ప్రస్తుతం *కోర్టు* సినిమాను ఆదరిస్తున్న వారికోసం...
నేను రాసిన సెలవు చీటీ కథ... ((అక్షరాలతోవ జాతీయ స్థాయి కథల పోటీలో బహుమతి పొందిన కథ...))
*ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడు తప్పక చదవాల్సిన కథ...*
*Miss use of POCSO act*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సెలవు చీటీ*
త్రీ టౌన్ పోలీసుస్టేషన్ లాకప్పులో నేలపై కూర్చుని ఉన్నాడు కమలాకర్. చిరిగిన బట్టలు, చొక్కా జేబులో పగిలిన రెడ్డు పెన్ను మిగిల్చిన ఎర్రని మరకలు, సగం ఊడిపోయిన టక్కు, ఒంటిపై దెబ్బలు, కళ్ళలో నీళ్ళు, నిస్సహాయమైన స్తితి, బిగిసిన పిడికిలి, మనసులో ఏవో ప్రశ్నలు, మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడు. నిన్న ఉదయం నుండి అతడు అలానే ఉన్నాడు. కానిస్టేబుల్ వచ్చి కోర్టుకు తీసుకెళ్ళాడు. అక్కడా అలానే ఉన్నాడు. కోర్టులో అతని ప్రమేయం లేకుండా ఏవేవో జరుగుతున్నాయి. కేసును పదిహేను రోజులకు వాయిదా వేసారు. ఈసారి సబ్ జైలుకు మార్చారు. నమోదుకోసం కమలాకర్ సర్ ను కేసు వివరాలను అడిగాడు డ్యూటీ ఇన్స్పెక్టర్. “మైనర్ రేప్” జీరబోయిన గొంతుతో చెప్పాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ స్పందిస్తూ “అదే సర్ ఆ కార్పొరేట్ స్కూల్ వ్యవహారం, ఒంటరిగా ఉన్న పదవతరగతి అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. అమ్మాయి వాళ్ళు వచ్చి బాగా దేహశుద్ధి చేసి, ఫోక్సో కేసు పెట్టారు,.” తనను కత్తితో పొడిచినట్లు చూసాడు కమలాకర్. కానీ ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. కమలాకర్ కి మొదటి బారక్ కేటాయించారు. తర్వాతి రోజు ములాఖత్ లో కలవడానికి వచ్చింది అతని భార్య. భర్తను చూస్తూనే ఆమె కళ్ళు వర్షించాయి. ఆమె ఏదేదో అడుగుతోంది, ఏవేవో చెబుతోంది, ఎవరెవరినో తిడుతూ శాపనార్థాలు పెడుతోంది. ఆయన ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. అనుకోకుండా అప్పుడే కమలాకర్ ప్రస్తుత శిష్యులు వచ్చారు. వాళ్ళు ఆయన మీద ఉన్న గౌరవం, భయం కొద్దీ ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయారు. ఆయన మౌనం కొనసాగుతూనే ఉంది. ఆ మౌనం ఆమెకు భయాన్ని, అసహనాన్ని పెంచేస్తోంది. ఆయన చేతిలో ఏదో కవర్ ఉంది. అదేంటని అడిగింది ఆమె, ఆయన సమాధానం చెప్పకుండా, ఆ కవరును ఆమె చేతికి అందించి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె ఆ పిల్లలవైపు తిరిగింది.
“అసలేమైంది బాబూ, ఆయన నోరు విప్పడం లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి”.
అభ్యర్ధిస్తున్నట్లుగా అడిగింది ఆమె.
“మొన్న ఆదివారం సాయంత్రం సర్ క్లాస్ అయిపోయిన తర్వాత అందరినీ దగ్గరుండి సారే పంపించి ఆయన కూడా వెళ్ళిపోయారు. కానీ కొన్ని బుక్స్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ క్లాస్ దగ్గరకు వెళ్ళారు. అప్పటికే క్లాస్ లో ఉన్న రఘు, రమ్యలను చూడకూడని స్థితిలో చూశారట కమలాకర్ సర్. ఆయనను చూసి రఘు పారిపోయాడట. రమ్య భయంతో కళ్లనీళ్లు పెట్టుకుందట. అప్పుడే సర్ ఆమెను మందలించి, ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోనని, పేరెంట్స్ కి, మేనేజ్మెంట్ కి చెప్తానని గద్దించి అక్కడినుండి పంపించేసారట. ఇదంతా రమ్యకు తోడుగా ఆగిన దివ్య, భవ్యాలకు తెలుసు. మా తరగతికి వెనకవైపు ఉన్న వాష్ రూమ్స్ నుండి వస్తూ గాయత్రి, ఆశ్రిత కూడా కిటికిలోనుండి చూసారు. వీళ్ళు చూసిన విషయం రమ్యకు తెలియదు. తన ఫ్రెండ్స్ చెప్పరనే ధైర్యంతో, రఘు గాడి అండ చూసుకుని రమ్య ఇంతకు తెగించింది. వాళ్ళు దొరికిపోకూడదని ఇలా సర్ ని ఇరికించారు. కమలాకర్ సర్ ను అరెస్టు చేసేవరకూ మాకు ఈ విషయమే తెలియదు. ఆ తర్వాత మేము ఎంతమందికి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఫోక్సో కేసు పెడితే మైనర్ అమ్మాయి ఏది చెబితే అదే ఫైనలట, అసలు నిజాలతో పనిలేదట. రమ్యా వాళ్ళ పేరెంట్స్ వచ్చి సార్ ని కొడుతున్నా తన మనసు కరగలేదు”. నిట్టూరుస్తూ చెప్పారు పిల్లలు.
అంతలోనే మేడంకు ధైర్యం చెబుతూ “మీరేమీ భయపడకండి, మేమంతా ఉన్నాం. సర్ మంచితనమే ఆయనకు శ్రీరామ రక్ష. త్వరలోనే ఆయన స్వచ్ఛంగా బయటకు వస్తారు”. ధీమాగా చెప్పారు. అక్కడినుండి వెళ్ళిపోతూ.
వాళ్ళ మాటలు విని ఆమె గుండె బరువెక్కింది. పిల్లలకు వీడ్కోలు చెప్పి, ఇల్లు చేరుకుని భర్త ఇచ్చిన ఉత్తరం తెరిచి చదవసాగింది.
“పదిహేను సంవత్సరాలుగా వ్యక్తిగత జీవితంకంటే ఉపాధ్యాయ వృత్తికే అధిక ప్రాధాన్యతనిస్తూ బ్రతికిన తెలుగు ఉపాధ్యాయుడిని నేను. భార్యా ఇద్దరు పిల్లలతో సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తిగా జీవిస్తూ, నా విద్యార్థులను ఆదర్శవంతమైన భావి పౌరులుగా సమాజానికి అందిస్తూ గౌరవప్రదంగా బ్రతికే వ్యక్తిని నేను. లక్ష్మీ కటాక్షానికి నోచుకోని సరస్వతీ పుత్రుడైన ఓ ప్రైవేటు టీచర్ని నేను. అయితే గురువు అనగానే ఓ దైవాంశ సంభూతుడుగా ఊహించుకుంటారు కానీ వెర్రిపోకడల ఈ కాలంలో గురువును వేదకాలపు ప్రమాణాలతో కొలవకండి. ఎందుకంటే నాడు గురువంటే ద్రోణాచార్యుడు, నేడు గురువంటే సమాజ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు. ఆ సంగతి తెలిసి కూడా నేను ఉపాధ్యాయుడిగా కొనసాగడానికి నిర్ణయించుకున్నాను.
ఎందుకంటే నేను ఈ వృత్తిని సాధారణంగా ఎంచుకోలేదు. అత్యంత ఇష్టంతో, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వం నిర్దేశించిన ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయుడిని నేను. పిల్లల సైకాలజీ, ఫిలాసఫీలను సాధికారతతో వంటబట్టించుకుని దానికి తగిన విధంగా భోధన చేస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ, ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థులను, నా యాజమాన్యాలను మెప్పించిన టీచర్ నేను.
అదంతా శూన్యమై నేను ఈ రోజు ఈ స్తితిలో ఉండడానికి కారణం కొందరు ఇమ్మెచ్యూర్ తల్లిదండ్రులు. పిల్లలు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి, అసలేం జరిగిందని కనీసం తెలుసుకోకుండా, కాస్త కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఆ తల్లిదండ్రుల మూర్ఖత్వం నా ఈ స్థితికి కారణం. వయసు దృష్ట్యా పిల్లల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులను తల్లిదండ్రులుగా వారు గుర్తించలేక పోయారు. సెకండ్ పెరెంట్ స్థానంలో నిలిచి, నేను గుర్తించి, గద్దించినందుకు, నాపై కోపంతో తమను తాము రక్షించుకోవాలనే ఆతృతలో, తెలిసి తెలియని వయసులో ఉన్న ఆ పిల్లలు చెప్పిన మాటలు విని నన్ను కొట్టి, నాపై కేసు పెట్టారు ఆ తల్లిదండ్రులు. దానిద్వారా ఏం సాధించారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చేసిన దానివల్ల ఆ పిల్లలకు గొప్ప మేలు చేశాము అనుకుంటున్నారు కాబోలు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఇవ్వాళ్ళో రేపో నిజం బయటకు రాకపోతుందా, ఆ తర్వాత ఆ పిల్లలు మిగతా ఉపాధ్యాయులతో సఖ్యంగా ఉంటూ చదువుకోగలరా! మరో టీచర్ ఎవరైనా వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకునే ధైర్యం చేస్తారా! తోటి పిల్లలు ఇలాంటి వాళ్ళని వాళ్ళలో కలుపుకుంటారా? ఇదంతా ఆలోచించే సహనం ఉందా వాళ్ళ తల్లిదండ్రులకు? నేను చేయని తప్పుకు నాకు ఇంతపెద్ద శిక్ష వేసి, తెలియక పిల్లలు చేసిన తప్పుకు వాళ్ళను ఇలా ఇరికించి, వాళ్ళు మాత్రం ఏదో సాధించినట్లు నలుగురిలో బీరాలు పోతూ ఉంటారు.
అసలు కొంతమంది తల్లిదండ్రులు వాళ్లకు తోచినట్లుగా వాళ్ళ పైత్యమంతా రంగరించి పిల్లలను పెంచుతూ, దేశానికి సొత్తుగా ఎదగాల్సిన చిన్నారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను విపరీతంగా ముద్దు చేస్తూ, వారు వాళ్ళ బలహీనతగా మారడమే కాదు కాస్త మార్చాలని ప్రయత్నించే ఉపాధ్యాయులను ఆ పిల్లల ముందే అమర్యాదగా తిట్టడమే గొప్ప అనుకుంటున్నారు, అలాంటి పెంపకంలో పెరిగిన వాళ్ళు రేపు తల్లిదండ్రులు ఒక్క మాట అన్నా వాళ్లకు కనిపించేది ఒకేఒక్క దారి ఆత్మహత్య. పిల్లలకి కష్టం తెలియకుండా పెంచుతూ అడక్కుండానే అన్నిరకాల విలాసాలను అందిస్తూ, వాటికి వారిని బానిసలుగా చేసే అమ్మానాన్నలు మరో వైపు. అలా పెరిగిన వాడు రేపు కర్మగాలి పరిస్థితి తారుమారై కిందపడి లేవాలంటే వాడు కనీసం ప్రయత్నం కూడా చేయలేడు. ఇక ఇంకో రకమైన తల్లిదండ్రులు, చక్కగా చదివి దేశానికి, సమాజానికి ఉపయోగ పడాల్సిన విద్యార్థులను మతాలకు అంకితం చేస్తూ, వారిని దిష్టి గుమ్మడికాయల్లా మారుస్తున్నారు వాళ్ళు. పాఠశాలలో మాకు తరుచుగా వినపడే కొన్ని మాటలు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అంటాడొకడు. నువ్వన్ని ఎత్తు పల్లాలు చూసే కదా అంత సమర్ధుడిగా మారావు, మరి నీ వారసత్వాన్ని మాత్రం అసమర్ధులుగా చేస్తావా, నా కొడుకును నేనే కొట్టను, నువ్వెవర్రా కొట్టడానికి! అంటాడు మరొకడు. నువ్వు కొట్టక పోవడం, నువ్వు వాడి జీవితానికి చేస్తున్న మోసం. నన్ను కొట్టొద్దనడం, వాడి జీవితానికి నువ్వు చేస్తున్న ద్రోహం. నువ్వు బోటు, నేను తెడ్డు రెండూ వదిలేస్తే వాడు మునిగిపోవలా, ఇలా కన్న బిడ్డల భవిష్యత్తును చీకటిలో కలిపేస్తున్నారు.
అసలు ఇదంతా కాదు, సమాజంలో ఓ డాక్టరుకు, ఓ లాయరుకు, ఓ పోలీసుకు, ఓ ఇంజనీరుకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు అందరికీ శిక్షణా, పర్యవేక్షణ, ఉన్నాయి. కానీ భావి సమాజాన్ని కని, పెంచే తల్లిదండ్రులకు, వాళ్ళ పెంపకానికి ఏదీ కొలమానం! వారికే ది శిక్షణ!, పర్యవేక్షణ!! వారి అపరిపక్వపు భావజాలంతో కూడిన ప్రేమ దారి తప్పుతున్న ప్రస్తుత తరుణంలో, కనడమో, డబ్బు ఖర్చు పెట్టడమో చేస్తే సరిపోతుందా! అదేనా వారి అర్హత? వారు ఎంత గొప్ప చదువులైనా చదివి ఉండవచ్చు, పిల్లలు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలగొచ్చు కానీ వాళ్ళ పిల్లలను చదివే నేర్పు, వాళ్ళను ఉత్తములుగా తీర్చిదిద్దే ఓర్పు ఉండక్కర్లేదా! నా ఉద్దేశం అలా పెంచే తల్లిదండ్రులు లేరని కాదు, ఉన్నారు. కానీ ఆ శాతం చాలా తక్కువ. ఆ మిగిలిన శాతానికి, వారు పెంచేది వారి పిల్లలనే కాదు, దేశ భవష్యత్తును అని, వారి పిల్లలు దేశం సొత్తని వారికి తెలిసేదెలా? అలా తెలియాలంటే పిల్లలను కాదు ముందు వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని సంస్కరించాల్సిన తరుణమిది. అందుకే రాబోయే తరానికి మరింత గొప్ప విలువలతో కూడిన తల్లిదండ్రులను అందిద్దాం. ఇప్పటికే తల్లిదండ్రులుగా ఉన్న వారికి, కొత్తగా తల్లిదండ్రులుగా మారాలనుకునే ప్రతి జంటకు ప్రభుత్వం ఓ కోర్సు పెట్టాలి. స్వార్థం పెరిగిపోయిన నేటి కాలంలో విశ్వమానవసౌభ్రాతృత్వాన్ని, దేశభక్తిని, మానవత్వాన్నీ పిల్లలకు నేర్పేలా, పిల్లల మనస్తత్వాన్ని తీర్చి దిద్దగలిగేలా ఆదర్శాలు, నైతికవిలువలతో పాటు చైల్డ్ సైకాలజీతో కూడిన ఒక శిక్షణా కోర్సును నిర్దేశించాలి. ఆ సర్టిఫికెట్ ఉంటేనే వారిని తల్లిదండ్రులుగా మారేందుకు అనుమతించాలి. దీన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇదంతా అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యమన్నదే లేదు. మార్పు వేగంగా రాకపోవచ్చు, కానీ నిజాయితీగా ప్రయత్నిస్తే శాశ్వతంగా వస్తుంది. నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో తెలియదు. నేను ఆ శిక్షను ఓ మొక్కుగా స్వీకరిస్తాను. నేను మొక్కు తీర్చుకునే సరికైనా నేను కోరిన వరాన్ని దేవుడు నాకు ఇచ్చి, నేను తిరిగొచ్చే సరికి సమాజంలో నేను ఆశించిన మార్పు వస్తె అంతకు మించిన ఆనందం నాకు మరొకటి ఉండదు. నేను తిరిగి వచ్చే సరికి, నేను కోరుకున్న ప్రకారం సమాజం మారినా, మారక పోయినా నేను మాత్రం ఉపాధ్యాయుడుగానే కొనసాగుతాను. ప్రస్తుతం ఇది నా సెలవు చీటీ మాత్రమే, రాజీనామా కాదు. బోధనకు నా జీవితంలో విరమణ లేదు”..
ఫ్రమ్ అడ్రెస్సే తప్ప టూ అడ్రస్సు లేని ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదివి కళ్ళ నీళ్ళు తుడుచుకుని, లేచి బయలుదేరింది. బెయిల్ పనిమీద లాయర్ని కలవడానికి. పోతూ పోతూ ఆ ఉత్తరాన్ని టీపాయ్ మీద పెట్టి అది ఎగిరి పోకుండా దానిపై ఓ చివరకు పేపర్ వెయిట్ పెట్టింది. యానక రహిత శబ్ద తరంగమై ప్రతిధ్వనించే కమలాకర్ సర్ ఆవేదనను మోస్తున్న ఆ ఉత్తరం మాత్రం రెపరెపలాడుతూ ఎవరికో చేరాలని విఫలయత్నం చేస్తూనే ఉంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*🌹SagarragaS🌹*
No comments:
Post a Comment