*ఔన్నత్యం*
యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః న యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
3-21
భావం: దేనినైతే శ్రేష్ఠులైన వారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలని అంతా పాటిస్తారు. ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇది.
1
1986లో మిస్సౌరి రాష్ట్రంలోని కేన్సాస్ సిటీలో పోలీస్ శాఖ అధికారులు తమ దగ్గర పేరుకుపోయిన, ఎవరూ తమదని క్లెయిమ్ చేస్తూ ముందుకురాని వారి వస్తువులని వేలం వేయసాగారు. కెమేరాలు, టి. విలు, స్టీరియోలు, కార్ రేడియోలు... ఇలా అనేక రకాల వస్తువులని వారు వేలం వేస్తున్నారు. వారు వేలం వేసే వాటిలో కొన్ని సైకిళ్ళు కూడా ఉన్నాయి.
మొదటి సైకిలు వేలానికి రాగానే వేలంపాట పాడేవాడు అడిగాడు.
"ఎవరు మొదటగా పాటని పాడుతారు?"
ఓ పది-పన్నెండేళ్ళ చిన్న పిల్లవాడు ఉత్సాహంగా అరిచాడు.
"నేను, నా పాట ఐదు డాలర్లు."
"ఐదు డాలర్లు. తర్వాతి వారి పాట ఎంత? పది? పదకొండు డాలర్లు ఎవరైనా పాడుతారా?"
పాట సాగింది కాని ఆ పిల్లవాడు దాంట్లో తర్వాత పాల్గొనలేదు. తర్వాత ఇంకో సైకిల్ని కూడా వేలానికి పెట్టారు. ఆ కుర్రాడు ఐదు డాలర్లతో పాటని మొదలెట్టాడు. ప్రతీ కొత్త సైకిల్కి ఆ కుర్రాడు ఐదు డాలర్లనే పాడాడు.
అంతకంటే మిగిలిన వాళ్ళు ఎక్కువ పాడితే అతను తన పాటని కొనసాగించలేదు.
క్రమంగా అక్కడున్న వారందరికీ అర్థమైంది ఆ పిల్లవాడు సైకిల్ పాటని ఆరంభించి, ఎక్కువ ధర పలికితే విచారపడుతూ దాన్ని కొనసాగించడంలేదని.
ఇంకొక్క సైకిలే మిగిలి ఉంది. వేలం పాట పాడేవాడు ఆ కుర్రాడిని అడిగాడు.
"చాలా మంచి సైకిళ్ళని అంతా పదిహేను ఇరవై డాలర్లకి కొంటున్నారు.. అది చవక కదా, మరి నువ్వు ఎందుకు ఎక్కువకి పాడటం లేదు?"
"నా దగ్గర ఉన్నది ఐదు డాలర్లే." విచారంగా చెప్పాడు ఆ కుర్రాడు.
అరవై తొమ్మిది సెంటిమీటర్ల చక్రాలు గల ఆఖరి సైకిలికి డ్యూయల్ పొజిషన్ బ్రేక్ లీవర్స్, గేర్ ఛేంజర్స్, జనరేటర్ లైట్ ఉన్నాయి. దాని వేలంపాట
మొదలవగానే ఆ కుర్రాడు ఎప్పటిలా ఐదు డాలర్లతో పాటని ప్రారంభించాడు.
"పది డాలర్లు ఎవరి పాటో చెప్పండి." అడిగాడు వేలం పాట పాడేవాడు.
ఐతే అక్కడ గుమిగూడిన వారిలో ఎవరూ నోరు మెదపలేదు. నిశ్శబ్దంగా ఆ సైకిల్ వంక, ఆ కుర్రాడి వంక చూడసాగారు. వేలంపాట వాడు తర్వాతి పాటగాడు ఆ నిశ్శబ్దాన్ని గమనించి 'తర్వాతి పాట ఎంత?' అని అడగడం మానేసాడు. ఒక్క గొంతు కూడా 'పది డాలర్లు' అని పాటని పెంచలేదు.
"సోల్డ్ టు ది యంగ్ మేన్ ఇన్ షార్ట్స్ ఫర్ ఫైవ్ డాలర్స్." చివరకి చెప్పాడు వేలంపాట వాడు.
ఆ కుర్రాడు తన నిక్కర్ జేబులోంచి చిల్లరని తీసి లెక్క పెడుతూంటే అక్కడ పాటకి వచ్చినవారంతా ఆనందంగా చప్పట్లు చరిచారు. అనేకమంది
ఆశీస్సులతో, సహకారంతో లభించిన అది ఖచ్చితంగా ప్రపంచంలోని అతి అందమైన సైకిల్.
No comments:
Post a Comment