Sunday, March 23, 2025

 *ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది?* 
*శ్రీ కృష్ణుడు దాన్ని ఎందుకు ఆపలేదో తెలుసా ?* - 

> *THE LOST CITY OF DWARKA*
*సముద్ర గర్భాన మహాద్భుతం - కృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం- విశేషాలు ఇవే!ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తరువాత సముద్రగర్భంలో కలిసిపోయింది. అయితే ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు చెంపపెట్టు లాంటివి. ద్వారకలో మహా ప్రళయం సంభవించినప్పుడు అసలేం జరిగింది? ఇప్పటికీ సముద్ర గర్భాన ద్వారకా చెక్కు చెదరకుండా ఉందా! అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.*

> *మోక్షదామం*
*హిందువులు అతి పవిత్రంగా భావించే సప్త మోక్ష ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్‌లోని పశ్చిమ తీరంలో సముద్రతీరాన ఉంది.*

> *పురాణాల ప్రకారం అప్పట్లో ద్వారక*
*శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి.*

> *సుందర నగరం*
*గోమతీ నదీ తీరంలో కట్టిన సుందరం నగరం ద్వారక అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలో కూడా స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసి పోయింది. అసలు ఎందుకిలా జరిగింది? శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ద్వారక సముద్రంలో కలిసిపోయింది. ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.*

> *శ్రీకృష్ణుని నిర్యాణం*
*మహాభారత యుద్ధం క్రీ.పూ.3138లో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఓ శాపం ప్రకారం, కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనం అయినట్లు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్లుగా తెలుస్తోంది.*

> *ఆ రోజు అసలేం జరిగింది?*
*ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని, ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు.*

> *మహా ప్రళయానికి ప్రత్యక్ష సాక్షిగా అర్జునుడు*
*అర్జునుడు ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగింది.*

> *ఇది నిజమేనా? పరిశోధనలు ఏమంటున్నాయి?*
*ద్వారకాపురి సా.శ.1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం సా.శ..3150 ఏళ్ల కిందటిదని నిర్ధరించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోవడం దురదృష్టకరం.*

*ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కదూ! పురావస్తు అధికారులు సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన ద్వారక నగరం కట్టడాలను ద్వారకను చూడటానికి వెళ్లే యాత్రికుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. కృష్ణుడు నడయాడిన ద్వారకను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ద్వారక.*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🦚🌹 🙏🕉️🙏 🌹🦚🌹

No comments:

Post a Comment