Saturday, September 6, 2025

 ఇంటింటా స్వంత గ్రంధాలయం!

2002 లో సికింద్రాబాద్ లో స్వంత ఇల్లు"సూర్య వీణ" కట్టుకున్నాను,అది ఇల్లు కాదు నా స్వంత గ్రంథాల యం .నా ఇంటిలో గ్రంధాలయం లేదు,నా గ్రంథాలయం లోనే నా ఇల్లుంది! అపురూపమైన 40వేల పైన పుస్తకాలతో!

 మా ఇంట్లో లక్ష పుస్తకాలు పెట్టుకోడానికి వసతి ఉంది! నేను పుస్తక లక్షాధికారిని అవుతాను. మా ఆవిడ లక్ష వత్తుల నోము నోచుకుంటే,నాకు లక్ష పుస్తకముల నోము నోచుకోవాలని ఉంది. అది ఎప్పటికి తీరుతుందో!
  

నాకు నిజామాబాద్ లో స్వంత డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది. దానిలో కొన్ని వేల పాత వార,మాస,త్రైమాసిక పత్రికలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యేక సంచిక లున్నాయి!పుస్తకాల, పత్రికల కోసమే ఆ ఇల్లు! 3 నెలలకు ఒకసారి వెళ్ళి దానిలో స్టే చేస్తాము!

నా పుస్తకం ఎవరైనా ముట్టుకుంటే చాలు నేను కాట్ల కుక్కలా గొంతు చించుకొని గట్టిగా అరుస్తాను!మా ఇంట్లో పుస్తకాలంటే హడల్! నా పుస్తకాలను మా ఇంట్లో ఎవరైనా తిడితే నన్ను తిట్టిందాని కంటే ఎక్కువ, అగ్గిరాముడై పోతాను! మా పని మనుషులు అస్తవ్యస్తంగా ప్రతి చోటా పడి ఉన్న పుస్తకాలను భయం భయంగా చూసి జాగ్రత్త చేస్తారు!

ఏ పుస్తకం అడిగినా లేదనే నమ్మ పలుకుతాను. రీసెర్చ్ స్కాలర్ లకు పుస్తకాలు చూపను, వాళ్ళు అరువు పట్టుకెళ్ళిన పుస్తకాలు తిరిగి వాపస్ ఇవ్వరు, పర పుస్తక భుక్కులు, పరాన్న భుక్కుల లాగా!పుస్తకం తీసుకెళ్లేటప్పుడు ఉన్న శ్రద్ధ, అక్కర తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు! ఆ పుస్తకాలు తమ ఇంట్లోనే ఉంటే వాటికి ఎక్కువగా మేలు జరుగుతుందని వారు భావిస్తారు!

నేను డబ్బు అప్పు అడగను,అప్పు ఇవ్వను! పుస్తకాలు అరువు అడగను, అరువు ఇవ్వను! అరచి గీ పెట్టినా సరే చిట్ ఫండ్స్ లో, ఫైనాన్స్ కంపెనీలలో ఎవ్వరికీ డబ్బుకు హామీ పడను! ఎవరికైనా అర్హులకు డబ్బు దానం ఇస్తే ఇస్తానేమో కాని పుస్తకాలు మాత్రం ససేమిరా దానం ఇవ్వను! 

పుస్తకం నూరేళ్ళ పంట! పుస్తకమే నా బలం, నా బలహీనత! పుస్తకాలే నా బలగం! ఇప్పటికీ విరివిగా గంటలు గంటలు పుస్తక పఠనంలో సమయం తెలియకుండా క్షణాల్లా గడిపేస్తుంటాను. పుస్తకంలో నిమగ్నమైతే నాకు ఆకలి దప్పులు గుర్తుకు రావు! పఠనం నా కొక వ్యసనం, యజ్ఞం,దురద, గోకుడు! నాది ఏనుగు దాహం! పుస్తకం తిరగేసి మరగేసి విషయం కొంచెం రుచి చూసి కొంటాను కాని దాని వెల చూడను. ఒక పుస్తకాల గుట్ట కొంటున్నప్పుడు షాప్ వాళ్ళు నేను అడక్కుండానే మంచి డిస్కౌంట్ ఇస్తారు! ఇప్పటికీ కొత్త పుస్తకాలు కారు నిండుగా పరమానందంగా కొని తెచ్చుకుంటాను! మళ్లీ మళ్లీ చదువుకొని, చదువుకుని ఆనందిస్తాను, కొత్త పుస్తకం వాసన నాకు ఎంతో ఇష్టం. కాని ఇపుడు పాత సెకండ్ హాండ్ పుస్తకాలు కొనడం లేదు,నాకు డస్ట్ ఎలర్జీ ఉంది!

పుస్తకాలు రాసి,నా పుస్తకాలు అచ్చువేయడం కంటే , ఇతరులు రాసిన పుస్తకాలు కొని చదవడమే ఎక్కువ ఇష్టం! ఇన్నేళ్లలో ఒక 15 పుస్తకాలు వేసానేమో అంతే! నేనేది వేసినా ఇంతవరకు వెయ్యి ప్రతులు వేసాను.3 పుస్తకాలు పునర్ముద్రణలు కూడా వేసాను! ఇపుడు 200 ప్రతులే వేసుకుంటున్నారట, అలా నాకు నచ్చదు! వేస్తే వెయ్యే వేసాను,నా డబ్బు నా ఇష్టం! వద్దనడానికి మీరెవరు!?

ఒక్కొక్కసారి నిజామాబాద్ లోని ఏదైనా లైబ్రరీకి నా పుస్తకాలు విరాళంగా ఇచ్చేద్దామనుకుంటాను,కాని ఇప్పుడే ఏమంత తొందరొచ్చిందని, నాకింకా 80 ఏళ్లే  కదా 90ఏళ్లు వచ్చిన తర్వాత ఇవ్వడం గురించి అప్పుడు ఆలోచించవచ్చనుకుంటున్నాను! ఇది వందేళ్ళ దాకా కదిలే ఘటం కాదు! ఒక వేళ నేను పోయినా పుస్తకం చదువుకుంటూనే పోతాను, నాకే తెలియకుండా! అయినా చేతిలో తెలుగు పుస్తకం లేకుండా యమ ధర్మ రాజుకైనా సరే మా ఇంట్లోకి ప్రవేశం ఉండదు!

No comments:

Post a Comment