Sunday, March 30, 2025

 *కాల గమనం... కష్ట సుఖాల సంగమం!* 

*తీపి* 

*ఆనందాలు, సుఖాలు మన జీవితంలో తీపి వంటివి. రోజు వారి ప్రయాణంలో తీపి ఎంత ఎక్కువుంటే జీవితం అంత సాఫీగా సాగిపోతుంది. ఎవరికైతే సన్నిహితంగా ఉండే భాగస్వామి, కుటుంబసభ్యులు, స్నేహితులు ఉంటారో వారు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. వాళ్లతో మన భావాలు పంచుకోవడం వల్ల మనసులో ఉండే బరువు తగ్గుతుంది. ఇతర సమస్యలు, పని ఒత్తిడి వంటి వాటి నుంచి దూరం కావొచ్చు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎంత పనిఒత్తిడి ఉన్నా మన సన్నిహితులు, స్నేహితులకు సమయం కేటాయించాలి.*

*చేదు* 

*బాధ కలిగించే విషయాలు, జీవితంలోని కష్టాలు, బంధుత్వాలు తెగిపోవడం, ఇతర మనస్పర్ధలు ఉగాది పచ్చడిలోని చేదు లాంటివే. కష్ట కాలంలో మనల్ని ఎవరూ చేరదీయక పోవడం, ఆపత్కాలంలో అదుకోకపోవడం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇవి చేదుగానే ఉన్నా మనకు పాఠాలు నేర్పిస్తాయి. వ్యక్తిత్వాన్ని రాటుదేల్చి మనల్ని మనం మలుచుకునేలా చేస్తాయి. అందుకే జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, బాధపడటంకన్నా.... వాటన్నింటినీ ఎలా అధిగమించాలనే కోణంలోనే ఆలోచించాలి.*

*పులుపు* 

*ఏ పదార్థంలో అయినా పెరిగిన పులుపు తగ్గించేందుకు మరో పదార్థాన్ని జోడిస్తాం. అదే రుచి జీవితానికి అన్వయించుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్లు, కొన్ని సంఘటనలు ఇబ్బందిపెట్టినా, నచ్చకపోయినా వెనకడుగు వేయకూడదు. వాటికి తగ్గట్టు సర్దుకుపోవడమో, లేదా వాటిని ఎదురించి మనకు అనుకూలంగా మలుచుకోవడమో చేయాలి. వీటిని ఎదుర్కోవడం కొంచెం కష్టమనిపించినా ఒక్కోదాన్ని అధిగమించుకుంటూ వెళుతుంటే మనలో కొత్త ఉత్తేజం వస్తుంది. దేన్నయినా సాదించగలమనే నమ్మకం పెరుగుతుంది. ఇలాంటి అడ్డంకులు పనివాతావరణంలో ఎదురవుతాయి. సహచరుల నుంచి సహకారం అందకపోవడం, ఒకటనుకుంటే మరొకటి జరగడం ఇలా అనేకం ఉంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటే ఉద్యోగ జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది.*

*కారం* 

*కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే కోపం అలాంటిదే. ఇంటి పని, బయటి పని ప్రతిదీ దగ్గరుండి చూసు కోవడం, కుటుంబ సభ్యుల సహాయం లేక పోవడం, విపరీతమైన ఒత్తిడి... అన్నీ కలిపి అందుకు దారితీస్తాయి. అలాగని దాన్ని అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి. చుట్టూ ఉన్నవారు దూరమవుతారు. ఒంటరిగా మిగిలి పోవాల్సిన పరిస్థితి. అందుకే ఎప్పుడూ సహనం కోల్పోకుండా చూడండి. పచ్చడిలో కారం ఎంతుండాలో అంతుంటేనే రుచి. మితిమీరితే అది తినడానికి యోగ్యంగా ఉండదు. కోపం కూడా అంతే కొంత వరకే ఉండాలి. అవసరం అయినప్పుడే ఆఖరి అస్త్రంగా ఉపయోగించాలి.*

*వగరు* 

*ఉగాది పచ్చడిలోని మామిడి వగరుగా ఉన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీవితం కూడా అంతే. కొన్ని సందర్భాలు అనుకోకుండా ఎదురై... మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. అలాంటివి ఒడిసిపట్టుకోవాలి. వాటిని మధురజ్ఞాపకాలుగా మార్చుకోవాలి.*

*ఉప్పు* 

*ఉప్పులేని ఏ పదార్ధం అయినా చప్పగానే, రుచీపచీ లేకుండా ఉంటుంది. జీవితం కూడా అంతే. చదువు, ఉద్యోగం, ఇతర బాధ్యతలు... ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. వాటి లోనే మునిగిపోతే... యాంత్రికత తప్ప మరేమీ ఉండదు. అదే క్రమంగా నిరాశకు, అలసటకు దారితీస్తుంది. అందుకే జీవితానికి అవసరమైన ఉప్పురసాన్ని అందించేందుకు మీ వంతుగా ప్రయత్నించండి. ఓ అభిరుచి, ఓ వ్యాపకం, రోజూ కాసేపు వ్యాయామం, సరాదాగా గడిపే సమయాలు... అన్నీ ఉండాల్సిందే. అలాగని ఎక్కువైతే అధికరక్తపోటు మొదలైనట్లే... సమస్యలూ తప్పవని మరవకండి.*

*┈┉┅━❀꧁ ఉగాది ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🥭🎋🍃 🍋🕉️🍋 🍃🎋🥭

No comments:

Post a Comment