Tuesday, March 25, 2025

 శ్రీ గురుచరణ సన్నిధి:
బ్రతికినంత కాలం ఈ మహాజ్ఞానం నాకు లభ్యం కాకపోయినా, కనీసం మరణశయ్యపై వున్నప్పుడు కొన్నిక్షణాలైనా ఆ జ్ఞాన కాంతులు నాపై ప్రసరించేట్టు అనుగ్రహించండి.

భగవద్గీత 8వ అధ్యాయంలో, మరణ సమయంలో ఏ భావం నిలిస్తే ఆ భావం తోనే వచ్చే జన్మ వస్తుందని, అయితే మరణ సమయంలో జ్ఞానం నిలవాలంటే ఇప్పుడే జ్ఞానం అరూఢం కావాలి. అట్ల కాకపోతే, మృత్యుసమయంలో జ్ఞాన ఆలోచనలు రావు. నిజం ఆలోచిస్తే ఈ క్షణమెటువంటిదో మృత్యుక్షణమూ అటువంటిదే. కనుక మీరు ఆకాంక్షిస్తున్న ఆ జ్ఞానాన్ని ఇప్పుడే ఇక్కడే పొందేటట్లు ఎందుకు ప్రయత్నించరు?

విచారము - అనుగ్రహము
శిష్యుడు: నేను బాహ్యసాధనముల సహాయమును పరిత్యజించి, స్వయంకృషివలననే నాయంతరాత్మను పొందవచ్చునన్న మాట.

మహర్షి: నిజమే. కాని, నీకు ఆత్మాన్వేషణ ( నిన్ను నీవు తెలుసుకోవలెనను బుద్ది ) కలుగుటయే ఈశ్వరానుగ్రహమునకు గుఱుతు. అది నీ హృదయమున నీయంతరాత్మయందు ప్రకాశించుచున్నది. అది లోపలనుండియే నిన్ను లోనికి రమ్మని లాగుతున్నది. నీవు వెలినుండి లోనికి ప్రవేశించుటకు ప్రయత్నించవలెను. నీవు చేయవలసిన ప్రయత్నము విచారమే! దీనికి ప్రతి, లేక మూలము అంతరాత్మ యొక్క అనుగ్రహము. అందుకనే అనుగ్రహము లేనిదే నిజమగు విచారముండదని చెప్పితిని. కాని, విచార ' మించుకైనను లేనివారికి అనుగ్రహమును కలుగదు; ఈ రెండును అవసరములే.

No comments:

Post a Comment