Wednesday, April 13, 2022

నేటి జీవిత సత్యం. మన ఆలోచనలు ఎక్కువగా నేను-నాది అనే రెండు విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. వాటిలోనే సుఖం, దుఃఖం పొందుతూ ఉంటాయి.

నేటి జీవిత సత్యం.

మానవులకు ఆలోచించడం అత్యంత సహజమైన ప్రక్రియ. ఆలోచించగలిగే బుద్ధిజీవి మనిషే. అదే అతడికి శాపం, వరం కూడా.
మన ఆలోచనలు ఎక్కువగా నేను-నాది అనే రెండు విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. వాటిలోనే సుఖం, దుఃఖం పొందుతూ ఉంటాయి.

మనిషికి అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యమైనది ‘నేను’. ‘నేను’ను ప్రేమించినట్లు ప్రపంచంలో ఎవరినీ ప్రేమించలేడు. నేనులో సర్వ సుఖాలున్నాయి మనిషికి. ఆ నేను అతడిని ఏడిపించినట్లు మరే భావం ఏడిపించదు.
కాని, ఆ నేనును వదలలేడు. నేనుతో ప్రపంచం ఉదయిస్తుంది. నేనుతోనే జీవితం సాగుతుంది. నిద్రపోయినప్పుడు నేను అణుగుతుంది. అక్కడా మత్తులో మరో జగత్తును సృష్టించుకుంటుంది.

నేనులో ఎన్నో రంగు రంగుల ఇంద్రధనుస్సులు ఉన్నాయి. నేనులో అంధకార బంధురాలున్నాయి. నేనులో సూర్యచంద్రులున్నారు. నేనులో ప్రకృతి ఉంది. నేనులో వికృతి ఉంది. నేను అనేది ఏడేడు పద్నాలుగు లోకాలకు అనుసంధానమై ఉంది.
నేను అణువణువునా ఉంది. నేను బృందావన విహారి వేణువై ఉంది. నేను సర్వజీవులను కలిపే అంతస్సూత్రంగా ఉంది.

నేను వేదికగా ప్రపంచ భ్రమణం జరుగుతోంది. నేను లోంచి బయటకు రాలేడు మనిషి. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మన శరీరం.
అన్ని నామస్మరణలకంటే, నామ జపాలకంటే ‘నేను’ స్మరణ చాలా గొప్పదని అన్నారు అరుణాచల రమణ.
నేను అనేది దేహంలో ఎక్కడుందో కనుక్కుని, ఆ అహం స్ఫురణకు తెచ్చుకోవడమే సాధకుడు చెయ్యాల్సిన పని అనీ ఆయన చెప్పారు.
మరి మనం ప్రతిరోజూ నేనుతోనే ఉంటున్నామే. ప్రతి క్షణం దానితోనే బతుకుతున్నాం. కాని అది నేను అని తెలియడం లేదు. అదే పెద్ద గమ్మత్తు!
తెలిసి చేస్తే నేను శిఖరాగ్రానికి తీసుకుపోతుంది. తెలియకపోతే అట్టడుగున ఉంచి అహంకారిగా మారుస్తుంది.

కొన్ని రోజులు మన గురించి మనం ఆలోచించడం మానేసి పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి విశ్రమించే వరకు ఇతరుల బాధలు, సమస్యలు, వాళ్లకేదైనా మంచి చేద్దామనే ఆలోచన ఉంటే... అప్పుడెలా ఉంటుంది?
అలా చెయ్యడం మొదలుపెట్టిన మరుక్షణమే మన మనసు సరిఅవుతుంది. మన సమస్యల్ని మనం మరచిపోతాం. మానసిక రుగ్మతలు పక్షుల్లా ఎగిరిపోతాయి. ఎటువంటి కుంగుబాటూ ఉండదు. అసలు మన గురించి మనం ఆలోచించడానికి తీరికే లేకపోతే ఆ మనిషి సమాజానికి ఎంతో అవసరం అవుతాడు. అతడే విశ్వానికి మిత్రుడు. ఆ ఆనందం పరుల కొరకు పాటుపడే వారికే తెలుస్తుంది. దీనికి మించిన మందు కుంగుబాటుకు లేదంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు.

ప్రతిరోజూ మన జాబితాలో రాసుకుని తెలిసినవారికో, తెలియని వారికో ఓ నలుగురికి మాటసాయమో, మంచి సాయమో చేసి వారి ముఖాల్లో ఆనందం కనిపించేలా చేయాలని కంకణం కట్టుకుంటే, అంతకుమించిన ఆనందం మనిషికి ఉండదు.

నేనును మెల్లమెల్లగా వదలాలి. అసలైన నేనును పట్టుకోవాలంటే ఆ నేను అందరిలో ఉందని తెలుసుకోవాలి. ఎవరి మనసునీ ఎట్టి పరిస్థితుల్లోనూ గాయపరచకూడదు. నేను చాలా సున్నితమైనది. నేను చాలా దృఢమైనది కూడా.

నేను నేనైన నేను అని ఒక మహాభక్తురాలు జీవితమంతా సాధన చేసి చెప్పారు. చిన్న నేను శరీరానికి సంబంధించినది. అది వదులుకుని, లోకమంతా వ్యాపించిన ‘నేను’ను పట్టుకోవాలి. అదే అహం బ్రహ్మాస్మి!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment