*ఉగాది పండుగ ప్రశస్తి*
*పురాణ... ఖగోళ పర్వం!*
*మనం ఉగాదిగా జరుపుకొంటున్న చైత్ర శుద్ధ పాడ్యమికి పౌరాణికంగా, ఖగోళ శాస్త్ర రీత్యా, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ రోజు గురించి ఒక్కో గ్రంథం ఒక్కొక్క రీతిలో వివరించింది.*
*బ్రహ్మపురాణం:*
*బ్రహ్మ ఆదిలో ఈ చరాచర సృష్టి అంతటినీ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడని 'బ్రహ్మ పురాణం' చెబుతోంది. అందుకే దీన్ని మానవ జాతి అంతా జరుపుకోవలసిన పర్వదినంగా పరిగణించవచ్చు.*
*నారద పురాణం:*
*చైత్ర శుక్ల పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో, సూర్యుడు అధిదేవతగా ఉన్న కాలంలో, ఆదివారం రోజున బ్రహ్మ సృష్టిని బహిర్గతం చేసినట్టు 'నారద పురాణం' పేర్కొంటోంది.*
*మత్స్య పురాణం:*
*విష్ణుమూర్తి మత్స్యరూపంలో సముద్రంలోకి చొచ్చుకువెళ్ళి, వేదాలను దొంగిలించిన రాక్షసుడిని సంహరించి, బ్రహ్మకు వేదాలను తిరిగి అందజేసిన శుభ దినం చైత్ర శుద్ధ పాడ్యమేనని 'మత్స్య పురాణం' వివరించింది.*
*రామాయణం:*
*పధ్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం చేసిన శ్రీరాముడు- రావణ సంహారానంతరం సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరుగు ప్రయాణ సన్నాహం చేసిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమేనట! అందువల్ల దీన్ని పుణ్య దినంగా పరిగణిస్తారు.*
*వసు చరిత్ర (భారతం):*
*పురు వంశానికి చెందిన వసురాజు ఒక పర్యాయం వేటకు వెళ్తాడు. అక్కడ ధ్యాన నిష్టలో ఆయన ఉన్న సమయంలో ఇంద్రుడు ప్రత్యక్షమై, అతిలోక సుందరమైన విమానాన్ని, ఎప్పటికీ వాడని పూలదండను ఇస్తాడు. యుద్ధంలో వాటిని ఉపయోగించి, అజేయుడిగా నిలవాలని చెప్పి అంతర్ధానమవుతాడు. మహిమాన్వితమైన ఆ వస్తువులతో వసురాజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తన పట్టణంలో ప్రవేశిస్తాడు. ఆ వస్తువుల మహిమను తెలుసుకున్న ప్రజలు ఇంద్రుని కీర్తిస్తూ పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఆ కారణంగా ఈ రోజును పర్వదినంగా పరిగణించారు.*
*ఖగోళ శాస్త్ర రీత్యా:*
*సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున భూమధ్య రేఖపై ఉంటాడని ప్రతీతి. అందువల్ల ఈ రోజున ఉగాది- దిన, మాస, వర్షారంభాలు ఒకేసారి ఏర్పడతాయి.*
*విక్రమార్క పట్టాభిషేకం:*
*పరాక్రమశాలి విక్రమార్క చక్రవర్తి శకులను ఓడించి, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు పట్టాభిషిక్తుడయ్యాడు. విక్రమార్క శకం ఆనాడే ప్రారంభమయింది. ఏ గ్రంథం ఏమని వివరించినా... ఒకటి మాత్రం నిజం. ఉగాది నవజీవనానికి నాంది!*
*┈┉┅━❀꧁ ఉగాది ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍃🥭🍃 🎋🕉️🎋 🍃🥭🍃
No comments:
Post a Comment