అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-457.
4️⃣5️⃣7️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*39. వ శ్లోకము:*
*”యదగ్రే చానుబన్ధేచ సుఖం మోహనమాత్మనఃl*
*నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ll”*
“ఇంకా, తామస సుఖం సోమరితనం, అలసత్వము, నిర్లక్ష్యము, మత్తు పదార్థాలు సేవించడం, నిద్ర వీటి వలన కలుగుతుంది. ఈ తామస సుఖం మొదటి నుండి చివరి దాకా మనిషిని అజ్ఞానంలో మత్తులో ఉంచుతుంది. మోహాన్ని కలుగజేస్తుంది.”
```
‘సుఖాలలో నిద్రా సుఖం, సోమరిగా ఉండటంలో సుఖం, తిని కూర్చోడంలో ఉన్న సుఖం, ఇతరులను విమర్శించడంలో సుఖం, తనకు అంతా తెలుసు అనుకొని భ్రమ పడటంలో ఉన్న సుఖం ఈ సుఖాలన్నీ తామస సుఖాలు. కొంత మంది కూర్చునే నిద్రపోతారు. బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, స్కూలులో నిద్ర, ఇటువంటి వారి ప్రవృత్తి తామసము. ఇది ఒక రకమైన మోహము. వీరు ఏ పనీ సక్రమంగా చేయలేరు. ఒక వేళ చేసినా ఏ మాత్రం శ్రద్ధ లేకుండా, అమితమైన నిర్లక్ష్యంతో చేస్తారు లేకపోతే సగంలో ఆపేస్తారు. వాయిదాలు వేస్తారు. ఆఫీసులలో కూడా అధికారి ఇటువంటి వారికి పనులు చెప్పడు. చెబితే చెడగొడతాడని భయం. చేసే వాడికే అన్ని పనులు అప్పగిస్తారు. అందుకని ఈ తామసికుడు సుఖంగా నిద్రపోతాడు. లేకపోతే ఇయర్ ఫోన్లో పాటలు వింటూ, కాంటీన్లలో కాలక్షేపం చేస్తుంటాడు. సాత్త్విక, రాజసికుల మాదిరి వీడూ సుఖపడతాడు కానీ, ఇటువంటి సుఖం తామస సుఖం అంటారు. వీరి జీవితంలో పురోగతి ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత మాదిరి ఉంటారు. నిద్రగొట్టుముఖాలు, సోమరిపోతులు అనే పేరు తెచ్చుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోరు. మనలను కాదులే అని తుడిచేసుకుంటారు. వీరి జీవితం వ్యర్ధముగా గడిచిపోతుంది.
ఇప్పుడు అందరికీ ఒక సందేహము వస్తుంది. భార్యతో సుఖాలు అనుభవించకూడదా! నిద్రపోకూడదా! కోరిన వస్తువులను కొనుక్కొని సంతోషించకూడదా! అని అనుకుంటారు. అన్ని సుఖాలు అనుభవించాల్సిందే. అందులో తప్పులేదు. ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో అలా చేయాలి కానీ అదేపనిగా అదే పని చేయకూడదు. ‘అతి సర్వత్ర వర్ణయేత్’ ఏదైనా చూచినా, వినినా, తాకినా, అది మనకు అవసరమా అనవసరమా అని బుద్ధితో ఆలోచించి ఆ వస్తువును పొందాలి కానీ, చూచిందల్లా నాది కావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతివాడికి స్త్రీపురుషసంయోగం వలన కలిగే సుఖం అందించాలని, తద్వారా సృష్టి కార్యమును కొనసాగించాలనీ, వివాహ వ్యవస్థను పెట్టారు. ఏకపత్నీవ్రతమును ఆచరించమని మనకు రామాయణ మహాకావ్యాన్ని అందించారు వాల్మీకి. పరస్త్రీ వ్యామోహము వినాశనానికి దారితీస్తుంది అని రావణుని పాత్ర ద్వారా తెలియజేసారు. కులస్త్రీని అవమానిస్తే కులక్షయం అవుతుందని సుయోధనుని పాత్ర ద్వారా తెలియజేసాడు వ్యాసుడు. తాను పరిపాలించవలసిన గాంధార రాజ్యమును వదిలిపెట్టి, హస్తినలో తిష్టవేసి, సోమరిలా తింటూ, కుయుక్తులుపన్నుతూ, ఇతరులకు హాని చేస్తూ తామసంలో మునిగిపోయి తుదకు సర్వనాశనానికి దారితీసిన పరిణామాలను శకుని పాత్ర ద్వారా తెలియజేసాడు వ్యాసుడు. కాబట్టి అన్నీ అవసరమే కానీ ఎంత మేరకు అవసరమో అంతవరకే అనుభవించాలి. విచక్షణా బుద్ధిని కలిగి ఉండాలి. ఆహార, నిద్రా మైధునాలే పరమార్థంగా భావించకుండా, భగవధ్యానము, దైవచింతన, సత్సంగము, గురుసేవ, పరోపకారము, నిష్కామ కర్మ, నిరహంకారము, నిర్మోహత్వము ఇవి కూడా పరమార్థాలుగా భావించాలి. ఇదే గీతాబోధ.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment