊరి తల్లులు ఎలుగుబంట్ల భయానికి పిల్లల్ని ఊరిదాటి పంపడం మానేశారు.
ఇంటర్ వరకూ చదువుకున్న మాలతి పిల్లలందరినీ ఒక చోటుకు చేర్చింది.తన మట్టి గుడిసె దగ్గర ఒక ప్రక్కగా శుభ్రం చేసి నేల చదును చేసింది.మట్టితో అలికింది.భర్త బంకాతో టౌన్ నుండి కొన్ని పలకలు , బలపాలు ,చార్టులు తెప్పించింది.గోడను బ్లాక్ బోర్డుగా మార్చింది.తనే ఏ అకడమిక్ అడ్వైజర్ లు లేకుండా సిలబస్ డిజైన్ చేసుకుంది. ఒకటి నుండి ఐదవ తరగతి వరకూ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు తెప్పించింది.
ఇవన్నీ తన ఒడిలో నెలల బిడ్డతోనే చేసింది .ఎనిమిది మందితో మొదలైన ఈ మాలతి ముర్ము స్కూల్లో ఇప్పుడు 45 మంది పిల్లలు అక్షరాలు, లెక్కలు నేరుస్తున్నారు .
మాలతి ఎవరి సహాయం కోసం ఎదురు చూడలేదు.తనకు తోచిన విధంగా , స్వచ్ఛమైన మంచి మనసుతో , ఎలాంటి జీతభత్యాలను ఆశించకుండా పిల్లలకు లెక్కలు , సంతాలి, బెంగాలీ , ఇంగ్లీషు నేర్పిస్తుంది.సుమిత్ర మాడి అనే ఆ ఊరి తల్లి.. తమ ఆదివాసీ పిల్లలకు మాలతి టీచర్ వల్ల చదువుకునే అవకాశం కలిగింది అని సంతోషం వ్యక్తం చేసింది .
తన చీకటి గుడిసెలో.. ఙ్ఞాన సంపదతో అక్కడి నిరుపేద పిల్లల్లో వెలుతురులు పూయిస్తున్న మాలతి టీచర్ అభినవ సావిత్రి మాయి.ఏ స్వార్థం ఎరుగని ఈ మాలతి ముర్ము టీచర్ కు వేవేల నమస్సులు🙏🙏🙏
(ఈ టీచర్ గురించి తెలుసుకున్న మీడియా , యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాలతి ప్రస్థానం సెల్ఫ్ రిలియన్స్ మీద గొప్ప పాఠం అని కితాబును ఇస్తున్నారు.మాలతి టీచర్ స్కూల్ కు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం, అనేక సంస్థలు ముందుకొచ్చాయి)
Rajitha Kommu
No comments:
Post a Comment