Sunday, March 2, 2025

 *హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు -17*
🤟

రచయిత : స్వామి జ్ఞానానందగిరి మహరాజ్.


*క్రియా తపస్సు -1*
🤘

తపస్సు అనగా నిరంతర సాధన, సాధన లో ముక్తికై పరితపించుటే తపస్సు. తపస్సుకు మౌనమెంతో సహకరించును. ఈ జన్మలోనే కడతేరాలి ముక్తి పొందాలనే సాధకుడు నిరంతర క్రియా సాధనే (గొప్ప తపస్సు) నిరంతరం చేస్తుండాలి. 

తెల్లవారుజాము ఉ॥3గం||ల నుండి 6 గంటల వరకు సా|| 6 గంటల నుండి 9 గంటల వరకు నిరంతర క్రియా చేయాలి. శుద్ధ సాత్విక శాఖాహారమే తీసుకోవాలి. నూనెలు, మసాలలు లేని శుద్ధ తేలిక ఆహారమే తీసుకోవాలి. సెలవు దినాలలో ఎక్కువ సాధన చేయాలి. 1 నెలకు 3 రోజులు పగలు రాత్రి నిరంతర అఖండ క్రియాధ్యానము చేయాలి. మౌనం సాధనకి ఎంతో మేలు చేయును. మనస్సులో ఏది తలచరాదు. సమయం ఆదా అవును, శక్తి ఖర్చు కాదు, ఎక్కువ మాట్లాడిన ఎక్కువ ఆహారం తీసుకోవలసివచ్చును. సాధకుడు ధ్యానానికి ప్రత్యేక గది ఏర్పరుచుకోవాలి, లేనిచో కార్డ్ బోర్డ్ అట్టలతోనే ఇంట్లో ఓ మూలకు కూర్చొనే అంత గది నిర్మించుకొని పైన ఖాళీగా ఉంచాలి. 

ధ్యానంలో ఉన్నప్పుడు పెంపుడు జంతువులు గాని, చిన్న పిల్లలు గాని, స్నేహితులు గాని, ధ్యానాన్ని భంగం పరచరు. లోపల చిలుకు పెట్టుకోవాలి, లైటు ఫ్యాను, ఆఫ్ చేయాలి. హఠయోగం లో ప్రాణయామలో చెమటలు పడితే కనిష్టము, శరీరంలో ప్రకంపనలు జరిగితే మధ్యమం, శరీరం గాలిలోకి లేస్తే ఉత్తమ ప్రాణయామము. కాని క్రియలో సహజ ప్రాణయామ ఎంతో మేలు చేయును. శ్రమలేదు, శ్వాసని లోపల బంధిస్తే అంతర కుంభకము, గాలిని బైటికి విడచి ఖాళీగా ఉంటే బాహ్యకుంభకము, శ్వాస తీసుకోక వదలక తెరిచి ఉంటే కేవలకుంభకము అందురు. 

నిరంతర సాధనతోనే కేవలకుంభకం అబ్బును. దీనితో నిర్వికల్ప సమాధి సిద్ధించును. ఒకే సమయంలో ఒకే స్థలంలో సాధన చేయడంతో స్థలం పవిత్రమవును. ఆ సమయంలో శ్రమలేకనే మనస్సు అంతర్ముఖమవును. దర్భచాప పై మందం దుప్పటి దానిపై తెల్లని వస్త్రం వేసుకొని వీలైనంత తక్కువ బట్టలు వదులువి ధరించి శరీరం, మెడ, తల, వెన్నెముక నిటారుగా ఉంచి, శరీరంలో ఎలాంటి బిగింపులు లేకుండా, శరీరంను సహజంగా ఉంచి సాధన చేయాలి. సాధకుడికి బ్రహ్మ చర్యం చాలా సహకరించును. గృహస్తులు ఇద్దరు సాధకులైతే నెలకు రెండుసార్లు కలిసిన చాలును, దీనితో మనోవికారాలు పోయి మనస్సు తృప్తిచెంది అన్ని విషయాల పైకి మనస్సు వెళ్ళదు. 

అగ్నిలో కట్టెలు వేసేకొద్ది మండునే కాని చల్లారదు. కట్టెలు వేయకున్న చల్లారును. అలాగే కోరికలు ఎన్ని అనుభవించినా పెరుగునే కాని తగ్గవు. ఇది తెలివైనవారు గమనించి అనవసరంగా కోరకున్న కోరికలు ఉండవు. సాధకుడికి వివేకంతో కూడిన వైరాగ్యము ఎంతో మేలుచేయును. ఈ ప్రపంచం, ఈ శరీరం కనిపించేవన్నీ  అశాశ్వతాలని మళ్ళీ మళ్ళీ స్మరించడంతో మనస్సు వాటి పైకి పోకుండా నిల్చును. బ్రహ్మచర్య పాలనతో శరీరం దృఢంగా అయ్యి ఆసనసిద్ధి లభించును. శరీరం, ఆకలి, దప్పిక, నిద్ర, శ్రమ తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండును. 

సాధకుడు ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, ఎక్కువ చేదు, ఎక్కువ వగరు, ఎక్కువ తీపి, ఎక్కువ పులుపు, ఎక్కువ వేడి పదార్థాలు భుజించరాదు, ఎక్కువగా తినరాదు, ఖాళీగా ఉండరాదు, మధ్యస్థం గా తినాలి. పొట్టని 4 భాగాలు విభజిస్తే సగ భాగం భోజనంచే, పావు భాగం నీటిచే నింపి, పావుభాగం శ్వాస తీసుకొనుటకు ఖాళీగా ఉంచాలి. ఎక్కువ నిద్ర, ఎక్కువ శ్రమ చేయరాదు. అన్నింటిలో మధ్యయ మార్గం అనుసరించాలి. శరీరం నీరసంగా మారినచో ఒక ముద్ద ఆహారం పెంచాలి. శరీరం బద్దకంగా తయారైన ఒక ముద్ద ఆహారం తగ్గించాలి. ఈ మార్పులు ఎవ్వరు చెప్పనక్కరలేదు. మన శరీరమే మనకు చెబుతుంది. ఈ విషయంలో ఎవరికి వారు చూసుకోవాలి. సాధనకు అతినిద్ర, అతి భోజనం, అతి శ్రమనే విఘ్నములు. 

భోజనం చేసిన వెంటనే సాధన చేయరాదు. ఎక్కువ అలసిపోయిగాని, బాగా ఆకలితో ఉండిగాని, మలమూత్రా లని బలవంతంగా ఆపిగాని, కోపంగా ఉండిగాని క్రియాధ్యానము చేయరాదు. ఎవ్వరికి చెడుతలుపరాదు. పైగా అందరి మేలు కోరుకోవాలి. ఒకరికై క్రియను చేయరాదు. ఎవ్వరి ముక్తికై వారే క్రియ ఆచరించాలి. క్రియ చేసిన క్రియా ద్వారా రక్షణ పొందుతారు. ఎన్ని దు:ఖాలున్నా క్రియా ద్వారా తొలుగుతాయి. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా క్రియా ద్వారా తొలుగును. మీకు ఆరోగ్యంతో పాటు ఆత్మ జ్ఞానముని, ముక్తిని నిరంతర క్రియా ప్రసాదించును. మీలోని దుర్గుణాలని తొలగించి సద్గుణాలని వృద్ధిపరుచును. మనస్సు దృష్టి ఎల్లవేళల మీ ఆజ్ఞయ చక్రముపై ఉంచి ఏ కార్యం చేసిన ఫలించును, శాంతినిచ్చును. 

ఆజ్ఞయ చక్రంలో మనస్సు ప్రాణం నిల్పుటే పుణ్యం, ఎందుకనగా అప్పుడే మనస్సు స్థిరంగా ఉండును. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు అన్నీ మంచి పనులే జరుగును. ఆజ్ఞయ చక్రంపై మనస్సు నిల్పనిచో పాపము. అప్పుడు మనస్సు చంచలంగా ఉండి చేయరాని పనులు చేయును. నిరంతరం క్రియాధ్యానం చేసే వారికి ఎన్నో విఘ్నాలు వచ్చును. వాటికి జంకరాదు. మొదలు విషం లాగ కష్టంగా తోచును. మనస్సు నిలువదు, నిరంతర సాధన చేస్తురాగా, అమృతంగా మారి ఆత్మ సుఖమిచ్చును. దేవతలు పాల సముద్రం చిలుకగానే విషమే వచ్చింది. తర్వాతనే అమృతం వచ్చింది. కష్టాలకు భయపడితే లాభం ఉండదు. మొదలు కష్టం తర్వాతే సుఖము, సాధకుడికి రోగం, బాధ, దుఃఖం ఏది వచ్చిన భయపడరాదు. 

విఘ్నదేవతలు ఎన్నో పరీక్షలకిగురిజేతురు. ఎంతో డబ్బు వచ్చుట, ప్రమోషన్ వచ్చుట, గొప్ప సాధకుడని లోకం పొగడుట, డబ్బు, స్త్రీలపై ఆశ వదిలి దొరికినదానితోనే చేసే వృత్తిలోనే తృప్తి చెందుతూ సాధన చేయాలి. దివ్య లోకాల నుండి దేవతలే వచ్చి నీవు గొప్ప యోగీశ్వరుడవు, నీవు వచ్చి మాలోకాన్ని పవిత్రం చేయమందు రు. అహంకరించిన చెడెదరు. అప్పుడు సాధకుడు వినయంగా దేవతలకి నమస్కరించి నేను ఏదో చిన్న సాధకుడిని దయచేసి నన్ను వదలండి ఎలాగో వచ్చారు నన్ను ఆశీర్వదించండి అని వేడుకోవాలి. అభిమానం, అహంకారం, రాగద్వేశాలు, లోభం, హింసావృత్తి సాధకుడు సంపూర్ణంగా విడువాలి. నీవెంత సాధన చేసినప్పటికీ నేను అందరికన్నా చిన్నవాడిని, అందరికి దాసుడని అనుకోనిచో నీ సాధనంతా వృధా అవును. ఏదో కోణంలో సాధకుడిని నేను గొప్ప సాధకుడననే అభిమానం ముంచివేయును. జాగ్రత్తగా గుర్తించి వెంటనే దానిని తీసివేయాలి. 

క్రియా యోగి మహా ముద్రచే మూల గ్రంధి భేదనం, నాభిక్రియచే హృదయ గ్రంధి చేదనం, ఖేచరి ముద్రచే జిహ్వాగ్రంధి భేదనం చేయును. మూడు గ్రంథులు ఛేదించుటే ముక్తికి సులభ మార్గము, మహాముద్రచే అపానవాయువు, నాభి క్రియచే వ్యానవాయువు, ఉదానవము, ప్రాణయామచే ప్రాణవాయువు, సమాన వాయువు ఆధీనంలోకి వచ్చును.  

ఐదు విషయాలలో ప్రపంచ జీవులన్నీ బంధింపబడినాయి. ఈ ఐదు విషయాలు క్రియా యోగికి లోపలే ఎంతో సుఖాన్ని ఇచ్చును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, భేచరి ముద్రలో యోగికి మూడు సుఖాలు లభించును. నాలుకని కొండనాలుక దగ్గర చేర్చినప్పుడు ఎన్నడు అంతమెత్తని పదార్ధము తాకని గొప్ప మధురమైన స్పర్శా సుఖం యోగికి లభించును. ఇక భౌతికమైన స్పర్శ సుఖం యోగి కోరడు. నాలుకని కొండ నాలుక వెనకాల కంఠబిలములో చేర్చినచో పైన ఉన్న ముక్కు రంధ్రాలని నాలుకతో మూయడంతో యోగికి సహస్రారంలోని అమృతం నోట్లోకి జారును. ఇది తియ్యని తేనెలాగ మధురంగా ఉండును. దీనితో యోగికి తినడం అనడం తగ్గును. దీనికంటే రుచి ఏది లేనందున వేరే రుచులు కోరడు. అమృతం త్రాగిన వారికి అంబలి (జావ) అక్కర లేదు. ఎల్లవేళల భేచరిలో ఉన్న యోగి నోట్లో నుండి గొప్ప సుగంధ వాసనలు వెలువడును. ఇంతకన్న గొప్ప సువాసన నేను పీల్చుకొనేది లేదని యోగి తృప్తి చెందును. 

ప్రాణం అపానం, అనాహతచక్రం హృదయంలో సమానపరచడంతో అనాహత నాదం యోగి హృదయంలో పుట్టును. పదిరకాల నాదాలు పుట్టి సముద్ర ఘోష, డప్పులు, వేణువు, కింకిణి, శంఖం, మృదంగం, తాళాలు, దీర్ఘ ఘంట ఇలా పది రకాల వాయిద్యాలు ఒక నెల వరకు వినిపించి చివరికి కంచుగంటని కొట్టి వదిలిపెడితే వచ్చే సుదీర్ఘమైన గొప్ప ఘంటానాధం యోగి హృదయంలో ఎల్లవేళల మ్రోగుచుండును. ఈ నాదం ఒక్కసారి పుడితే యోగి దేహం ఉన్నంత వరకు ఉండును. దేహం వదిలితే పోవును. ఈ నాదంలో తృప్తి చెందే యోగికి వేరే శబ్దములు వినుటకు ఇష్టం ఉండదు. 

యోగి మూలాధారం నుండి ప్రాణశక్తి, కుండలిని శక్తి ఆజ్ఞయ చక్రంలో స్థిరపరిచిన మొదలు సూర్యునిలాగ ఎర్రని బంతిలాగ, మధ్యాహ్న సూర్యునిలాగ, కాంతి పెరుగుతూ వచ్చి చివరికి కోటి సూర్యల తేజం ఆజ్ఞయ చక్రంలో దర్శనమిచ్చును. ఇదే ఆత్మ సూర్యుడు, యోగి ఎంతో తృప్తి చెంది బ్రహ్మానందం అనుభవించును. అంత కాంతి కన్నులతో కాదు హృదయం అంతరంగంతో చూచును. ఈ  ప్రపంచంలో నిది ఏది చూచుటకు యోగికి ఇష్టం ఉండదు అనాసక్తి ఏర్పడును. ఏ పని చేసిన ఆసక్తి లేకనే అన్ని చేయును. 

పై అనుభూతులన్ని సవికల్ప సమాధిలోని అనుభూతులు. నిర్వికల్ప సమాధిలో అవి అన్నీ లయమవును. శబ్దం నుండి అశబ్దం, స్పర్శం నుండి అస్పర్శం, రూపం నుండి అరూపం, రసం నుండి అరసం, గంధం నుండి అగంధంగా అనగా అవి ప్రారంభం లో కొంత ఆనందాన్నిచ్చి అవి కూడా లయం చెందును.
🪷
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

*తెలుగు భాషా రక్షతి రక్షితః*

No comments:

Post a Comment