Saturday, September 6, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   శ్రీరమణ మహర్షి అరుణగిరి మీద ఉన్న రోజులవి. తిరువణ్ణామలైలో ఉండే శేషాద్రి స్వామి అనే ఒక సిద్దపురుషుడు మహర్షిని చూడటానికి వచ్చారు. 
 
     శేషాద్రి స్వామి, మహర్షిని తదేకంగా చూస్తూ కొంతసేపు కూర్చున్నారు. శేషాద్రి స్వామి ఎవరివైపేనా కొంత సమయం చూస్తే చాలు; వాళ్ళ మనస్సులోని భావాల్ని ఇట్టే పసికట్టేవారు; అంతటివారు. కాని ఎంతో సేపు మహర్షి వంక చూసిన తర్వాత "మహర్షి ఏమి ఆలోచిస్తున్నారో తెలియటం లేదు!" అని అన్నారు. మహర్షి మాత్రం ఏమీ పలుకలేదు. 

  తరువాత శేషాద్రిస్వామి, మహర్షి ఇలా సంభాషించుకున్నారు.... 

శేషాద్రి   : 
అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తే ముక్తిని అనుగ్రహిస్తారు కదా!
మహర్షి : 
ఆరాధించేది ఎవరు? ఆరాధింపబడేది ఎవరు? ( ఎవరు ఎవరిని ఆరాధిస్తున్నారు? )
శేషాద్రి  :  
తెలియని సంగతి అదే కదా! ( బిగ్గరగా నవ్వుతూ )
         
   తర్వాత మహర్షి, శేషాద్రి స్వామితో అద్వైత సిద్ధిని గురించి కొంతసేపు మాట్లాడారు.

అందుకు శేషాద్రి స్వామి "ఏమో! నేనేమీ అనలేను. నేను మాత్రం అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తుంటూనే ఉంటాను" అని అంటూ శేషాద్రి స్వామి అరుణగిరి శిఖరంవైపు తిరిగి అనేకసార్లు సాష్టాంగ ప్రణామాలు చేసి వెళ్ళిపోయారు.

   శేషాద్రి స్వామి తన వద్దకు వచ్చే ఒక భక్తునికి సాధన గురించి చెప్తూ ఇలా సెలవిచ్చారు ...

  "నాయనా! నా సంపాదన వెయ్యి రూపాయలు. నా తమ్ముని(మహర్షి ) సంపాదన పదివేల రూపాయిలు. కనీసం నీవు వంద రూపాయలు అయినా సంపాదించవా!"

No comments:

Post a Comment