Wednesday, March 26, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-456.
4️⃣5️⃣6️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
________________________
*38. వ శ్లోకము:*

*”విషయేన్ద్రియసంయోగా ద్యత్తదగ్రేఽమృతోపమమ్l*
 *పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ll”*

“విషయవాంఛలతోనూ, ఇంద్రియ సంయోగముతోనూ కలిగే సుఖములు మొదట్లో చాలా హాయిగా, ఆనందంగా, అమృతముతో సమానంగా ఉంటాయి కాని వాటి పరిణామాలు మాత్రం అత్యంత దుఃఖమును కలిగిస్తాయి. అవే సుఖములు విషము మాదిరి కనిపిస్తాయి. వీటిని రాజస సుఖములు అని అంటారు.”
```
‘తరువాత రాజస సుఖమును గురించి వివరిస్తున్నాడు పరమాత్మ...

రాజస సుఖము ధనము, ఆస్తి, పదవి, హోదా రావడం వలనా, ఇంద్రియముల సంయోగము అంటే కలయిక వలన, ప్రాపంచిక సుఖముల కొరకు చేసే పనుల వలన కలుగుతుంది. ఆ సుఖం మొదట చాలా సుఖంగా ఆనందంగా ఇష్టంగా అమృతంతో సమానంగా, ఇంకా కావాలి అనేటట్టు ఉంటుంది. తుదకు ఆ సుఖమే అనంతమైన దుఃఖంగా, విషంగా పరిణమిస్తుంది.

దీనికి సులభమైన ఉదాహరణ: మొదటి లడ్డు తింటే తియ్యగా, రుచిగా ఉంటుంది. రెండవది కొంచెం రుచి తక్కువగా ఉంటుంది. ఐదవ లడ్డు వెగటు పుట్టిస్తుంది. తరువాత లడ్డు విషంగా తోస్తుంది. రోగం తెస్తుంది. దుఃఖంగా పరిణమిస్తుంది. చేపలు పట్టేవాడు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతాడు. గాలానికి కట్టిన ఎరను చూచిన చేప, ఆ ఎర చాలా రుచిగా ఉంటుంది అని 
ఆ ఎరను పట్టుకోబోయి గాలానికి తగులుకొని ప్రాణాలు విడుస్తుంది. కాబట్టి చూచినదీ, విన్నదీ, తాకినదీ నిజము కాదు. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే. అదే తుదకు విషంగా పరిణమిస్తుంది.

పుట్టగానే భార్య భర్త విడి విడిగా ఉంటారు. కాల వశాత్తు వివాహం జరిగి వారు కలుస్తారు. కొంత కాలం తరువాత, మరణం వారిని విడదీస్తుంది. ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు. తరువాత వారు కూడా పోతారు. అలాగే సంతానము. పుట్టిన తరువాత కొంత కాలం తల్లితండ్రులతో ఉంటారు. తరువాత ఎవరికి వారు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. కాబట్టి వివాహం వలన కలిగే సుఖం, సంతానం వలన కలిగే సుఖం కూడా తాత్కాలికమే. శాశ్వతం కాదు. ఇంక ధనము, పదవి, హోదా గురించి చెప్పనవసరం లేదు. అవి మరీ తాత్కాలికము.

అలాగే విషయ సుఖములు కూడా తాత్కాలికమైనవి, మొదట్లో స్వర్గసుఖాలను మరిపిస్తాయి. కాని క్షణికమైనవి. అవయవముల కలయికతో లభించే సుఖం అవయవములు విడిపోతే అంతం అవుతుంది. మొదట్లో అమృతం లాగా తోచిన సుఖం తుదకు విషప్రాయం అవుతుంది. దీనినే రాజస సుఖం అంటారు. ఈ సుఖం పాలమాదిరి కనిపించే విషం. చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రాపంచిక విషయముల వలన కలిగే సుఖములు తుదకు దుఃఖంతో అంతం అవుతాయని తెలిసి సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజస సుఖం మనలను మోసం చేస్తుందనీ, పైపై మెరుగులు తక్షణ సుఖాలనుచూచి మోసపోవద్దనీ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణపరమాత్మ.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాత్విక సుఖం మొదట్లో విషం మాదిరి ఉండి, తుదకు అమృతంగా పరిణమిస్తుంది. అలాగే రాజస సుఖం మొదట్లో అమృతం మాదిరి ఉండి తుదకు విషంగా పరిణమిస్తుంది. ఏ సుఖం కోరుకోవాలో మన ఇష్టానికి వదిలేసాడు.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment