అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-455.
4️⃣5️⃣5️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*37. వ శ్లోకము:*
*“యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ll*
*తత్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధిప్రసాదనమ్ll”*
“మొదట్లో అత్యంత కష్టంగా ఉండి, విషము మాదిరి తోచి, తరువాత అనంతమైన అమృతముతో సమానమైన సుఖము, తనలో ఉన్న సాత్త్విక బుద్ధి వలన కలిగే సుఖం వీటిని సాత్విక సుఖము అని అంటారు.”
```
అధ్యాత్మ సాధన నుండి మొదలు పెడదాము. ముందు ప్రాణాయామము, భక్తి, శ్రద్ధ, సాత్వికాహారము, మంచి నియమాలు అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తుదకు అదే అనంతమైన అమృత తుల్యమైన సుఖాన్ని ఇస్తాయి. ఆ సుఖం ఎక్కడి నుండో రాదు. మనలో ఉన్న సాత్త్విక బుద్ధి వలన వస్తుంది. కాబట్టి సాధన మొదట్లో కష్టంగా ఉందని మానకుండా నిరంతరం కొనసాగించాలి. విషమివ అని అన్నారు కానీ విషం అనలేదు. మొదట్లో విషం మాదిరి తోస్తుంది. అంటే చాలా కష్టంగా ఉంటుంది. దానికి భయపడకూడదు. ఈ ఆత్మ సాధనకు మన పూర్వజన్మ వాసనలు అనేక విఘ్నాలు కలుగచేస్తాయి. మనసును అటు ఇటు మళ్లిస్తాయి. వాటికి లొంగకుండా సాధన చేస్తే అనంతమైన సుఖం మీ సొంతం అవుతుంది.
ఏదైనా వ్యాధి వచ్చింది. చేదు మందు, సూది మందు, ఆపరేషన్ ఇవన్నీ చేస్తారు. వాటికి భయపడి పారిపోతే రోగం ముదురుతుంది. ముందు ఇవన్నీ కష్టంగా ఉన్నా, తుదకు జీవితాంతం సుఖాన్ని కలుగచేస్తాయి. అలాగే విద్యార్థులు సంవత్సరం అంతా నియమం ప్రకారం చదవడం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కాని తుదకు పరీక్షలలో మంచి మార్పులు వచ్చి సంతోషాన్ని కలుగచేస్తాయి. అలాగే అధ్యాపకుడు సంవత్సరం అంతా కష్టపడి పాఠాలు చెబితే, జీవితాంతం ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని దేవునిలాగా పూజిస్తారు. దీనితో విద్యార్థులకు విద్య వస్తుంది. ఉపాధ్యాయునికి గౌరవం లభిస్తుంది. అలాగే ఉద్యోగి రోజంతా కష్టపడి పని చేస్తే, ఆ ఉద్యోగికిపై అధికారి మెప్పు, జీతంలో పెరుగుదల, పదోన్నతి లభిస్తాయి. ఇవన్నీ మొదట్లో కష్టంగా ఉంటాయి. అంతంలో సుఖాన్ని కలుగచేస్తాయి.
దీనికి మంచి ఉదాహరణ మనకు భాగవతంలో ఉంది. దేవతలు దానవులు పాలసముద్రమును మధించారు. ముందు హాలాహలం అంటే విషం పుట్టింది. కాని వారు అధైర్యపడలేదు. ఆ విషాన్ని మహాశివుడు సేవించాడు. దేవదానవులు వారి కృషి కొనసాగించారు. అమృతం పుట్టింది. మనలో ఉన్న మంచి చెడు దేవతలు దానవులు వాటిమధ్య జరిగే ఘర్షణ పాలసముద్రం చిలకడం. ముందు కష్టాలు వస్తాయి. ఓపికగా భరించాలి. కష్టాలను భగవంతునికి అర్జించాలి. తుదకు అనంతమైన సుఖం లభిస్తుంది. మనం చేసే కృషిని మంధర పర్వతం కింద ఉన్న కూర్మావతారంలో ఉన్న పరమాత్మ పర్యవేక్షించినట్టు, మనలో అంతర్లీనంగా ఉన్న అత్మస్వరూపుడు పర్యవేక్షిస్తుంటాడు. ఈ భావనతో సాధన చేస్తే, సాత్విక సుఖం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకంలో విషము, అమృతము అనే పదాలు వాడారు. క్షీరసాగర మధనంలో మొదట పుట్టింది విషం, తరువాత పుట్టింది అమృతం అని సూచన ప్రాయంగా చెప్పాడు కృష్ణుడు. కాబట్టి సుఖ దుఃఖములు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. సుఖం నిర్మలమైన మనసులో ఉంటే, దుఃఖం మలినమైన మనసులో ఉంటుంది. అందుకే వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి మోక్షం గురించి చెబుతూ ఇలా అన్నాడు... ```
*”న మోక్షో నభసః పృష్ఠే పాతాలే నచ భూతలే మోక్షోహి చేతో విమలం సమ్యగ్జా నవిభోధితం.”*```
మోక్షం ఆకాశంలో కానీ, ఆకాశం అవతల కానీ, పాతాళంలో కానీ, లేక భూలోకంలో కానీ ఎక్కడా లేదు. నీయొక్క విమలమైన జ్ఞానంలో ఉంది. నీ సాత్త్వికమైన మనసులో ఉంది. నీవు ఇతరులకు మంచి చేస్తే నీ మనసు ఆనందంతో నిండి పోతుంది. నీవు ఇతరులకు చెడు చేస్తే
నీ మనసు గిల్టి ఫీల్ అవుతుంది. కాబట్టి విమలమైన జ్ఞానమే సుఖానికి మొదటి మెట్టు. ఈ జ్ఞానం సంపాదించడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ధ్యానము, శాస్త్రములు చదవడం, నిష్కామకర్మ, కర్మఫలత్యాగము పాటించాలి. ఇవన్నీ మొదట్లో కష్టమే, కానీ ఆఖరుకు ఇవన్నీ అమృతముతో సమానమైన ఆనందం కలుగజేస్తాయి. అప్పుడే మనలో ఉన్న దుఃఖమునూ అంతం ఔతుంది. ఇటువంటి సుఖమును సాత్త్విక సుఖము అని అంటారు.’✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment